పర్యావరణానికి ప్లాస్టిక్‌ కాటు

మానవాళితో పాటు ఇతర జీవుల మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకం. దీనికి ప్రాధాన్యమిస్తూ ఐక్యరాజ్య సమితి తొలిసారిగా 1972లో స్టాక్‌హోమ్‌లో కీలక సమావేశం నిర్వహించింది. నాటి నుంచి దేశాలన్నీ ఏటా జూన్‌ అయిదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుతున్నాయి.

Published : 05 Jun 2023 00:34 IST

మానవాళితో పాటు ఇతర జీవుల మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకం. దీనికి ప్రాధాన్యమిస్తూ ఐక్యరాజ్య సమితి తొలిసారిగా 1972లో స్టాక్‌హోమ్‌లో కీలక సమావేశం నిర్వహించింది. నాటి నుంచి దేశాలన్నీ ఏటా జూన్‌ అయిదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్నది ఈ ఏడాది నినాదం.

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పేరిట జరుగుతున్న మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దానివల్ల వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనేక మార్పులు జీవుల మనుగడకు తీవ్ర ముప్పుగా పరిణమించాయి. దాంతో పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణకు పలు దేశాలు నడుం బిగించాయి. ఈ క్రమంలోనే భారత్‌ ‘మిషన్‌ లైఫ్‌’ కార్యక్రమాన్ని రూపొందించింది. గత అక్టోబరులో గుజరాత్‌లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ సమక్షాన ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. సమ్మిళిత అభివృద్ధికి పర్యావరణ హితకర జీవనశైలి తారక మంత్రంలా పనిచేస్తుందని ఆ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.

ఆర్థిక ఇక్కట్లు

మనిషి జీవితం ప్లాస్టిక్‌తో మమేకమైపోయింది. తేలికపాటి చేతి సంచులు మొదలు భారీ ఉపకరణాల వరకు అన్నింటిలోనూ ప్లాస్టిక్‌ వినియోగం తప్పనిసరిగా మారింది. దాన్ని పూర్తిగా నిలువరించడం అసాధ్యమని భావించిన ప్రభుత్వాలు- ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించేందుకు చర్యలు చేపట్టాయి. ఒక అంచనా ప్రకారం ఇలాంటి ప్లాస్టిక్‌ ఏటా 40కోట్ల టన్నుల మేర ఉత్పత్తి అవుతోంది. 1950వ దశకంలో వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 950 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అయినట్లు అంచనా. ఇందులో పునర్వినియోగమయ్యింది కేవలం తొమ్మిది శాతమే! మిగతా 91శాతాన్ని డంపింగ్‌ యార్డులకు తరలించడమో, దహనం చేయడమో జరిగింది. చివరికి ఈ వ్యర్థాలు నేలను, జలాలను కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ను నేరుగా లేదా చెత్తతో కలిపి తగలబెట్టడంవల్ల డయాక్సిన్లు, ఫ్యూరాన్లు అనే క్యాన్సర్‌ కారక వాయువులు వెలువడుతున్నాయి. మనం వాడే ప్లాస్టిక్‌లో 90శాతం శిలాజ ఇంధన వ్యర్థాల నుంచి తయారైందే. ఈ తయారీ ప్రక్రియ ద్వారా హెచ్చుస్థాయిలో బొగ్గుపులుసు వాయువు విడుదల అవుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు నిత్యం కుంటలు, చెరువులు, నదులు, సముద్రాల్లోకి భారీగా వచ్చి చేరుతున్నాయి. ఈ కారణంవల్లే మనం తినే ప్రతి మూడు చేపల్లో ఒకటి ప్లాస్టిక్‌ ప్రభావానికి గురైనట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్లాస్టిక్‌, రసాయన వ్యర్థాలు, పర్యావరణ మార్పుల కారణంగా భారత్‌ ప్రధానంగా భూసార క్షీణతకు గురవుతోంది. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న మట్టి అనేక సూక్ష్మ ఖనిజ ధాతువుల సముదాయం. వేల సంవత్సరాల్లో చోటుచేసుకున్న వాతావరణ మార్పుల వల్ల భూ ఉపరితల రాతి నుంచి ఈ మట్టి ఏర్పడింది. కాలక్రమంలో గాలి, నీరు, వాయుకాలుష్యానికి తోడు రసాయన వ్యవసాయం, తవ్వకాలు వంటి మానవ చర్యలతో భూసారం క్షీణిస్తోంది. జాతీయ భూ సర్వే, భూ వినియోగ ప్రణాళిక సంస్థ (ఎన్‌బీబీఎస్‌-ఎల్‌యూపీ) అంచనా ప్రకారం- మన దేశంలో 12కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో భూమి ఇప్పటికే కోతకు గురైంది. అడవులను పరిరక్షించడం, చెట్లను పెంచడం, గడ్డి పొరను కాపాడటం ద్వారా నేల కోతను నివారించవచ్చు.

పర్యావరణపరంగా ఇండియా ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య- ఘన వ్యర్థాల నిర్వహణ. కర్మాగారాల నుంచి విడుదలయ్యే కాలుష్యంతో పాటు, అవి పారవేసే వ్యర్థాలవల్లా పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. దీనిపై చాలామందికి సరైన అవగాహన లేదు. తడి, పొడి వ్యర్థాలను వేరు చేయకుండానే నిర్లక్ష్యంగా పారవేస్తున్నారు. దీన్ని గాడిన పెట్టేందుకే- కాలుష్యం తయారయ్యే చోటే దాన్ని సరిచేసేందుకు అయ్యే ఖర్చును వసూలు చేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

దేశంలో ఘన వ్యర్థాలను సమగ్రంగా నిర్వహించేందుకు ఎన్నో నియమాలు ఉన్నా, వాటి అమలులో సవాళ్లు ఎదురవుతున్నాయి. వ్యర్థాల నిర్వహణకు స్థానిక సంస్థల వద్ద ఆర్థిక వనరులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. వ్యర్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి. వారు ఇంటి వద్దే తడి, పొడి వ్యర్థాలను వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా వ్యర్థాల నిర్వహణ, వాటి పునర్వినియోగం సులభతరమవుతుంది. గృహ సముదాయాలు, సామాజిక భవనాలు, పార్కుల వద్ద తడిచెత్త నుంచి ఎరువును తయారు చేయవచ్చు. తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు. నివాసాల వద్దే వ్యర్థాలను వేరుచేసి సేకరించడం, పునర్వినియోగంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా మున్సిపల్‌ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.

భారీ విలువ

కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇటీవల ‘సర్కులర్‌ ఎకానమీ ఇన్‌ మున్సిపల్‌ సాలిడ్‌ అండ్‌ లిక్విడ్‌ వేస్ట్‌’ నివేదికను విడుదల చేసింది. పునర్వినియోగం చేయదగ్గ వస్తువులను డంపింగ్‌ యార్డులకు తరలించే సంస్థలపై అదనపు పన్నులు విధించాలని స్థానిక సంస్థలు, కాలుష్య నియంత్రణ మండళ్లకు సూచించింది. ఇలాంటి వ్యర్థాల రాకను అడ్డుకోవడం ద్వారా డంపింగ్‌ యార్డుల్లో భూ వినియోగాన్ని తగ్గించవచ్చు. కొత్త ప్లాస్టిక్‌ ఉత్పత్తిని తగ్గించేలా పునరుత్పాదక వస్తువులపై పన్నులను అయిదు శాతానికి తగ్గించాలని ఈ నివేదిక ప్రతిపాదించింది. ఏడాదిలో ఒక మెట్రో నగరంలో వెలువడే ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో విలువైన వాటిని పునర్వినియోగానికి పంపితే, అలా తయారయ్యే వస్తువుల విలువ రూ.500 కోట్ల పైనే ఉంటుంది. దీన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా పురపాలక సంస్థలు భారీగా నిధులు సమకూర్చుకోగలుగుతాయి.


నాలుగు సూత్రాల ఒప్పందం

మానవాళికి తీవ్ర హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఐరాస 2022 మార్చిలో నైరోబీలో పర్యావరణ సదస్సు నిర్వహించింది. ఆ సందర్భంగా 175 దేశాలు నాలుగు సూత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాయి. అవి: వ్యర్థాల నియంత్రణ దిశగా ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడం, ప్రమాదకర ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం, పారిశ్రామిక అవసరాలకు పునర్వినియోగ ప్లాస్టిక్‌ను అందుబాటులో ఉంచడం, కాలుష్యాన్ని వెదజల్లే సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించడం. ఆ సూత్రాల ఆధారంగానే భారత్‌ సహా పలు దేశాలు ‘తగ్గింపు, పునశ్శుద్ధి, పునర్వినియోగం (రెడ్యూస్‌, రీసైకిల్‌, రీయూజ్‌)’ నినాదంతో వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపడుతున్నాయి. తాజాగా ప్లాస్టిక్‌ కాలుష్య కట్టడికి అంతర్జాతీయ ఒప్పందం రూపకల్పనకు భారత్‌ సహా 170 దేశాలు అంగీకరించాయి. నవంబరు నాటికి దాని ముసాయిదా ప్రతిని సిద్ధం చేయాలని నిశ్చయించాయి.

 ఆర్‌.శ్రీనివాసరెడ్డి
(రచయిత- ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌, ఘన వ్యర్థాల నిర్వహణ నిపుణులు)

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి