హయత్‌నగర్‌ వరకు మెట్రో

మెట్రో రైలును ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Updated : 07 Dec 2022 06:51 IST

ఏప్రిల్‌ తర్వాత ఎస్‌ఎన్‌డీపీ రెండో దశ పనులు
మళ్లీ వచ్చేది తెరాస ప్రభుత్వమే.. కేసీఆరే సీఎం: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌, బండ్లగూడ, న్యూస్‌టుడే: మెట్రో రైలును ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. దీంతోపాటు నాగోల్‌-ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ఐదు కిలోమీటర్ల అనుసంధాన ప్రక్రియనూ పూర్తి చేస్తామన్నారు. మళ్లీ రాబోయేది తెరాస ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి కేసీఆరే అని నొక్కి చెప్పారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలో నాగోల్‌ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్‌ డ్రైన్‌, ఫతుల్లాగూడ-పీర్జాదీగూడ లింకు రోడ్డు, ఫతుల్లాగూడలో మూడు మతాలకు వేర్వేరుగా నిర్మించిన శ్మశానవాటిక ముక్తిఘాట్‌, పెంపుడు శునకాల విద్యుత్తు దహనవాటికను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫతుల్లాగూడలో ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. పేదల ముఖంలో సంతోషాన్ని చూడాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆసరా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. అదే సమయంలో పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, పర్యావరణం, వ్యవసాయం, ఐటీ రంగంలో సరికొత్త నమూనాను ఆవిష్కరించిందని తెలిపారు. జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామాల్లో అత్యధికం తెలంగాణవేనని, స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు 26 పురస్కారాలు దక్కాయన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో తెలంగాణ దూసుకెళ్తోందనేందుకు ఇవి నిదర్శనాలన్నారు. హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం 7.7% పెరిగిందని, అందులో భాగంగానే చెత్తతో నిండిన ఫతుల్లాగూడ ఉద్యానవనంలా మారిందన్నారు.

ఏప్రిల్‌లో రెండో దశ ఎస్‌ఎన్‌డీపీ

నగరవ్యాప్తంగా వరదనీటి కట్టడికి రూ.985 కోట్లతో ఎస్‌ఎన్‌డీపీ(వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం)-1 కింద నాలాలను కొత్తగా నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ‘‘గ్రేటర్‌ పరిధిలో నిర్మించతలపెట్టిన 34 నాలాల్లో ఇప్పటికే రెండు అందుబాటులోకి వచ్చాయి. నెలాఖరు నాటికి 17 పూర్తవుతాయి. వచ్చే ఏడాది జనవరిలో మిగిలినవి పూర్తిచేస్తాం. హుస్సేన్‌సాగర్‌, బుల్కాపూర్‌ నాలా పనులు ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయి. తర్వాత ఎస్‌ఎన్‌డీపీ రెండో దశ పనులు మొదలవుతాయి’’ అని మంత్రి వివరించారు. మూసీనదిపై కొత్తగా 14 వంతెనలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. జంతు కళేబరాల డంపింగ్‌యార్డుగా పిలిచే ఆటోనగర్‌లో పూలవనం ఏర్పాటుకు అనుమతిస్తామన్నారు. మూడు జిల్లాల పరిధిలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఇచ్చిన అవకాశాన్ని ఈ నెల 20 లోపు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌, వాణీదేవి, దయానంద్‌, శంభీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని