ప్రాణం పోయినా భూమిని ఇవ్వం!

ప్రాణం పోయినా జాతీయ రహదారి కోసం తమ భూమిని వదలబోమంటూ హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద భూనిర్వాసితులు ఆదివారం ధర్నా చేశారు.

Published : 05 Dec 2022 04:24 IST

గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణంపై నిర్వాసితుల నిరసన
హనుమకొండ జిల్లాలో పెద్దఎత్తున ధర్నా

దామెర(హనుమకొండ జిల్లా), న్యూస్‌టుడే: ప్రాణం పోయినా జాతీయ రహదారి కోసం తమ భూమిని వదలబోమంటూ హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద భూనిర్వాసితులు ఆదివారం ధర్నా చేశారు. భారత్‌మాల పరియోజనలో భాగంగా నాగ్‌పుర్‌-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తమ భూముల గుండా నిర్మించడాన్ని రైతులు వ్యతిరేకించడంతో.. సుమారు 10 నెలల క్రితం పోలీసుల సమక్షంలో అధికారులు సర్వే నిర్వహించారు. తాజాగా రెండు రోజుల క్రితం మంచిర్యాల-వరంగల్‌ మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లను ఆహ్వానించింది. విషయం తెలుసుకున్న నిర్వాసితులు ఆదివారం 163వ నంబరు జాతీయ రహదారిపై ఊరుగొండ వద్ద ధర్నా చేపట్టారు. వరంగల్‌, హనుమకొండ, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం జిల్లాలకు చెందినవారు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తమ భూములను ఇచ్చేది లేదని నినాదాలు చేస్తూ.. పురుగు మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమించాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సుమారు రెండు గంటల అనంతరం నిర్వాసితులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పంపించి ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పర్యావరణ అనుమతులు లేకుండా టెండర్లను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని