రక్తనాళాల్లో సమస్యలను సమతుల ఆహారంతో అడ్డుకుందాం!

వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి.

Updated : 21 Aug 2023 15:22 IST

ఉల్లి, బచ్చలి, ద్రాక్ష, కమలాపళ్లు, చేపలతో ఆరోగ్యం
గుండె పోటు, జబ్బుల నియంత్రణ
తాజా అధ్యయనంలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌

యసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణాల్లో.. రక్తనాళాల్లో (సిరలు, ధమనులు) రక్తం గడ్డకట్టడం ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. ఈ ముప్పును తగ్గించడానికి ఎలాంటి ఆహారం దోహదపడుతుంది.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి అంశాలన్నీ కీలకం. ఇందుకు సంబంధించి ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐజేఎంఆర్‌) అధ్యయనాంశాలను వెల్లడించింది. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, చేపలు వంటివి తీసుకోవడం  సిరల్లో రక్తం గడ్డకట్టే (థ్రాంబోఎంబోలిజం) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్‌-బి, ఫోలేట్‌ కంటెంట్‌.. థ్రాంబోసిస్‌ (బ్లడ్‌ క్లాట్స్‌ ఎక్కువ కావడం)ను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ అధికంగా ఉన్న చేపలను తినడం ద్వారా హైపర్‌ కాగ్లబిలిటీ (థ్రాంబోసిస్‌ ముప్పు పెరగడం)ని తగ్గిస్తుంది. పచ్చిమిరప, పలు కూరగాయల్లో ఉండే కొన్ని పోషక మూలకాలు ఫైబ్రినోలిసిస్‌ (బ్లడ్‌ క్లాట్స్‌ను నివారించేందుకు శరీరం సహజంగా చేసుకునే ప్రక్రియ)ను మెరుగుపరుస్తాయి. ప్లేట్‌లెట్ల అగ్రిగేషన్‌ (ఒకేచోట చేరిపోవడం)నూ తగ్గిస్తాయని వెల్లడైంది.

  • కూరగాయలు, చేపలు, తృణధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకునే వ్యక్తులను.. తీసుకోనివారిని పోలిస్తే సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్లేట్‌లెట్లు ఒకేచోట పోగుపడకుండా చేసే పోషకాలు ఉల్లిపాయలు, హాట్‌పెపర్‌, బచ్చలికూర, టమాటా, కమలాపళ్లు, ద్రాక్ష, నిమ్మలో అధికంగా ఉంటాయి. వెల్లుల్లి సీరమ్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ మేరకు సమతుల ఆహారం తీసుకోవడం కీలకమని పరిశోధకులు చెబుతున్నారు. ద్రాక్ష, సోయా, కోకా గుండెజబ్బులును తగ్గిస్తాయని పేర్కొన్నారు.  సిరల థ్రాంబోఎంబోలిజం ప్రధానంగా ఆర్థోపెడిక్‌ సర్జరీలు చేయించుకున్న వారిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


ఎవరికి ముప్పు ఎక్కువ?

కే పొజిషన్‌లో ఎక్కువసేపు ఉండటంవల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అనారోగ్యంతో బెడ్‌కే పరిమితం కావడం, ఎక్కువసేపు నిల్చుని లేదా కూర్చునేవారిలో, వృద్ధులు, స్థూలకాయుల్లోనూ డీవీటీకి అవకాశం ఎక్కువ.  


గుర్తించడం ఎలా? ప్రమాదం ఏమిటి?

కాళ్లు వాపులు వచ్చి ఎర్రబడిపోవడం, నరాలు కొంచెం ఉబ్బినట్లుగా వెడల్పుగా ఉన్నట్లు అనిపిస్తుంటాయి. అప్పుడు వెంటనే దీనిపై దృష్టి సారించాలి. ఎక్కడైనా క్లాట్‌ వచ్చినపుడు అది అకస్మాత్తుగా గుండెకు లేదా ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లోకి వెళ్లి చేరే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో శ్వాస ఆడకపోవడం, గుండెపోటు సమస్యలు వస్తాయి. కాళ్లలో వచ్చిన వాళ్లకు ఇది చాలాకాలంగా ఉండి అల్సర్లు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.

సాధారణంగా పెద్దవయసులో వారికి ఆర్థోపెడిక్‌ సహా పలు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో ఎక్కువ రోజులు బెడ్‌ మీద ఉండాల్సి రావడంతో నాళాల్లో రక్తం సరఫరా మందగిస్తుంది. అందుకే ఇప్పుడు శస్త్రచికిత్స తర్వాత నడిపిస్తున్నారు. సర్జరీలు అయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా నడక మొదలు పెట్టించాలి. డీవీటీ వచ్చే అవకాశం ఉన్నవాళ్లను గుర్తించి ముందుగానే వారికి బ్లడ్‌థిన్నర్స్‌ ఇవ్వడం ప్రారంభిస్తారు. కొందరు క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థుల్లోనూ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌కు గురై.. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండి వ్యాధులతో బాధపడేవారిలోనూ.. గర్భనిరోధక మాత్రలు వాడేవారి కొందరిలోనూ.. వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. గర్భిణుల్లో కూడా సాధారణంగా ఉంటుంది. పశ్చిమదేశాల్లో ఇది బాగా ఎక్కువగా ఉంటుంది. మన వద్ద 15-20 శాతం వరకు ఉంటుందని అంచనా.


శాస్త్రీయంగా గుర్తించే విధానం

సాధారణంగా అల్ట్రాసౌండ్‌ కలర్‌ డాప్లర్‌ చేసి రక్తనాళ్లాలో సరఫరా ఎలా ఉంది గుర్తించి తెలుసుకోవచ్చు. కోవిడ్‌ సమయంలో ఎక్కువగా చేసిన డీడైమర్‌ టెస్ట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ ద్వారా కూడా గుర్తించవచ్చు.

  • మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్‌, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తపడాలి. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరిగిపోవడానికి ఇంజక్షన్లు ఇస్తారు. గతంలోలా కాకుండా ఇప్పుడు పర్యవేక్షణ సులువైంది. కొత్తగా మందులు అందుబాటులో ఉన్నాయి.

రాకుండా చూసుకోవడం ముఖ్యం..

ప్రధానంగా ఊబకాయం ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. ఎక్కువ సమయం కూర్చోవడం లేదంటే ఎక్కువ సేపు నిలబడి ఉండకూడదు. పొజిషన్లు మారుస్తూ ఉండాలి. ఒకవేళ ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేసేవాళ్లు మధ్యమధ్యలో లేచి నడవడం అవసరం. డాక్టర్లలో కూడా కొంతమంది సర్జన్లు ఎక్కువసేపు నిలబడి సర్జరీలు చేస్తుంటారు.. వాళ్లలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగే అలవాటున్నవారు దాన్నుంచి బయటపడాలి. ఆర్థోపెడిక్‌ సర్జరీలు చేసుకున్న వారిని రెండు మూడు రోజులకే నడిపించడం లేదా బెడ్‌లోనే అటూ ఇటూ కదిలించడం చేయాలి.

  • గర్భిణులను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. ప్రయాణాల్లో ఎక్కువసేపు ఉండేవాళ్లు, క్రమం తప్పకుండా 16-20 గంటలు ప్రయాణం చేసేవాళ్లు స్టాకింగ్స్‌ తప్పనిసరిగా వేసుకోవాలి.
  • ఆహారంలో ఆలివ్‌ ఆయిల్‌ వినియోగించడం చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే ఫినాల్‌ అనే మూలకం ప్లేట్‌లెట్లు ఒకేచోట జమ కావడాన్ని తగ్గిస్తుంది. ఒక మోతాదులో ఆకుకూరలు తీసుకోవచ్చు. రోగం నిర్ధారణ అయి.. వైద్యం చేయించుకుంటున్నవారు జంక్‌ఫుడ్‌లు, ప్యాకేజ్డ్‌ఫుడ్‌లు వంటివాటికి దూరంగా ఉండాలి’’

డీవీటీ ముప్పు తప్పాలంటే..!

- డాక్టర్‌ రాకేష్‌ కలపాల

ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమించే ‘డీవీటీ’ ముప్పు బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా కీలకమని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ రాకేష్‌ కలపాల తెలిపారు. ఆయన సూచించిన కీలకాంశాలు ఆయన మాటల్లోనే..

‘‘సిరల్లో రక్తం గడ్డకట్టడం సిరల థ్రాంబోఎంబోలిజం. ఇది డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌ (డీవీటీ)కి దారితీస్తుంది. ఈ డీవీటీ పల్మనరీ ఎంబోలిజం, ధమనుల్లో రక్తం గడ్డకట్టే ముప్పును పెంచుతుంది. ధమనుల్లో రక్తం గడ్డకట్టడం ద్వారా గుండెపోటు ముప్పు పెరుగుతుంది. డీవీటీ అంటే లోపల ఉన్న సిరల్లో రక్తం గడ్డకట్టం. ఇది నడుము కింద, కాళ్లలోనూ.. నడుముపైనా రావొచ్చు. శరీరం పైభాగంలో ప్రధాన సిరలకు వస్తే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులు, గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో గడ్డ కట్టకూడదు (క్లాట్‌ రాకూడదు). శరీరం కింది భాగంలో.. కాళ్లలో వచ్చేవాటి ద్వారా ముప్పు తక్కువ ఉంటుంది. పాదాలు, కాళ్లలో వస్తే డిస్టల్‌్ డీవీటీ అని.. నడుం పైనవస్తే ప్రాక్సిమల్‌ డీవీటీ అని అంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు