Published : 13 Aug 2022 00:58 IST

మళ్ళీ కట్టెల పొయ్యి వైపు...

చుక్కలనంటుతున్న గ్యాస్‌ ధరలు

ప్రస్తుత నాగరిక సమాజంలో వంటగ్యాస్‌ వినియోగం సర్వసాధారణమైపోయింది. కట్టెల పొయ్యితో మహిళలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన (పీఎంయూవై)ను 2016 మే నెలలో తెచ్చింది. అందులో భాగంగా ఎనిమిది కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 సెప్టెంబరు నాటికి అది పూర్తయింది. గత బడ్జెట్‌లో మరో కోటి కనెక్షన్లకు నిధులు కేటాయించారు. ఈ పథకం వల్ల గ్యాస్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. కొన్నాళ్లుగా గ్యాస్‌ సిలిండర్‌ ధర భారంగా మారడంతో చాలామంది పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు మళ్ళీ కట్టెల పొయ్యిల వైపు మళ్ళుతున్నారు.

తెగ్గోసుకుపోయిన రాయితీ
గ్యాస్‌ సిలిండర్‌ ధరలను 2020 మే నుంచి ఇప్పటిదాకా ఆరుసార్లు యాభై రూపాయల చొప్పున పెంచారు. నిరుడు ఏప్రిల్‌లో ఒక్కసారి పది రూపాయలు మాత్రమే తగ్గించారు. ఫలితంగా భారత్‌లో సిలిండర్‌ ధర ఎన్నడూ లేని విధంగా పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర పదకొండు వందల రూపాయలకు పైగా ఉంది. ప్రాంతాల వారీగా ఈ ధర మారుతుంది. మరోవైపు కేంద్రం మూడేళ్లుగా గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీని తగ్గించుకొంటూ వస్తోంది. కేంద్ర సర్కారు ఎల్‌పీజీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీఎల్‌), ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పీఎంయూవై), ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ కార్యక్రమం (పీఎంజీకేపీ) వంటి మూడు రకాల గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ పథకాలను ప్రవేశపెట్టింది. 2019-20 బడ్జెట్‌లో డీబీటీఎల్‌ పథకానికి బడ్జెట్‌లో రూ.22,726 కోట్లు కేటాయించారు. ఆ తరవాతి ఏడాది అది రూ.3,658 కోట్లకు తగ్గింది. 2020-21 బడ్జెట్‌లో కొవిడ్‌ ఉపశమనం కోసం పీఎంజీకేపీ తెచ్చారు. అందులో భాగంగా రూ.8,162 కోట్ల గ్యాస్‌ సబ్సిడీ అందించారు. ఆ తరవాతి ఏడాది బడ్జెట్‌లో పీఎంయూవై, పీఎంజీకేపీ రాయితీని పూర్తిగా తొలగించారు. ఫలితంగా గతేడాది బడ్జెట్‌లో మొత్తం గ్యాస్‌ రాయితీలు కేవలం రూ.242 కోట్లకు పరిమితమయ్యాయి. పీఎంయూవై సిలిండర్లకు సబ్సిడీని తొలగించడంపై నిరసనలు వ్యక్తమవడంతో ఈ ఏడాది జూన్‌లో కేంద్రం రూ.200 రాయితీ కల్పించింది. అబ్జర్వర్‌ రీసెర్చి ఫౌండేషన్‌ అధ్యయనం ప్రకారం 2013 నుంచి ఏడేళ్ల కాలంలో అంతర్జాతీయంగా వంట గ్యాస్‌ ధర 48శాతం తగ్గింది. 2020-21తో పోలిస్తే ఆ తగ్గుదల 31శాతం. కానీ, దేశీయంగా 2014 ఏప్రిల్‌ నుంచి 2021 అక్టోబరు దాకా గ్యాస్‌ సిలిండర్‌ ధరను 110శాతం పెంచారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరవాతే అంతర్జాతీయంగా సిలిండర్‌ ధర పెరిగింది. అంతకు ముందు ఆరేళ్లు ధర తక్కువగా ఉంది. దానివల్ల ప్రభుత్వంపై సబ్సిడీ భారం గణనీయంగా తగ్గింది.

లక్ష్యాలకు గండి
గృహ వినియోగ సబ్సిడీ సిలిండరు ధర 2020 నవంబరు నుంచి 2022 జులై మధ్య కాలంలో దాదాపు అయిదు వందల రూపాయల దాకా పెరిగింది. ఏడేళ్ల నుంచి కేంద్రం గ్యాస్‌ రాయితీలను తగ్గించుకొంటూ వస్తోంది. దేశంలో 99.8శాతం కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్‌ ధరలు చుక్కలను తాకుతుండటంతో 59శాతం కుటుంబాలు వంటకోసం బయోగ్యాస్‌, విద్యుత్తులనూ వాడుతున్నారని అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 45శాతం. ధనిక రాష్ట్రమైన గుజరాత్‌లో 94శాతం పట్టణ కుటుంబాలు ఎల్‌పీజీ వినియోగిస్తున్నాయి. గ్రామాల్లో కేవలం 46శాతం కుటుంబాలే వంటకోసం గ్యాస్‌ బండలను వాడుతున్నాయి. పేద మహిళలకు కట్టెల పొయ్యి పొగ నుంచి విముక్తి కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రధానమంత్రి ఉజ్జ్వల పథకం తెచ్చారు. గ్యాస్‌ ధరాభారం కారణంగా ఈ పథకం సదాశయం నెరవేరడంలేదు. ఎల్‌పీజీ వినియోగం ధరతోపాటు ఆహార అలవాట్లు, కుటుంబసభ్యుల సంఖ్య, ప్రత్యామ్నాయాలైన కర్రలు, బొగ్గులు, పిడకల ధరలు, వాటి సులభ లభ్యతలపై ఆధారపడి ఉంటుంది. సిలిండర్‌ ధరలు భగ్గుమంటుండటంతో గ్రామీణ పేద కుటుంబాలు కాలుష్య కారక ఘన ఇంధనాల వైపు మళ్ళుతున్నాయి. కర్బన ఉద్గారాల కట్టడి లక్ష్యాలకు ఇది విఘాతకరంగా నిలుస్తుంది. మహిళల ఆరోగ్యాలనూ దెబ్బతీసి వైద్య భారాన్ని పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్‌ సిలిండర్‌ రాయితీలను కేంద్రం కొంత పెంచి, కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాగే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను శాస్త్రీయంగా గుర్తించి ఏడాదిలో కొన్ని గ్యాస్‌ బండలను వారికి ఉచితంగా అందించాలి.


తగ్గిన వినియోగం

* గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2.11 కోట్ల మంది కనీసం ఒక్క గ్యాస్‌ బండనూ తీసుకోలేదని కేంద్రం వెల్లడించింది. గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఆకాశాన్ని తాకుతుండటమే దీనికి కారణం.

* ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో సిలిండర్లు తీసుకోని వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

* ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 లక్షల మంది వినియోగదారులు గ్యాస్‌ బండను తీసుకోలేదు.

* ఉజ్జ్వల పథకం కింద 2020-21లో 35.44 కోట్ల రీఫిళ్లు నమోదైతే, ఆ తరవాతి సంవత్సరం అవి 31.47 కోట్లకు పడిపోయాయి. ఉజ్జ్వల లబ్ధిదారులకు కేంద్రం రెండొందల రూపాయల రాయితీ ప్రకటించినా- తొమ్మిది వందల రూపాయలకు పైగా వెచ్చించి గ్యాస్‌ బండ తీసుకోవడానికి ఎంతమంది పేదలు ముందుకొస్తారని పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

* ఉజ్జ్వల లబ్ధిదారులు 2020-21లో సగటున 4.39 సిలిండర్ల చొప్పున తీసుకున్నారు. ఈ తలసరి వినియోగం తరవాతి ఏడాది 3.68కి తగ్గిపోయింది.


Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని