వ్యక్తిగత రుణపాశాలు

ఇటీవలి కాలంలో భారత్‌లో వ్యక్తిగత రుణాలు కట్టుతప్పుతున్నాయి. వాటి చెల్లింపుల్లోనూ జాప్యం నెలకొంటోంది. దేశార్థికానికి ఇది ఏమాత్రం మంచిది కాదని గుర్తించిన రిజర్వు బ్యాంకు కొద్దిరోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 27 Nov 2023 16:45 IST

ఇటీవలి కాలంలో భారత్‌లో వ్యక్తిగత రుణాలు కట్టుతప్పుతున్నాయి. వాటి చెల్లింపుల్లోనూ జాప్యం నెలకొంటోంది. దేశార్థికానికి ఇది ఏమాత్రం మంచిది కాదని గుర్తించిన రిజర్వు బ్యాంకు కొద్దిరోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నాలుగు లక్షల కోట్ల డాలర్లకు చేరింది. జీఎస్‌టీ వసూళ్లు పెరుగుతున్నాయి. జీడీపీ పెరుగుతోందంటే ప్రజల వస్తు సేవల వినియోగం అధికమవుతోందని అర్థం. అయితే దీని వెనక ఉన్నది సొంత ఆదాయాలా, లేదా అప్పులా అనే విషయం తెలుసుకోవాలి. వ్యక్తుల ఆదాయం గత దశాబ్ద కాలంలో బాగా పెరిగిన మాట వాస్తవమే. అయితే, అదే సమయంలో వ్యక్తిగత అప్పులూ నానాటికీ అధికమవుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి బ్యాంకుల మొత్తం రుణాలు రూ.148 లక్షల కోట్లకు చేరాయి. వాటిలో వ్యవసాయ రంగం వాటా 13.3శాతం, పారిశ్రామిక రంగం వాటా 26.2శాతం, సేవల రంగం వాటా 28.4శాతం, వ్యక్తిగత రుణాల వాటా 32.1శాతం. ఈ గణాంకాలను చూస్తే వ్యక్తిగత రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.

భారీగా బకాయిలు

కొన్నేళ్లుగా ప్రజల అవసరాలు, కోరికలు పెరగడం, రుణ లభ్యత సులభం కావడంవల్ల వ్యక్తిగత రుణాలు తీసుకోవడం ఎక్కువైంది. ముఖ్యంగా, గత దశాబ్దకాలంలో బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజలకు వ్యక్తిగత రుణాలివ్వడం బాగా పెరిగింది. బ్యాంకింగ్‌ రంగం డిజిటలీకరణ తరవాత వ్యక్తిగత రుణాల లభ్యత సులభమైంది. వడ్డీ ఎక్కువ వస్తుంది కాబట్టి బ్యాంకులు సైతం చాలా దూకుడుగా పర్సనల్‌ లోన్లు ఇస్తున్నాయి. అప్పు కావాలా అని బ్యాంకుల ప్రతినిధులు ఫోన్లు చేసి అడగడం దాదాపు అందరికీ అనుభవమే! మరోవైపు బ్యాంకింగేతర రంగంలో పుట్టుకొచ్చిన రుణ యాప్‌లు నిమిషాల్లో అప్పులు ఇస్తున్నాయి. క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోళ్లు, డబ్బు చెల్లింపులూ విపరీతంగా పెరిగాయి. దేశంలో దాదాపు తొమ్మిది కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డుల వినియోగం కట్టుతప్పితే అటు రుణాలు ఇచ్చిన సంస్థలకు, ఇటు వినియోగదారులకూ ఇక్కట్లు తప్పవు. ఇవన్నీ భద్రతలేని రుణాలు అన్న విషయాన్ని మొదట గుర్తించాలి. వీటి వసూలు కష్టతరం. ఇవి పారుబాకీలుగా మారే ప్రమాదం ఉంది.

వాస్తవానికి వ్యక్తిగత రుణాల చెల్లింపుల్లో ఇటీవల జాప్యం పెరుగుతోంది. ప్రస్తుతం నాలుగు శాతం రుణాల చెల్లింపులు సక్రమంగా సాగడం లేదని పరిశీలనలు చెబుతున్నాయి. క్రెడిట్‌ కార్డు బకాయిలు రూ.1.94 లక్షల కోట్లకు చేరాయి. రుణ సంస్థలు జాగ్రత్త వహించకపోతే ఇవి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. పారుబాకీలతో సతమతం అవుతున్న బ్యాంకులకు వ్యక్తిగత రుణాలూ గుదిబండగా మారితే, అవి తీవ్ర ఇబ్బందుల్లో పడతాయి. ఈ సెప్టెంబరు నాటికి వసూలు కావాల్సిన వ్యక్తిగత రుణాలు రూ.48.26 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కొన్ని రకాల వ్యక్తిగత రుణాలు వేగంగా పెరుగుతుండటంపై జాగ్రత్త వహించాలని గతంలో రిజర్వు బ్యాంకు గవర్నర్‌ హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల దూకుడును నిలువరించడానికి ఆర్‌బీఐ ఇటీవల కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. గృహ, విద్యా, వాహన రుణాలు, బంగారం కుదువతో తీసుకునే అప్పులను మినహాయిస్తూ... వ్యక్తిగత రుణాల రిస్క్‌ వెయిట్‌ను పెంచింది. ప్రతి వ్యక్తిగత రుణానికి బ్యాంకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వద్ద ఉండాల్సిన పెట్టుబడిని 100శాతం నుంచి 125శాతానికి పెంచింది. క్రెడిట్‌ కార్డుల రుణాలకూ బ్యాంకుల వద్ద ఉండాల్సిన పెట్టుబడిని 125శాతం నుంచి 150శాతానికి అధికం చేసింది. బ్యాంకింగేతర సంస్థల్లో దాన్ని 100శాతం నుంచి 125శాతానికి పెంచింది. బ్యాంకింగేతర సంస్థలు బ్యాంకుల నుంచి సమకూర్చుకునే నిధుల రిస్క్‌ వెయిట్‌ను 25శాతానికి తీసుకెళ్ళింది. ఈ చర్యల వల్ల వ్యక్తిగత రుణాలు ఇవ్వడం తగ్గుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అప్పులపై వడ్డీ రేట్లను పెంచడమూ వ్యక్తిగత రుణాల కట్టడికి మరో మార్గం. భారతీయ స్టేట్‌ బ్యాంకు ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభించింది.

ఆందోళన ఉన్నా...

వ్యక్తిగత రుణాల కట్టడి కోసం రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలు- బ్యాంకుల ఆదాయాలను దెబ్బతీస్తాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు వెలువడిన మరునాడే బ్యాంకుల షేర్ల విలువలు క్షీణించడం దీనికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పారుబాకీలు పెరిగిపోయి బ్యాంకులు దివాలా తీయకుండా రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు తోడ్పడతాయని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. పరిస్థితులు కట్టుదాటుతున్నాయని గుర్తిస్తే రిజర్వు బ్యాంకు, కేంద్రం పలు చర్యలు తీసుకోవడం సహజం. రిజర్వు బ్యాంకు చర్యలు దేశార్థికానికి చాలా ఉపయుక్తం. ప్రజలు తమ కుటుంబ అవసరాలకు కాకుండా విలాస జీవితం గడపడానికి,  ఖరీదైన వస్తువుల కొనుగోలుకు మితిమీరి రుణాలు చేయడం మంచిది కాదని గుర్తించాలి. అప్పులు పెరిగిపోతే ఆ తరవాత ఎన్నో అవస్థల పాలవ్వాల్సి వస్తుంది. బ్యాంకులు సైతం రుణాల మంజూరులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


ప్రాణాలు తీస్తున్న అప్పులు

మితిమీరిన వ్యక్తిగత రుణాలు రుణగ్రహీతలనూ ఇబ్బందుల్లోకి నెడతాయి. వీరిలో అత్యధికులు స్థిర ఆదాయం ఉన్న ఉద్యోగులే! రుణాలను ప్రతినెలా జీతం నుంచి వీరు కట్టాల్సి ఉంటుంది. ఈఎంఐలు పెరిగేకొద్దీ నిత్యావసరాలకు చేసే ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. కొద్దిపాటి అనారోగ్యం వచ్చినా ఇటీవల భారీగా ఖర్చవుతోంది. వచ్చే జీతంలో సింహభాగం ఈఎంఐలకు వెళ్ళిపోతే, అత్యవసర సమయాల్లో చేతిలో డబ్బు ఉండదు. దాంతో మళ్ళీ చేబదుళ్లు తీసుకోవాల్సి వస్తుంది. రుణ బకాయిలు పెరిగితే, వాటిపై వడ్డీలు అధికమై చెల్లింపులు మరింత భారంగా మారతాయి. అప్పులు వసూలు చేసుకునే క్రమంలో రుణం ఇచ్చిన సంస్థల నుంచి అవమానాలు, వేధింపులనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. యాప్‌ల నుంచి రుణాలు తీసుకున్న ఎంతోమంది వాటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. వాటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటున్నా సరైన ఫలితం ఉండటం లేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.