వ్యాయామమే ‘వెన్ను’దన్ను

జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల గురించి ఎక్కువ ఆందోళన చెందుతుంటాం. వాస్తవంగా అత్యధికులు వెన్నునొప్పితో సతమతమవుతున్నారు.

Updated : 03 Sep 2023 06:55 IST

శారీరక శ్రమ తగ్గడంతో పెరుగుతున్న వెన్నెముక నొప్పులు
20 నుంచి 40 ఏళ్ల వారికి అధిక సమస్యలు
జీవనశైలి, పని ప్రదేశాల్లో మార్పులే పరిష్కారం

ఈనాడు, హైదరాబాద్‌: జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల గురించి ఎక్కువ ఆందోళన చెందుతుంటాం. వాస్తవంగా అత్యధికులు వెన్నునొప్పితో సతమతమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. తాజాగా నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన ‘బ్యాక్‌ పెయిన్‌’ కథనం వెన్ను సమస్యకు సంబంధించి పలు ఆందోళనకర అంశాలను వెల్లడించింది. మారిన జీవనశైలి, ఆధునిక వసతులు, రవాణా సౌకర్యాలు, ఎక్కువ సమయం డెస్క్‌ల వద్ద కూర్చుని పనిచేస్తున్న కారణంగా వెన్నెముక కోణంలో మార్పులు వస్తున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వెన్నునొప్పి నివారణ, నిర్వహణకు లక్షల కోట్ల ఖర్చు అవుతోందని తెలిపింది. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు సరైన భంగిమలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో వెన్నునొప్పి వచ్చే ముందు ఉండే లక్షణాలేమిటి? తద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రముఖ స్పైన్‌ సర్జన్‌, డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ స్పైన్‌ సర్జరీ ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్స్‌, అపోలో హెల్త్‌ సిటీ డాక్టర్‌ రాఘవదత్‌ ములుకుట్ల వివరించారు.

జీవితంపై వెన్నునొప్పి ప్రభావం అధికం

వెన్ను, మెడ, వీపు బాగంలో వచ్చే నొప్పులను వెన్ను సమస్యలుగా గుర్తించాలి. ప్రతి మనిషి జీవితంలో 20 నుంచి 40 ఏళ్ల వయసు అత్యంత కీలకమైంది. ఈ వయసు వారిలోనే వెన్ను సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వారి ఆరోగ్యంపై, పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. నొప్పి కారణంగా మనిషిలో చికాకు పెరిగిపోతుంది. ఒక్కోసారి వెన్ను, మెడ, నడుం నుంచి విపరీతమైన నొప్పి కాళ్లు, చేతుల్లోకి వ్యాపించి పనిచేయలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటప్పుడు ప్రయాణాలపై ఆధారపడే మార్కెటింగ్‌ వృత్తుల్లోని వారు, ఆహార, నిత్యావసర సరకుల రవాణాదారులతోపాటు ఎగ్జిక్యూటివ్‌లు అల్లాడతారు. రోడ్లు సరిగా లేకపోవడం, అధిక స్పీడ్‌ బ్రేకర్లు, గతుకులు, గుంతల సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది. మానసికంగానూ కుంగిపోతారు.

కాలుష్యం, పొగతాగడం వెన్ను ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి

పొగతాగే అలవాటు వెన్ను ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొందరు స్పైన్‌సర్జన్లు బాగా పొగతాగేవారికి సర్జరీలు చేయడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే ఇలాంటి వారికి ఆపరేషన్‌ చేసినా మెరుగైన ఫలితాలు ఉండవు. పొగతాగితే డిస్క్‌ న్యూట్రిషన్‌ దెబ్బతిని, అరుగుదల ఎక్కువగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం కూడా ఇలాంటి ప్రభావాన్నే కలిగిస్తుంది.

ఏ క్యాన్సర్‌ అయినా మొదట చేరేది వెన్నుకే

వెన్నెముకలో ఇన్‌ఫెక్షన్లు ఇటీవల బాగా పెరిగాయి. రొమ్ము, ఊపిరితిత్తుల వంటి అవయవాలకు సోకే క్యాన్సర్లు సాధారణంగా మొట్టమొదట వెన్నెముకకే చేరుతాయి. వాటిని ఎంఆర్‌ఐ, ఎక్స్‌రేలతో గుర్తించగలుగుతున్నాం. కణుతులు, వంకర్లు, గూని వంటి వాటికి సమర్థంగా చికిత్స చేయగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగానూ వైద్యరంగంలో వెన్నెముక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కొనసాగుతోంది. జీ-20లోని భాగస్వామ్య దేశాల స్పైన్‌ సర్జన్లు నాలుగేళ్లుగా వెన్నెముక ఆరోగ్యంపై ప్రజలను జాగృతం చేస్తున్నారు. పేద దేశాల వైద్యులకూ అవగాహన పెంచుతున్నారు.

పని ప్రదేశంలో స్టాండింగ్‌ డెస్క్‌ తప్పనిసరి

ఉద్యోగులు పనిచేసే చోట కీలక మార్పులు అవసరం. ఉదాహరణకు ప్రతి ఆఫీసులో స్టాండింగ్‌ డెస్క్‌ పెట్టాలి. ఐటీ కంపెనీల్లో ఇలాంటి డెస్క్‌లు ఉంటే నిల్చునే పనిచేస్తారు. కూర్చుని, నిల్చుని పనిచేస్తుంటే మన శరీరాకృతి సక్రమంగా ఉంటుంది. అందరికీ నిటారుగా ఉండాలని పదేపదే చెబుతుంటాం. కానీ, అన్నివేళల్లో అలా ఉండటం అసాధ్యం. ఖరీదైన కుర్చీలు కొంటున్నా వాటిపై కూర్చున్న వారు ముందుకు వంగడమన్నది సహజం. అలాగే... వర్క్‌ఫ్రం హోం అయినా ఆఫీసులో ఉన్నా, ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి లేచి చిన్నపాటి స్ట్రెచ్‌లు చేస్తుండాలి. సోఫాలకు దూరంగా ఉండాలి. ఆన్‌లైన్‌ సమావేశాలు, కార్పొరేట్‌ రంగంలో గంటల తరబడి జరిగే సమావేశాల మధ్యలో నిల్చుని మాట్లాడాలి. క్రికెట్‌ మ్యాచ్‌లు, సినిమాలు చూస్తున్నా ఇలాగే చేయాలి. ఆఫీసుల్లో యోగా హాళ్ల లాంటివి ఉండాలి.

చురుకుగా ఉండటమే పరిష్కారం

ఎక్కువసేపు కూర్చుంటే శారీరక శ్రమ తగ్గి కండరాలు బలహీనం అవుతాయి. వెన్నుపూసలపై ఒత్తిడి పెరిగి, అవి తొందరగా అరిగిపోతుంటాయి. నిద్ర మినహా మిగతా సమయంలో శారీరకంగా చురుగ్గా ఉండాలి. రోజులో కనీసం గంటన్నరసేపు తీవ్రంగా వ్యాయామం చేయాలి. నడకకు, మెట్లు ఎక్కడానికి, దిగడానికి, కింద కూర్చోవడానికి ప్రాధాన్యమివ్వాలి. పరుగెత్తడం, సైక్లింగ్‌ వంటివి చేయాలి. మొబైల్‌ ఫోన్‌ చూడటం తగ్గించాలి. బెడ్‌రూంలో టీవీ పెట్టుకోకూడదు. హార్మోన్ల సమస్యతో మహిళల్లో నడుంనొప్పులు ఎక్కువ. గృహిణులు ఇంటిపనినే వ్యాయామంగా భావిస్తారు. అది సరికాదు. ఉదయం లేదా సాయంత్రం గంటసేపు నడవాలి. యోగాకు ప్రాధాన్యమివ్వాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.

పిల్లలను మైదానాలకు పంపించండి

మనం కూర్చునే విధానం వెన్నెముక ఆకృతిపై ప్రభావం చూపుతుంది. ఆకృతి మారుతుందంటే.. వెన్ను సమస్యలు ముంచుకొస్తాయని అర్థం. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులపై చదువుల ఒత్తిడి అధికంగా ఉంటోంది. వారు చాలాసార్లు పది, అంతకంటే ఎక్కువ గంటలపాటు చదువుతుండటంతో వారి వెన్నెముకల్లో మార్పులు వస్తున్నాయి. మైదానాల్లో ఆటలకు దూరం కావడంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. సుదీర్ఘ సమయం వంగి రాస్తుండటంతో వెన్నెముకను నియంత్రించే కండరాలు బలహీనమవుతున్నాయి. పిల్లల నడుం వంకర అవుతోంది. చిన్నారులను మైదానాలకు పంపించి, శారీరక శ్రమ పెరిగేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈత చాలామంచి వ్యాయామం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు