ఒత్తిడితో సహవాసం.. అనారోగ్య జీవితం

అసలే పోలీస్‌ శాఖ. ఆపై తీరికలేనంత పనిభారం. సెలవులు తక్కువ. కేసుల పర్యవేక్షణ, నిందితుల వేటకే సమయమంతా ఖర్చు. ఫలితంగా శారీరక, మానసిక ఒత్తిళ్లు.... ఇవే పోలీసుల పాలిట శాపంగా మారుతున్నాయి.

Published : 13 Mar 2023 05:22 IST

విధి నిర్వహణలో తీరిక లేక  పోలీసుల సతమతం
మధ్య వయసు వారిలోనే ఎక్కువ సమస్యలు
తాజాగా రెండు వేర్వేరు పరిశీలనలతో బహిర్గతం

సలే పోలీస్‌ శాఖ. ఆపై తీరికలేనంత పనిభారం. సెలవులు తక్కువ. కేసుల పర్యవేక్షణ, నిందితుల వేటకే సమయమంతా ఖర్చు. ఫలితంగా శారీరక, మానసిక ఒత్తిళ్లు.... ఇవే పోలీసుల పాలిట శాపంగా మారుతున్నాయి. మిగతా వారితో పోల్చితే వీరిలో అనారోగ్యానికి గురయ్యేవారు అధికంగా ఉంటున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్లు, హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ వేర్వేరుగా చేపట్టిన పరిశీలనలో ఇదే విషయం తేటతెల్లమైంది.

ప్రతి పోలీస్‌కు తప్పనిసరిగా ఏటా వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీస్‌ మాన్యువల్‌ చెబుతోంది. ఎస్‌హెచ్‌వో ఇందుకు శ్రద్ధ తీసుకోవాలి. నిధుల లేమితోపాటు విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా వారు ఆ దిశగా చొరవ చూపడం లేదు. 45 ఏళ్లు దాటిన సిబ్బందికి విధిగా మాస్టర్‌ హెల్త్‌చెకప్‌ చేయించాల్సి ఉన్నా చాలా యూనిట్లలో అలాంటి ఛాయలేవీ కనిపించడంలేదు. కుటుంబ సభ్యులకు సైతం వైద్య పరీక్షలు చేయాలని కొత్తగా మాన్యువల్‌లో చేర్చినా అంతా కాగితాలకే పరిమితమైంది. మరోవైపు నాలుగు పదులు దాటిన తర్వాత రావాల్సిన అనారోగ్య సమస్యలు సైతం పనిఒత్తిడి కారణంగా పాతికేళ్లకే చుట్టుముడుతున్నాయి. ట్రాఫిక్‌ సిబ్బంది వీటి బారిన అధికంగా పడుతున్నారు. అయితే... పోలీసుల ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయే వరకు బయట పడకపోవడానికి కారణం ముందస్తు పరీక్షలు లేకపోవడమేనని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. పనిఒత్తిడిలో పడి ఆసుపత్రులకు వెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం దుష్పరిణామాలకు దారితీస్తోందని అంటున్నారు.

16 శాతం మందే ఫిట్‌

హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల 8,730 మంది పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 53% మంది పరిమితికి మించి బరువు(అధిక బీఎంఐ) ఉన్నట్లు తేలింది. 32.69% మంది అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్‌, గుండె సమస్య... ఇలా ఏదో ఒకదానితో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తున్న వారిలోనూ సమస్యలు బహిర్గతమయ్యాయి. కేవలం 16% మందే ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడవడం గమనార్హం.

70 శాతానికి పైగా పోలీసుల్లో ఒత్తిడి

ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ స్కాలర్లు 406 మంది పోలీసులను సర్వే చేశారు. ఇందులో  పాల్గొన్న వారిలో 33 మంది మహిళలు ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతానికిపైగా తాము ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా యువ, మధ్యవయసు పోలీసులతోపాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేవారు ఎక్కువ ఒత్తిడిలో ఉంటున్నట్లు వెల్లడైంది.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని