గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించండి

కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 74వ గణతంత్ర దినోత్సవాలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 26 Jan 2023 05:30 IST

సగర్వంగా జరుపుకోవాల్సిన ఉత్సవం ఇది
కొవిడ్‌ను కారణంగా చూపడం సరికాదు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 74వ గణతంత్ర దినోత్సవాలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకలకు ప్రజలను కూడా అనుమతించాలని ఆదేశించింది. సగర్వంగా నిర్వహించుకోవాల్సిన రిపబ్లిక్‌డే ఉత్సవాలను వెబ్‌ ప్రసారం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామన్న ప్రభుత్వ వాదన సంతృప్తికరంగా లేదని పేర్కొంది. ప్రభుత్వం కొవిడ్‌ను కారణంగా చూపడం సరికాదని.. కేంద్రం ఈ నెల 19న జారీ చేసిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది. ఇది జాతీయ వేడుక అని, సగర్వంగా, ఆనందంగా జరుపుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి సందర్భంలో మార్గదర్శకాలు జారీ చేయాల్సింది కేంద్రమేనని, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిందేనని పేర్కొంది. రిపబ్లిక్‌ డే ఉత్సవాలను పెరేడ్‌ గ్రౌండ్‌లో కాకుండా రాజ్‌భవన్‌లో నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కె.శ్రీనివాస్‌ భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ (లంచ్‌ మోషన్‌) పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం జస్టిస్‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టి.. పై విధంగా ఆదేశాలిచ్చారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 5 లక్షల మందితో సభలు నిర్వహించడానికి కొవిడ్‌ మార్గదర్శకాలు అడ్డురావని, కేవలం అయిదారు వేల మంది హాజరయ్యే రిపబ్లిక్‌డే ఉత్సవాలకు కొవిడ్‌ను కారణంగా చెప్పడం సమంజసం కాదన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాదిలాగే ఈసారి కూడా రిపబ్లిక్‌డే వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న మెమో జారీ చేసిందని తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు సీనియర్‌ అధికారులు పాల్గొంటారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18న కొవిడ్‌ మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఈ నెల 18న జారీ చేసిన మార్గదర్శకాలు కేవలం దిల్లీకి మాత్రమేనన్నారు. 19న జారీ చేసిన మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తాయన్నారు.


గవర్నర్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్‌ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఘనంగా స్మరించుకునే శుభదినం ఇదని పేర్కొన్నారు. అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, విలువలు, సిద్ధాంతాల పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.


కలెక్టరేట్లలోనే జెండా వందనం
 ప్రభుత్వ ఉత్తర్వులు

ఈనాడు,హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26న ఉత్సవాలను హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో ఆయా కలెక్టరేట్లలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయా జిల్లా కేంద్రాలలోని పోలీస్‌ పరేడ్‌ మైదానాల్లో కానీ, ఇతర మైదానాల్లో కానీ నిర్వహించేవారు. కొత్త కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు జరిగి జిల్లా కార్యాలయాలు అక్కడికి మారిన నేపథ్యంలో వేదికలను అక్కడే ఏర్పాటు చేసి జెండా ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని