గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?

మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్‌ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించినట్లు తెలిసింది.

Updated : 27 Apr 2024 05:47 IST

నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్‌ పీసీ ఘోష్‌!

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్‌ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. ‘బ్యారేజీ పరిస్థితి సరిగా లేదని సంబంధిత ఇంజినీర్లు ఎన్ని సార్లు లేఖలు రాశారు? చీఫ్‌ ఇంజినీర్‌ ఎన్ని సార్లు రాశారు? వాటికి  స్పందించకపోతే ఏం చేశారు? ఈ వివరాలన్నింటినీ అందజేయండి’ అని అధికారులను కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. న్యాయ విచారణలో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులు కాళేశ్వరం ఎత్తిపోతల గురించి, గత అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాల గురించి జస్టిస్‌ ఘోష్‌కు సమగ్రంగా ప్రజంటేషన్‌ ఇచ్చారు. బ్యారేజీ కుంగిన రోజు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ అధికారి తమదే పునరుద్ధరణ బాధ్యత అని ప్రకటించడం మొదలు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) అధికారులు పరిశీలించి ఇచ్చిన నివేదిక, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ చేపట్టిన విచారణ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు నివేదికలోని అంశాలను వివరించారు. మేడిగడ్డ ఏడో బ్లాకులో ఈఆర్‌టీ, జీపీఆర్‌ పరీక్షలు పూర్తయ్యాయని, ఎనిమిదో బ్లాకులో పూర్తి కావచ్చాయని తెలిపారు. ఒకటి నుంచి ఐదో బ్లాకులో కూడా జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామని నివేదించారు. మరమ్మతులకు వీలుకాకుండా కుంగిన బ్లాకులోని కొంతభాగాన్ని పూర్తిగా తొలగించాల్సి వస్తే, ఇందులో ఏమేమి తొలిగించాల్సి ఉంటుంది, అందులో ఎన్ని క్యూబిక్‌మీటర్ల కాంక్రీటు పని ఉంటుంది తదితర వివరాలన్నీ కూడా నివేదించినట్లు తెలిసింది.

మరింత సమాచారం కోరిన జస్టిస్‌ ఘోష్‌

అధికారుల ప్రజంటేషన్‌ తర్వాత జస్టిస్‌ ఘోష్‌ పలు ప్రశ్నలను లేవనెత్తి వివరాలు కోరినట్లు సమాచారం. ఎన్నిసార్లు గడువు పొడిగించారు, పొడిగింపునకు సిఫార్సు చేయడానికి కారణాలేంటి, ఎంత మొత్తం ఈఎండీలు ఉన్నాయి, ఎంత విడుదల చేశారు తదితర వివరాలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యారేజీలలో నీటిని ఎప్పుడు నిల్వ చేయడం ప్రారంభించారు, ఇలా నిల్వ చేసిన తర్వాత, బ్యారేజీ డిస్ట్రెస్‌ కండిషన్‌లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయి, ఎన్నిసార్లు వాటిని యాథాస్థితికి తెచ్చారు, ఇలా తేనప్పుడు ఎన్నిసార్లు నోటీసులిచ్చారు తదితర వివరాలను కూడా కోరినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీలో ఒప్పందం ప్రకారం ఎంత పని పూర్తయింది, ఇంకా ఎంత పని పెండింగ్‌లో ఉంది తదితర వివరాలను తెలుసుకోవడంతోపాటు త్వరగా నివేదిక  ఇవ్వాలని ఎన్‌డీఎస్‌ఏను కోరాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. పర్యవేక్షణ యంత్రాంగం, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌, పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీతో మాట్లాడి పునరుద్ధరణ పనులు చేయించడం గురించి కూడా ఆలోచించమని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు