అసమ్మతి లేదంటే ప్రజాస్వామ్యం లేనట్టే

అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదని, దానిని అణగదొక్కేవి నిరంకుశ, నియంతృత్వ ప్రభుత్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశ్రాంత అడ్వొకేట్‌ జనరల్‌ సి.వి.మోహన్‌రెడ్డి అన్నారు.

Updated : 25 Mar 2023 16:33 IST

జస్టిస్‌ అల్లాడి కుప్పుస్వామి శతజయంతి సభలో విశ్రాంత అడ్వొకేట్‌ జనరల్‌ సి.వి మోహన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదని, దానిని అణగదొక్కేవి నిరంకుశ, నియంతృత్వ ప్రభుత్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశ్రాంత అడ్వొకేట్‌ జనరల్‌ సి.వి.మోహన్‌రెడ్డి అన్నారు. అసమ్మతి లేని ప్రజాస్వామ్యం శ్మశానంలో నిశ్శబ్దం వంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ అల్లాడి కుప్పుస్వామి శతజయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామ్యం-అసమ్మతి-భారత రాజ్యాంగం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మనదేశంలో వివిధ రాజకీయ పక్షాలచే ఏర్పాటైన ప్రభుత్వాలు అసమ్మతి, విభిన్న స్వరాల పట్ల అసంతృప్తిని, వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంటాయని అన్నారు. ‘నీ భావాలను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, నీ భావ ప్రకటన స్వేచ్ఛను నేను మరణించేంతవరకు రక్షిస్తాను’ అన్న ఫ్రెంచి తత్వవేత్త వాల్తేర్‌ వాక్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతి దశలోనూ సమాజం కొన్ని నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తుందని, అయితే కొత్త ఆలోచనలు పరిఢవిల్లాలన్నా.. కొత్త మార్గాలు అన్వేషించాలన్నా..స్వేచ్ఛగా ఆలోచించే వీలు ఉండాలని తెలిపారు. అటువంటి స్వేచ్ఛే లేకుంటే బుద్ధుడు, మహావీరుడు, ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త, గురునానక్‌, మార్టిన్‌ లూథర్‌, రాజా రామమోహన్‌ రాయ్‌, కందుకూరి వీరేశలింగం తదితరులు వారివారి కాలాల్లో మత, సాంఘిక ధోరణులను ప్రశ్నించే తమ ఆలోచనలను, తాత్వికతలను సమాజాలకు వెల్లడించలేకపోయేవారని అన్నారు.

‘సమన్యాయ పాలన అమలులో ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం, అసమ్మతి... ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక సమతౌల్యం ఏర్పరుస్తాయి. బలమైన పౌరసమాజం, రాజకీయ క్రియాశీలతకు దోహదపడతాయి’ అని సి.వి.మోహన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 124-ఎ (రాజద్రోహం)ను దుర్వినియోగం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. విశ్రాంత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.రఘురామ్‌ ఈ సభకు అధ్యక్షత వహించారు. జస్టిస్‌ రఘురామ్‌, మోహన్‌రెడ్డిలు జస్టిస్‌ అల్లాడి కుప్పుస్వామితో తమకున్న అనుబంధాన్నీ, ఆయన సామాజిక సేవనూ గుర్తు చేసుకున్నారు. ఉపన్యాసం అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు వారు జవాబులిచ్చారు. కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. జస్టిస్‌ కుప్పుస్వామి కుమార్తె ప్రొఫెసర్‌ అల్లాడి ఉమ, ప్రొఫెసర్‌ శ్రీధర్‌, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని