యువత వ్యక్తిత్వంపైనే దేశ భవిత

యువతరం వ్యక్తిత్వంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సిల్వర్‌జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

Updated : 03 Oct 2022 06:24 IST

సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: యువతరం వ్యక్తిత్వంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సిల్వర్‌జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మాతృభాషను, మాతృభూమిని, తల్లిదండ్రులతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పుడూ మరువొద్దని సూచించారు. పురాణాలు, ఇతిహాసాలు, పండితులను గౌరవించాలన్నారు. యువత సామాజిక బాధ్యతను గుర్తెరిగి మెలగాలని కోరారు. భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. కొవిడ్‌ సమయంలో ఎంతోమంది అవసరాలు తీర్చారని కొనియాడారు. విద్య అనేది భౌతిక, నైతిక విలువలను పెంపొందించేలా ఉండాలన్నారు. జీవితంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదురైనప్పుడు.. సరైన నిర్ణయం తీసుకోవడానికి అది సాయపడుతుందన్నారు. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి లాంటి వారి త్యాగాల వల్లే మనం స్వేచ్ఛ పొందామని, దాన్ని బాధ్యతగా ఉపయోగించుకోవాలని సూచించారు. త్రిదండి చినజీయర్‌స్వామి మాట్లాడుతూ విద్యతో పాటు హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విద్య అందిస్తున్న గురుకుల పాఠశాలను అభినందించారు. భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో రాణించాలంటే విలువలతో కూడిన విద్య తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. స్వామి నారాయణ గురుకులం ఆధ్వర్యంలో ‘ధర్మ జీవన్‌ అమృత్‌కుంభ్‌’ పురస్కారాలు, జ్ఞాపికలతో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, కృష్ణ ఎల్లలను సత్కరించారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్‌ ఓజా, స్వామి నారాయణ గురుకులాల వ్యవస్థాపకులు ధర్మజీవన్‌దాస్‌జీ స్వామితోపాటు దేవ్‌కృష్ణదాస్‌జీ స్వామి, దేవ్‌ప్రసాద్‌దాస్‌జీ స్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని