తెలంగాణపై ఎలాంటి చర్యలొద్దు

ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్‌ బకాయిలను చెల్లించే విషయమై.. తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదంటూ కేంద్రానికి బుధవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఏపీకి మొత్తం రూ.6,756.92

Published : 29 Sep 2022 04:34 IST

విద్యుత్‌ బకాయిల వ్యవహారంలో కేంద్రానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్‌ బకాయిలను చెల్లించే విషయమై.. తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదంటూ కేంద్రానికి బుధవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఏపీకి మొత్తం రూ.6,756.92 కోట్లను (బకాయిలు రూ.3,441.78 కోట్లు, చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు సర్‌ఛార్జి తదితరాలు రూ.3,315.14 కోట్లు కలిపి) 30 రోజుల్లో చెల్లించాలంటూ ఆగస్టు 29న కేంద్రం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు వేర్వేరుగా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై బుధవారం జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యుత్‌ సంస్థల వాదనను వినకుండా కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం ప్రాథమికంగా చట్ట ఉల్లంఘనేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారానికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతోపాటు ఏపీ ప్రభుత్వం, ఏపీ విద్యుత్‌ సంస్థలను ఆదేశిస్తూ.. విచారణను అక్టోబరు 18వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, న్యాయవాది వై.రామారావులు వాదనలు వినిపిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను దక్షిణ ప్రాంత మండలికి నివేదించి అక్కడ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా నేరుగా కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం సహకరించినందున దానికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు. గతంలో విడిపోయిన రాష్ట్రాల్లో ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోయినా తెలుగు రాష్ట్రాల విషయంలో సత్వర నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కేంద్రానికి ఇద్దరు బిడ్డలతో సమానమని, ఒకరిపై పక్షపాతం చూపడం ఎంతవరకు సమంజసమని వాదనలు వినిపించారు. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ విద్యుత్‌ ఉత్పత్తికి భారీ రుణాలు తీసుకుని చెల్లించని కారణంగా ఏపీ పవర్‌ డిస్కంలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయన్నారు. సుమారు రూ.7 వేల కోట్లు చెల్లించకపోవడంతో ఇబ్బందులున్నాయని తెలిపారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ తమ జోక్యం వల్లనే ఏపీ పవర్‌ డిస్కంలు తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేశాయన్నారు. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని కేంద్రానికి ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని