OldCity Metro: పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో!

పాతబస్తీ మెట్రో త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మార్గం నిమిత్తం 5.5 కిలోమీటర్ల మెట్రోరైలు నిర్మాణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మున్సిపల్‌ శాఖ, ఎల్‌ అండ్‌ టీ సంస్థకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌లో ప్రకటించారు.

Updated : 11 Jul 2023 08:40 IST

ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మార్గం నిర్మాణానికి నిర్ణయం
సీఎం కేసీఆర్‌ ఆదేశించారని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: పాతబస్తీ మెట్రో త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మార్గం నిమిత్తం 5.5 కిలోమీటర్ల మెట్రోరైలు నిర్మాణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మున్సిపల్‌ శాఖ, ఎల్‌ అండ్‌ టీ సంస్థకు స్పష్టం చేసినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌లో ప్రకటించారు. మెట్రో రైలు తొలివిడత కింద 69.2 కిలోమీటర్లు నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులెత్తేసింది. రాయదుర్గంతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించటంతో పాటు, నిలిచిపోయిన ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తీర్ణం 74.7 కిలోమీటర్లకు అవుతుంది. సుమారు ఆరేడు సంవత్సరాలుగా ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం నిలిచిపోయింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావటంతో అప్పట్లో మజ్లిస్‌ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మార్గాన్ని మళ్లించేందుకు(ఎలైన్‌మెంట్‌) సర్వే నిర్వహించినా ముందడుగు పడలేదు. ‘ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా..మెట్రో పట్టాలెక్కేదెలా?’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’ హైదరాబాద్‌ ఎడిషన్‌లో కథనం ప్రచురితమైంది. దీనికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మున్సిపల్‌ అధికారులతో, ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణియన్‌తో సీఎం మాట్లాడారు. మిగిలిన 5.5 కిలోమీటర్ల మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు ముఖ్యమంత్రి చెప్పినట్లు కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని