ప్లాస్టిక్‌తో సంతాన సమస్యలు.. పరిశోధనలతో తేల్చిన ఎన్‌ఐఎన్‌

శరీరంలో ప్లాస్టిక్‌ చేరితే సంతాన సమస్యలు తలెత్తుతాయని ఎన్‌ఐఎన్‌ (జాతీయ పోషకాహార సంస్థ) హెచ్చరించింది.

Updated : 13 Sep 2023 07:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: శరీరంలో ప్లాస్టిక్‌ చేరితే సంతాన సమస్యలు తలెత్తుతాయని ఎన్‌ఐఎన్‌ (జాతీయ పోషకాహార సంస్థ) హెచ్చరించింది. ప్లాస్టిక్‌ తయారీలో వినియోగించే ‘బిస్‌ ఫినాల్‌ ఏ-బీపీఏ’ రసాయనం ప్రభావంతో మగవారిలో సంతాన ఉత్పాదకత దెబ్బతింటుందని తమ పరిశోధనల్లో తేలిందని మంగళవారం ఎన్‌ఐఎన్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. గర్భంతో ఉన్నప్పుడు ప్లాస్టిక్‌లో నిల్వ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఆహారం ద్వారా గర్భిణుల శరీరంలోకి ‘బీపీఏ’ వెళితే... వారికి పుట్టే మగ సంతానంలో పెద్దయ్యాక వీర్య నాణ్యత దెబ్బతినొచ్చని హెచ్చరించింది. గర్భం దాల్చిన ఎలుకలను రెండు భాగాలుగా విభజించి ఒక భాగానికి ‘బీపీఏ’తో ముడిపడి ఉన్న ఆహారాన్ని అందించింది. ‘బిస్‌ ఫినాల్‌ ఏ’ ప్రభావానికి దూరంగా ఉన్న ఎలుకల మగ సంతానంలో వీర్య నాణ్యతను దెబ్బతీసే రసాయన చర్యలు ఏమీ జరగలేదంది. నాలుగు నుంచి 21 రోజులపాటు బీపీఏ ఉన్న ఆహారాన్ని తీసుకున్న ఎలుకలకు పుట్టిన మగ మూషికాలను పరిశీలించగా... వీర్య కణాల ఉత్పత్తిలో నాణ్యతా లోపాలను గమనించినట్లు ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త డా.సంజయ్‌ బసక్‌ తెలిపారు. పిండ దశలోనే ఎదుగుదలపై ప్రభావం చూపి, మంచి కొవ్వు తయారీలో అవసరమైన రసాయనాలను బీపీఏ దెబ్బతీస్తోందన్నారు. ఈ పరిశోధనా పత్రాన్ని ఇటీవల ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ మాలిక్యులర్‌ సైన్సెస్‌’ ప్రచురించింది. ఇప్పటికే ప్రకృతిలో కలిసిపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ద్వారా మానవ శరీరంలోకి వెళ్లి దుష్ప్రభావాలు చూపుతున్నాయని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డా.హేమలత తెలిపారు. ప్లాస్టిక్‌ ప్లేట్లు, ఆహారాన్ని తీసుకెళ్లేందుకు వాడే బాక్సులు, తాగునీటి ప్లాస్టిక్‌ సీసాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని స్పష్టంచేశారు. ముఖ్యంగా గర్భం దాల్చేందుకు సిద్ధమైన మహిళలు, గర్భం దాల్చాక ప్లాస్టిక్‌ వినియోగాన్ని ఆపేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు