‘మహీంద్రా’లో ఈవీ బ్యాటరీల యూనిట్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పెద్ద పరిశ్రమల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా విస్తరణ బాటలో మరో మైలురాయిని చేరబోతోంది.

Published : 24 Apr 2023 03:07 IST

జహీరాబాద్‌ ప్లాంట్‌లో రూ.వెయ్యి కోట్లతో నిర్మాణం
నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్‌

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పెద్ద పరిశ్రమల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా విస్తరణ బాటలో మరో మైలురాయిని చేరబోతోంది. ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ సంస్థ తాజాగా రూ.వెయ్యి కోట్లతో విద్యుత్తు వాహన (ఈవీ) బ్యాటరీల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతోంది. ఈ యూనిట్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రెండు నెలల కిందట హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందం మేరకు ఈ ప్లాంటును ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆల్విన్‌ నిస్సాన్‌తో ఆరంభం..

తేలికపాటి వాహనాల తయారీ లక్ష్యంతో 1981-82లో జహీరాబాద్‌ శివారులో 200 పైచిలుకు ఎకరాల్లో ఆల్విన్‌ పరిశ్రమ ఏర్పాటైంది. దీని నిర్మాణానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేయగా.. 1983లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పరిశ్రమను ప్రారంభించారు. అప్పట్లో ఇక్కడ లైట్‌ కమర్షియల్‌ వాహనాలు, మినీ బస్సులు తయారయ్యేవి. 1996-97లో మహీంద్రా గ్రూపు దీనిని కొనుగోలు చేసి జీపులు, మినీ ట్రక్కులు, ఆటోల ఉత్పత్తి ప్రారంభించింది. విస్తరణలో భాగంగా 2013 మార్చిలో రూ.100 కోట్లతో 100 ఎకరాల్లో ట్రాక్టర్‌ ప్లాంటును ఏర్పాటుచేశారు. ఇక్కడ ఏడాదికి 3 లక్షల పైచిలుకు ట్రాక్టర్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2015 మేలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా కొత్త ఆటో మోడల్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇక్కడ మినీ ట్రక్కులు, పికప్‌ వ్యాన్లు, బొలెరో కెంపర్‌, బీఎంటీ లోడ్‌ వాహనాలు, మినీ బస్సులు, లోడ్‌కింగ్‌ వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు తయారవుతున్నాయి. హైదరాబాద్‌లో ఇంటింటికీ తిరిగి చెత్తసేకరించే ఆటోలన్నీ ఇక్కడ తయారైనవే కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని