Tamilisai Soundararajan: అదే దూరం.. అవే విభేదాలు

రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ల మధ్య అంతరం ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు బిల్లుల పెండింగుతో పాటు తాజాగా నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనను తిరస్కరించడం.. రెండిటి మధ్య మళ్లీ వివాదానికి కారణమవుతోంది.

Updated : 26 Sep 2023 09:54 IST

ఇప్పటికే రాజ్‌భవన్‌లో బిల్లుల పెండింగు

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ల మధ్య అంతరం ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు బిల్లుల పెండింగుతో పాటు తాజాగా నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనను తిరస్కరించడం.. రెండిటి మధ్య మళ్లీ వివాదానికి కారణమవుతోంది. గతంలో నామినేటెడ్‌ కోటాలో కౌశిక్‌రెడ్డిని తిరస్కరించిన గవర్నర్‌.. తాజాగా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల పేర్లతో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆమోదించకపోవడం చర్చనీయాంశమవుతోంది. 2019 సెప్టెంబరు 8న గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై(Tamilisai Soundararajan) నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వంతో పలుసార్లు విభేదించారు.  కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటు దగ్గర మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రొటోకాల్‌ పరమైన అంశాలకు తోడు అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు, రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు మొదట్లో ఆహ్వానించకపోవడం వంటి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభ, మండలి ఏకగ్రీవ ఆమోదం అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిన అధికశాతం బిల్లులను పెండింగులో పెట్టారు. కొన్నింటిని తిరస్కరించగా.. మరికొన్ని తిప్పిపంపారు. ఇంకొన్ని రాష్ట్రపతికి పంపారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీతో పాటు.. కీలకమైన బిల్లులు కావడంతో.. ఇటీవల శాసనసభలో రెండో దఫా తీర్మానం చేసి పంపినవి సైతం పెండింగులోనే ఉన్నాయి.

ఆర్టీసీ బిల్లుకే ఆమోదం

కీలకమైన ఆర్టీసీ బిల్లును గవర్నర్‌ కొన్ని రోజులు పెండింగులో పెట్టడంతో కార్మికులు ఆందోళనకు దిగి.. రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఈ బిల్లును ఆమోదించారు. విభేదాలు, వివాదాల నేపథ్యంలో మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజున సీఎం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై రాష్ట్ర సచివాలయంలో దేవాలయం, మసీదు, చర్చిల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ల సమక్షంలోనే ప్రార్థనామందిరాల ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత సీఎం స్వయంగా గవర్నర్‌ను తీసుకొని వెళ్లి సచివాలయాన్ని చూపించారు. దీంతో ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ చేరువయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, తాజాగా మంత్రిమండలి సిఫార్సు చేసిన అభ్యర్థిత్వాలను తిరస్కరించడంతో సయోధ్య ప్రశ్నార్థకంగా మారింది.

నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పోస్టులకు గండం

గతంలో కౌశిక్‌రెడ్డిని నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా ప్రభుత్వం ప్రతిపాదించగా.. 171(5) అధికరణ కింద ఆయన సేవాకార్యక్రమాలు ఎక్కడా నిర్వహించలేదనే కారణంతో గవర్నర్‌ తిరస్కరించారు. దీంతో ప్రభుత్వం ఆయన పేరును వెనక్కి తీసుకొని.. మాజీ సభాపతి మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా.. కొన్ని రోజుల పరిశీలన అనంతరం గవర్నర్‌ ఆమోదం తెలిపారు. తాజాగా నామినేటెడ్‌ కోటాలోని రెండు ఖాళీలను ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఎందిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని మంత్రిమండలి ఆమోదించి.. గవర్నర్‌కు పంపగా.. వీరిద్దరి పేర్లను తిరస్కరించడంతో మళ్లీ ఎంపిక వ్యవహారం మొదటికి వచ్చింది.

ముఖ్య నేతలతో సీఎం సమావేశం

రాజ్‌భవన్‌ నుంచి సమాచారం అందిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నివాసంలో పార్టీ నేతలతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. నామినేటెడ్‌ ఎమ్మెల్సీల ఎంపిక అంశంపై చర్చించారు. గతంలో కౌశిక్‌రెడ్డి పేరును తిరస్కరించిన తర్వాత రెండోసారి ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్‌కు పంపలేదు. ఆయనకు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే తాజాగా ఇద్దరు అభ్యర్థులు కీలకమైన ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారు కావడంతో.. వారిని మార్చకూడదనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. ఎన్నికల కోడ్‌ కంటే ముందే మరోసారి మంత్రిమండలి సమావేశం నిర్వహించి, రెండోసారి వీరి పేర్లను పంపాలని.., గవర్నర్‌ నిర్దేశించిన నిబంధనల పరిధికి సంబంధించి సమాచారం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని