ఎవరి ధీమా వారిదే!

ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. నవంబరు 30న పోలింగ్‌ జరగనుండటంతో రానున్న యాభై రోజులు వాటికి కీలకం కానున్నాయి.

Updated : 10 Oct 2023 08:09 IST

ఎన్నికల బరిలోకి ప్రధాన పార్టీలు
రానున్న 50 రోజులు అత్యంత కీలకం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. నవంబరు 30న పోలింగ్‌ జరగనుండటంతో రానున్న యాభై రోజులు వాటికి కీలకం కానున్నాయి. చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన భారాస ప్రచారంలో ముందుండగా... కాంగ్రెస్‌, భాజపాలూ జోరు పెంచాయి. గత తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధితోపాటు పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలను పరిష్కరించిన భారాస హ్యాట్రిక్‌ గ్యారంటీ అన్న ధీమాను వ్యక్తంచేస్తోంది. ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రజలకు తమపై నమ్మకం పెరిగిందని, ఓటర్లు ఆశీర్వదిస్తారని కాంగ్రెస్‌ స్పష్టంచేస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న భాజపా ఇటీవల మళ్లీ జోరు పెంచింది. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పసుపు బోర్డుతోపాటు తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షకు నిర్ణయం తీసుకుంది. దాంతో పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటోంది.

సభలు, శంకుస్థాపనలతో భారాస జోరు

ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో ఆరుగురికి మినహా మిగిలిన అందరికీ టికెట్లు ఇచ్చారు. రకరకాల కార్యక్రమాల పేరుతో అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దింపడంతోపాటు, పలుచోట్ల నాయకుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు. నాలుగైదు చోట్ల తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు లేవని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో వీరిద్దరూ సుడిగాలి పర్యటనలు చేసి బహిరంగసభలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచారంలోనూ, అన్నివర్గాలు తమకు మద్దతు ఇచ్చేలా చూసుకోవడానికి అవసరమైన చర్యల్లో భారాస ముందుంది. షెడ్యూలు రాకముందే ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. అభ్యర్థులంతా నెలరోజులుగా పూర్తిగా నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు. మరోవైపు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆయా కార్యక్రమాలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... షెడ్యూలు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 15 నుంచి వరుసగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ ఆశలు

కర్ణాటక ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం నెలకొంది. మూడు నెలలుగా దూకుడుగా ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న భారాసపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అది తమకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించింది. అదే సమయంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో సోనియాగాంధీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. రైతులు, మహిళలు, కార్మికులు, యువత, విద్యార్థులు ఇలా వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా ఉన్న ఈ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. అగ్ర నాయకులంతా టికెట్ల ఖరారు ప్రక్రియలో నిమగ్నం కావడంతో అనుకున్నట్లుగా ప్రచారం జరగడంలేదన్న అభిప్రాయముంది. షెడ్యూలుకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనుకొన్నా ఆ కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ప్రచారం చేసుకొన్నవారు కాకుండా... కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. టికెట్ల కేటాయింపు తేలక పలుచోట్ల ఇంకా ప్రచారమే మొదలవలేదు. అయితే గతంలో 60-70 చోట్ల మాత్రమే బలమైన అభ్యర్థులుండేవారని, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు చేరుతుండటంతో ప్రస్తుతం 90కి పైగా నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి వచ్చిందని, అధికార పార్టీపైన ప్రజల్లో ఉన్న అసంతృప్తి తమకు లాభిస్తుందన్న ధీమాను కాంగ్రెస్‌ నాయకులు వ్యక్తంచేస్తున్నారు.

ప్రధాని సభలతో వేగం పెంచిన భాజపా

కర్ణాటక ఎన్నికలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత భాజపాలో కొంత స్తబ్దత నెలకొన్నా నెలరోజులుగా వేగం పెరిగింది. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలో ప్రధాని మోదీతో బహిరంగసభలు నిర్వహించింది. వెంటనే రాష్ట్రస్థాయి సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు కూడా భాజపా పాలిత రాష్ట్రాల్లోని 119 మంది ఎమ్మెల్యేలను తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటింపజేసి, పార్టీ పరిస్థితిపై నివేదికలు తెప్పించారు. అదేసమయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొన్ని రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. హోంమంత్రి అమిత్‌షా సైతం మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలోనూ, హైదరాబాద్‌లో మేధావులతో జరిగే సమావేశంలోనూ పాల్గొంటారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అనేక పథకాలు ప్రారంభించిందని గట్టిగా ప్రచారం చేస్తున్నారు.


2018లో భారాసకు 47% ఓట్లు

త అసెంబ్లీ ఎన్నికల్లో 47% ఓట్లతో 88 స్థానాలను గెలుచుకొని భారాస ఘన విజయం సాధించింది. 28% ఓట్లతో కాంగ్రెస్‌ 19 స్థానాలను, 7% ఓట్లతో భాజపా ఒకచోట, 4% ఓట్లతో తెదేపా రెండుచోట్ల, 3% ఓట్లతో ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలుపొందాయి. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌ నుంచి 12 మంది భారాసలో చేరగా, ఒకరు రాజీనామా చేసి భాజపాలో చేరి, ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలిచాక ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఆ స్థానంలోనూ భారాసనే గెలిచింది. ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరితోపాటు తెలుగుదేశం నుంచి గెలిచిన ఇద్దరు కూడా అధికార పార్టీలో చేరారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో భాజపా గెలుపొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో అధికార భారాసకు 104 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్‌కు ఐదుగురు, భాజపాకు ముగ్గురు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు