చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో వాసవి ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.

Published : 27 Apr 2024 04:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌లో వాసవి ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. వీటితోపాటు ఈ నెల 25న బాచుపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి చెందిన సర్వేయర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రూపొందించిన నివేదికను కూడా సమర్పించాలని నిర్దేశించింది. ప్రభుత్వ శాఖలు దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించడంలో తగిన చొరవ చూపడం లేదని, అందువల్ల ఎఫ్‌టీఎల్‌ జోన్‌లో నిర్మాణాలకు సంబంధించి తాజా ఆధారాలను ఫొటోలతో సహా సమర్పించాలని ఆదేశించింది. బాచుపల్లిలో సర్వే నం.127/పీ, 128/పీ, 137/పీల్లో కోమటికుంట ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలో వాసవి ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ 8, 9 బ్లాక్‌ల నిర్మాణాలు చేపట్టినా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ నిజాంపేటకు చెందిన ఎ.సతీష్‌ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతోపాటు తమ నిర్మాణాలను నిలిపివేస్తూ హెచ్‌ఎండీఏ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వాసవి ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ పిటిషన్‌ దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాసవి తరఫు సీనియర్‌ న్యాయవాది బి.మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ అన్ని అనుమతులు తీసుకున్నాకే 12 బ్లాక్‌లతో నిర్మాణాలు కొనసాగిస్తున్నామన్నారు. ఎఫ్‌టీఎల్‌లో 8, 9 బ్లాక్‌లు ఉంటున్నాయన్నదే ప్రధాన ఆరోపణ అని అన్నారు. దీనికి సంబంధించి సర్వే పూర్తయిందని, నిర్మాణాలు బఫర్‌జోన్‌లో జరగడం లేదని నివేదిక వచ్చిందన్నారు. ఒకవేళ బఫర్‌జోన్‌లో ఈ రెండు బ్లాక్‌ల నిర్మాణం జరిగిందని తేలితే తామే కూల్చివేస్తామని హామీ ఇస్తామన్నారు.

విక్రయించాక బాధ్యత ఎవరిది?

నిర్మాణాలు పూర్తిచేసి ఫ్లాట్లను విక్రయించి నిర్మాణసంస్థ వెళ్లిపోతుందని, తర్వాత బఫర్‌జోన్‌లో నిర్మాణాలున్నాయని తేలినా తమకు సంబంధం లేదంటే పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా వాసవి తరఫు న్యాయవాది సమాధానమిస్తూ ఈ రెండు టవర్లలోని ఫ్లాట్లను విక్రయించగా వచ్చిన సొమ్మును ఎస్క్రో ఖాతాలో ఉంచుతామన్నారు. ఒకవేళ బఫర్‌జోన్‌లో ఉన్నాయని తేలితే ఆ సొమ్మును ఫ్లాట్లు కొనుగోలు చేసినవారికి ఇస్తామన్నారు. ఇప్పటికే 50 శాతం ఫ్లాట్లు విక్రయించామనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తమకు తెలియకుండా నిర్మాణాలపై ఈ హామీ ఇచ్చారని ఇప్పటికే కొనుగోలు చేసినవారు అడిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా సొమ్ము వాపసు ఇస్తామన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.వెంకటరాజుగౌడ్‌ వాదనలు వినిపిస్తూ ఇటీవల కూడా జీహెచ్‌ఎంసీ అధికారుల బృందం పరిశీలించి వాసవి నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని