పట్టణాభివృద్ధికి రూ.14,900 కోట్లు!

రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు రానున్న బడ్జెట్‌లో నిధులను భారీగా పెంచాలని పురపాలకశాఖ ప్రతిపాదించింది.

Updated : 25 Jan 2023 04:41 IST

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
గతం కంటే అధికంగా కోరిన పురపాలకశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు రానున్న బడ్జెట్‌లో నిధులను భారీగా పెంచాలని పురపాలకశాఖ ప్రతిపాదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ వ్యయం రూ.3792 కోట్లు కాగా అభివృద్ధి పథకాలకు రూ.6798 కోట్లను ప్రతిపాదించారు. రాబోయే బడ్జెట్‌లో పథకాలకు రూ.10,000 కోట్లు, నిర్వహణ వ్యయం కలిపి సుమారు రూ. 14,900 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి బడ్జెటేతర రుణాలను చేర్చడంతో మౌలిక సదుపాయాలకు నిధులను ఆశించిన మేర సమకూర్చుకునే అవకాశం లేనందున బడ్జెట్‌లోనే కేటాయింపులు పెంచాలని పురపాలకశాఖ కోరుతోంది. మరో రెండేళ్లలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల జనాభా 50 శాతానికి చేరుకునే దిశగా వెళ్తుండడంతో హైదరాబాద్‌ సహా ప్రధాన పట్టణాల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రధానంగా పురపాలికలకు వడ్డీలేని రుణం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, అభివృద్ధి పనులకు నిధులు, వరంగల్‌, కరీంనగర్‌, రామగుండం, ఖమ్మం, నిజామాబాద్‌ నగరపాలక సంస్థలకు ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు పెంచాలని కోరారు. ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ మార్గ నిర్మాణానికి రాబోయే బడ్జెట్లో కనీసం రూ. 2000 కోట్లు అవసరమని అంచనా వేశారు. వరంగల్‌ నియో మెట్రోకు కేంద్ర నిధులను ఆశిస్తున్నా అది కార్యరూపం దాల్చడంలేదు. దీనికి రాష్ట్ర సర్కారు గత బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించినా ఖర్చు చేయలేదు. ఈ ప్రాజెక్టుకు కొత్త బడ్జెట్‌లో నిధులివ్వాలని కోరినట్లు తెలిసింది. స్మార్ట్‌సిటీ, అమృత్‌ 2.0కు రాష్ట్ర వాటా నిధులను పెంచే దిశగా ప్రతిపాదించారు. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు, స్మార్ట్‌సిటీ, అమృత్‌ మినహా ఇతర నిధులు అందే అవకాశం లేకపోవడంతో పురపాలకశాఖకు కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు