‘చేనేత’లో ఇక్కడ గొప్పగా అభివృద్ధి

చేనేత రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందని, ఈ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన చేనేత, జౌళి పరిశోధకురాలు కైరా జాప్‌ గాబ్రియేల్‌ ప్రశంసించారు.

Updated : 08 Dec 2022 05:28 IST

ఇతర దేశాల్లో ఎక్కడా లేని కళానైపుణ్యం తెలంగాణ ప్రత్యేకం
మంత్రి కేటీఆర్‌కు వివరించిన అమెరికా పరిశోధకురాలు కైరా జాప్‌ గాబ్రియేల్‌

ఈనాడు, హైదరాబాద్‌: చేనేత రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందని, ఈ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన చేనేత, జౌళి పరిశోధకురాలు కైరా జాప్‌ గాబ్రియేల్‌ ప్రశంసించారు. తాను ఇప్పటికే ఎనిమిది దేశాలు పర్యటించి, భారత్‌కు వచ్చానని తెలంగాణ రాష్ట్రం... చేనేత రంగంలో గొప్పగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇతర దేశాల్లో ఎక్కడా లేని కళా నైపుణ్యం ఇక్కడి చేనేత వస్త్రాల్లో ఉందని, వాటికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ లభిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో వారం రోజులుగా పర్యటిస్తున్న ఆమె బుధవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన అధ్యయనంలోని అంశాలను ఆమె వివరించారు. ‘‘పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో చేనేత వస్త్రాల ఉత్పత్తి, అక్కడి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించా. రాష్ట్రంలోని చేనేత కళాకారుల నిబద్ధత చాలా గొప్పది. తరతరాలుగా వస్తున్న చేనేత కళల సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న తపన వారిలో ఉంది. వందల మంది సామూహికంగా ఒకే చోట కలిసి పనిచేయడం ద్వారా బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు. ఇక్కడి చేనేతల్లో కళా నైపుణ్యం ఎంతో విలువైనది. ప్రపంచ మార్కెట్లలో దీనికి చక్కటి డిమాండు ఉంది. దేశంలో చేనేత ఉత్పత్తులు కేవలం చీరలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.  దుస్తులు, ఇతర ఉత్పత్తులకు చేనేత, పట్టు పరిశ్రమలను అనుసంధానం చేస్తే మంచి మార్కెట్‌ ఏర్పడుతుంది. సాంకేతికత, ఆవిష్కరణలను అనుసంధానం చేస్తే  చేనేత కళ సమున్నతంగా కొనసాగడంతో పాటు శాశ్వతంగా విశ్వవ్యాప్తమవుతుంది’’ అని వివరించారు.

చేనేత రంగానికి అత్యధిక ప్రాధాన్యం

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ కైరాను అభినందించారు. చేనేత రంగంపై ప్రేమతో సుదీర్ఘ అధ్యయనం చేస్తూ ఈ రంగం అభ్యున్నతికి చక్కటి సూచనలు, సలహాలు ఇస్తున్నారని ప్రశంసించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం నేతన్నల కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా విస్తృత స్థాయిలో  కార్యక్రమాలను చేపట్టింది. వారికి చేతినిండా ఉపాధిని ఇస్తున్నాం. ఏ కష్టం లేకుండా చూస్తున్నాం. ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న రంగం ఇప్పుడు సుసంపన్నంగా మారింది. మీ వంటి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వాటి అమలుపై దృష్టి సారిస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని