లీకేజీపై నివేదికివ్వండి.. సిట్‌కు హైకోర్టు ఆదేశం

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తుపై స్థాయీ నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, సిట్‌కు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 22 Mar 2023 05:07 IST

పిటిషన్‌లోని ఆరోపణలపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ నోటీసులు
దర్యాప్తు పక్షపాతంగా జరుగుతోందనడానికి ప్రాథమిక ఆధారాల్లేవని స్పష్టీకరణ
ఈనాడు - హైదరాబాద్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తుపై స్థాయీ నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, సిట్‌కు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌లోని ఆరోపణలపై పూర్తిస్థాయిలో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీచేస్తూ విచారణను ఏప్రిల్‌ 11వ తేదీకి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్‌  నర్సింగ్‌రావు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వివేక్‌ ఠంకా వాదనలు వినిపిస్తూ.. ఏళ్ల తరువాత వచ్చిన నోటిఫికేషన్లకు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారు ఒకరు ఉన్నారని, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇక్కడ పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత ఐటీ శాఖ మంత్రి విలేకరుల సమావేశం నిర్వహిస్తూ లీకేజీకి ఇద్దరే కారణమని పేర్కొన్నారన్నారు. మంత్రి ఏ హోదాతో దర్యాప్తులో జోక్యం చేసుకుంటారని పిటిషనర్‌ ప్రశ్నించారు. ఆయన కేవలం ఇద్దరు మాత్రమే నిందితులని పేర్కొంటూ ఛైర్మన్‌, కార్యదర్శితోపాటు ఇతర ఉద్యోగులకు క్లీన్‌చిట్‌ ఇచ్చారన్నారు. మంత్రి క్లీన్‌చిట్‌ ఇచ్చాక సిట్‌ ఏ విధంగా దర్యాప్తు కొనసాగిస్తుందని సందేహం వెలిబుచ్చారు. అంతేకాకుండా మంత్రి నియోజకవర్గానికి చెందిన ఒక మండలంలోని 20 మందికి అత్యధిక మార్కులు వచ్చాయని తెలిపారు. లీకేజీ వ్యవహారంలో ఉన్నతస్థాయి వ్యక్తులున్నారని, నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించాలని కోరారు.

రాజకీయ లక్ష్యాలతోనే పిటిషన్‌: ఏజీ

రాజకీయ లక్ష్యాలతో పిటిషన్‌ దాఖలు చేసినట్లు కనిపిస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. పిటిషనర్‌ ఓ రాజకీయ పార్టీకి చెందిన అనుబంధ సంస్థ వ్యక్తి అని, లీకేజీ వ్యవహారంతో ఆయనకు ఎలాంటి సంబంధంలేదని, అందువల్ల పిటిషన్‌ వేసే పరిధి లేదన్నారు. తెలంగాణ పోలీసులు కీలకమైన ఎన్నో కేసుల దర్యాప్తును సమర్థంగా పూర్తి చేశారని, ఈ కేసులోనూ ఇప్పటికే 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. లీకేజీ బయటపడటంతో అభ్యర్థుల ప్రయోజనార్థం పరీక్షలను రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిపారు. మంత్రి ప్రెస్‌మీట్‌కు, ఈ కేసు దర్యాప్తునకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. మంత్రి ఇద్దరి పేర్లు మాత్రమే చెప్పారని.. అంతమాత్రాన ఇతరులు ఎవరూ ఇందులో లేరన్నట్లు కాదని, ఇప్పటికే మంత్రి వెల్లడించిన పేర్లతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్‌ చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కేసు నమోదైన వెంటనే ప్రతి ఒక్కరూ కోర్టుకు వచ్చి సీబీఐ దర్యాప్తు కోరడం సహజమైపోయిందని తప్పుబట్టారు. పోలీసులు పలు గ్రామాల్లో పర్యటించి అత్యధిక మార్కులు పొందిన వారిని సైతం విచారించారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. దర్యాప్తు పక్షపాతంగా జరుగుతోందనడానికి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. మంత్రి ప్రకటనను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవడంలేదని స్పష్టంచేశారు. అయితే, పిటిషనర్ల అభ్యర్థన మేరకు దర్యాప్తు నివేదికను పరిశీలించాలని కోర్టు భావిస్తోందన్నారు. అందువల్ల దర్యాప్తుపై స్థాయీ నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందించాలని సిట్‌ను ఆదేశించారు. నివేదికతోపాటు పిటిషనర్‌ చేసిన ఆరోపణలపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని