సాగునీటికి సున్నా

కేంద్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి చేసిన కేటాయింపుల్లో కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకే పెద్దపీట దక్కింది.

Published : 02 Feb 2023 03:50 IST

కర్ణాటక, యూపీ, ఎంపీలకే నిధులు
తెలంగాణకు మొండిచెయ్యి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి చేసిన కేటాయింపుల్లో కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకే పెద్దపీట దక్కింది. రెండు ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించగా, ఇందులో ఒకటి కర్ణాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్టు కాగా, ఇంకొకటి ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లకు సాగునీరందించే కెన్‌-బెట్వా ప్రాజెక్టు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ సాగునీటి పథకాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా నిధులేమీ రాలేదు. 

అప్పర్‌ భద్రకు రూ. 5,300 కోట్లు

త్వరలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్లు ప్రత్యేకంగా కేటాయించడం గమనార్హం. జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టుకు కూడా నాబార్డు ద్వారా చెల్లించడం తప్ప ఇలా నేరుగా కేటాయించలేదు. తుంగ నది నుంచి 17.4 టీఎంసీలను భద్ర నదికి మళ్లించడం, భద్ర నుంచి 29.9 టీఎంసీలను మళ్లించి చిక్‌మగళూరు, చిత్రదుర్గ, తుముకూరు జిల్లాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీరందించడం, చెరువులు నింపడం చేయాలని నిర్ణయించింది. సూక్ష్మసేద్యం కూడా అమలు చేయనుంది. ఈ పథకానికి కేంద్ర జలసంఘం ఆమోదం తెలపడం, అంతే వేగంగా జాతీయ హోదా ఇవ్వడం జరిగిపోయాయి. ఈ ప్రాజెక్టు వల్ల తుంగభద్రకు వచ్చే ప్రవాహం, దీని వల్ల శ్రీశైలం మీద ప్రభావం పడుతుందని తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.

కెన్‌-బెట్వాకు రూ. 3,500 కోట్లు

నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టిన కెన్‌-బెట్వా ప్రాజెక్టుకు రూ.3,500 కోట్లు కేటాయించారు. దీనివల్ల మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పథకానికి మొత్తం నిధులు కేంద్రమే ఇస్తుంది. అయిదారేళ్లలో రూ.15 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కేటాయించారు. ఏఐబీపీ కింద 50 ప్రాజెక్టులకు రూ.3,122 కోట్లు కేటాయించారు. ఇందులో తెలంగాణకు నామమాత్రంగా కూడా వచ్చే అవకాశం లేదు. నాబార్డు ద్వారా ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పించిన రుణాలకు వడ్డీ, అసలు కింద రూ.3,275 కోట్లు కేటాయించారు. గంగా నది ప్రాజెక్టు కోసం రూ. 4,000 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ప్రపంచబ్యాంకు రుణం ద్వారా అమలు చేస్తున్న హైడ్రాలజీ, డ్యాం రిహాబిలిటేషన్‌ తదితర పథకాల కింద నామమాత్రంగా అందేవి తప్ప బడ్జెట్‌ ద్వారా అదనంగా నిధులేమీ లేవు.


కాళేశ్వరం ఊసే లేదు..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుండగా.. రెండు టీఎంసీలకు జలసంఘం సాంకేతిక అనుమతి ఇచ్చిన తర్వాత జాతీయ హోదా వరకు వెళ్లకుండా ఆగిపోయింది. అదనపు టీఎంసీ పని చేపట్టిన తర్వాత కేంద్ర జలసంఘం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోపాటు అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చడంతో ఆర్థిక సంస్థల నుంచి వచ్చే రుణాలు కూడా ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సొంత నిధులు, రుణాలపైనే ఆధారపడి పనులు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని