పరిహారం చెక్కు వెనక్కి పంపాలని ఎలా అనిపించిందయ్యా.. మంత్రి అంబటి తీరుపై ఆక్రోశం

‘మా కుమారుడికి వచ్చిన రూ.5 లక్షల చెక్కును వెనక్కి పంపాలని మీకు ఎలా అనిపించిందయ్యా... మీకు మేమేం అన్యాయం చేశాం.

Updated : 29 Jan 2023 11:12 IST

ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీరుపై తురక గంగమ్మ ఆక్రోశం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ‘మా కుమారుడికి వచ్చిన రూ.5 లక్షల చెక్కును వెనక్కి పంపాలని మీకు ఎలా అనిపించిందయ్యా... మీకు మేమేం అన్యాయం చేశాం. మా గోడు పట్టించుకోకుండా రోడ్డు పాల్జేశారు’ అని ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తురక గంగమ్మ మీడియా ఎదుట వాపోయారు. సత్తెనపల్లిలోని జనసేన కార్యాలయంలో భర్త పర్లయ్యతో కలసి ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘రెస్టారెంట్‌ మురుగు గుంతలో నా బిడ్డ(అనిల్‌) చనిపోయినప్పుడు... 3 మృతదేహాలవద్ద ఎలాంటి ఒప్పందాలు జరిగాయో నాకు తెలియదు. చేతికందిన కుమారుడు చేజారిపోయాడని ఇప్పటికీ ఏడుస్తున్నాం. రూ.5 లక్షల చెక్కులో రూ.2.50లక్షలు సేట్‌(వ్యాపారి)కి ఇవ్వాలని మీరు (మంత్రి అంబటి) చెబితే సేట్‌ దగ్గరికి వెళ్లా. మీ డబ్బులేమీ అక్కర్లేదని వారు చెప్పారు. అదేమాట మీకు చెబితే ఆ డబ్బు వారికి అవసరం లేదేమో నాకు కావాల్సిందే అన్నారు. బాధ కలిగి చెక్కులో సగం ఇవ్వమంటున్నారంటూ బయటకు చెప్పా. అంతే తప్పించి మీపై నాకెలాంటి కక్షలు, కోపాల్లేవు’ అని గంగమ్మ చెప్పారు. ‘ప్రస్తుతం ఉన్న నా ఒక్కగానొక్క బిడ్డ సాక్షిగా చెబుతున్నా.. రాంబాబుపై మాట్లాడాలంటూ నాకెవ్వరూ అబద్ధాలు నేర్పించలేదు. మీరు చెక్కు ఇవ్వనన్నారు కాబట్టే ఇంతదాకా వచ్చా. మంత్రికి భయపడి బయట తిరగలేకపోతున్నాం. ఇంటి అద్దె కట్టలేని దీనస్థితిలో ఉన్నాం’ అంటూ గంగమ్మ వాపోయారు. ‘చెక్కు రానోడికైతే రూ.2.50 లక్షలు ఇచ్చారు.. మాకొచ్చిన సాయం ఎలా వెనక్కి పంపిస్తావయ్యా.. దయచేసి మా చెక్కు మాకు ఇవ్వండి’ అంటూ మంత్రి రాంబాబును ఆమె వేడుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని