ఫీజుల లెక్కలు చెప్పాల్సిందే

ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఏ పాఠశాలలో.. ఏ తరగతికి.. ఎంత మొత్తం ఫీజు వసూలు చేస్తున్నారనే సమాచారాన్ని ఇక నుంచి కచ్చితంగా తెలపాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది.

Updated : 29 Aug 2023 06:36 IST

ఏ స్కూలు ఎంత వసూలు చేస్తోందో సర్కారుకు తెలపాలి
ఆ వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్న విద్యాశాఖ
భారీగా పెంచకుండా నియంత్రించే యోచన!

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఏ పాఠశాలలో.. ఏ తరగతికి.. ఎంత మొత్తం ఫీజు వసూలు చేస్తున్నారనే సమాచారాన్ని ఇక నుంచి కచ్చితంగా తెలపాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది. ఈ వివరాలు సమగ్రంగా సేకరించడంతోపాటు వాటిని జిల్లాలు, పాఠశాలలు, తరగతుల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని నిర్ణయించింది. ఈ మేరకు డీఈఓలను ఆదేశించడంతో వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు.  ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ 2017 నుంచి పలు ప్రయత్నాలు చేసినా ఫలితాలు కనిపించలేదు. తాజాగా ఈ విషయంలో కొంత ముందడుగు పడింది.

ప్రత్యేక అప్లికేషన్‌లో పొందుపరుస్తూ..

గతేడాది ఏప్రిల్‌లో నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఏటా 10 శాతానికి మించి ఫీజులు పెంచరాదని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దానిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయడం లేదని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) న్యాయస్థానంలో విద్యాశాఖపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై విచారణ ప్రక్రియ కొద్ది నెలలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఒకడుగు ముందుకేసి ప్రస్తుతమున్న ఫీజుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చర్యలకు దిగింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల వివరాలను పాఠశాల విద్యాశాఖకు చెందిన ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో పొందుపరచనుంది. ఇందు కోసం సాఫ్ట్‌వేర్‌లో ఓ ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించింది. అందులో డీఈఓలు వివరాలు నిక్షిప్తం చేస్తున్నారు.

ప్రజలకు బహిరంగపరుస్తారా..?

కొత్తగా ఒక కుటుంబం హైదరాబాద్‌/వరంగల్‌/కరీంనగర్‌ జిల్లాకు వచ్చి తమ పిల్లల్ని ఏదైనా బడిలో చేర్పించాలంటే దానికి గుర్తింపు ఉందో.. లేదో తెలుసుకోవడం గగనమే. విద్యాశాఖకు సంబంధించిన ఏ ఒక్క వెబ్‌సైట్లోనూ ఆ వివరాలు ఉండవు. యూడైస్‌లో ఆ వివరాలు ఉన్నా వాటిని అంతర్గతంగా వినియోగించుకోవడానికి తప్ప ప్రజలు చూడటానికి అవకాశం లేదు. బంజారాహిల్స్‌ డీఏబీ పాఠశాలకు ఏళ్ల తరబడి అనుమతి లేకున్నా నడుస్తూనే ఉండేది. ఏడాది క్రితం ఓ చిన్నారిపై డ్రైవర్‌ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు సమాధానమిస్తూ.. పాఠశాలల గుర్తింపు రహస్యమేమీ కాదు, ప్రజలు తెలుసుకునేలా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటివరకు అది అమల్లోకిరాలేదు. తాజాగా సేకరిస్తున్న ఫీజుల వివరాలైనా ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటారు.


వసూలు చేస్తున్నదెంతో తెలిస్తేనే..

మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు ఏటా 10 శాతానికి మించి ఫీజు పెంచరాదని విద్యాశాఖ ఉత్తర్వులివ్వాల్సి వస్తే.. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులెంతో తెలియాలి. ఆ వివరాలు సరిగా లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజులతోపాటు విద్యార్థుల సంఖ్య, వసతులు, ఉపాధ్యాయుల సంఖ్య తదితర వాటిని ప్రభుత్వం పోర్టల్‌లో నమోదు చేయిస్తోంది. మరోవైపు పాఠశాలలను బడ్జెట్‌, నాన్‌ బడ్జెట్‌గా విభజించాలన్న డిమాండు యాజమాన్య సంఘాల నుంచి ఉంది. ఒకటే సెక్షన్‌, సొసైటీ కింద ఉండటంతోపాటు ఏడాదికి రూ.35 వేలలోపు ఫీజు ఉంటే దాన్ని బడ్జెట్‌ పాఠశాలగా నిర్ణయించాలని కోరుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు