అంకుర వికాసం... ఉపాధికి ఊతం!

భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. అంకురాల రూపంలో నవీకరణను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 16న ‘స్టార్టప్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహించడం అవసరం.

Updated : 21 Jan 2024 14:36 IST

భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. అంకురాల రూపంలో నవీకరణను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 16న ‘స్టార్టప్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహించడం అవసరం.

యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్‌ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు- అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి.

యూనికార్న్‌లుగా తీర్చిదిద్దాలని...

ఏటా జనవరి 16వ తేదీని జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ 2021లో నిర్ణయించారు. స్టార్టప్‌ల వ్యవస్థాపక సామర్థ్యాన్ని గుర్తించి, గౌరవించి, ప్రోత్సహించాలన్నదే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. దేశంలో అంకుర సంస్థలు అభివృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించడానికి ఈ దినోత్సవం అంకితమవుతోంది. అంకురాల వ్యవస్థాపకులు పరస్పరం అనుభవాలను, అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు తమకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించి, పరిష్కారం కోసం ఉమ్మడిగా కృషి చేయడానికి ఈ సందర్భంగా వేదిక కల్పిస్తున్నారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అంకుర సంస్థలను ప్రోత్సహిస్తోంది. నేడు ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్‌ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్‌లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్‌లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్‌లు ఉన్నది భారత్‌లోనే. ఒక్క 2022లోనే భారత్‌లో 42 టెక్నాలజీ అంకురాలు ఉద్భవించాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

దేశంలో 2016 నాటికి కేవలం 452 అంకుర సంస్థలే ఉండేవి. 2022కల్లా వాటి సంఖ్య 84,012కు, 2023లో 1,12,718కి పెరిగింది. 2022-23లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 84,012 అంకుర సంస్థలు ప్రత్యక్షంగా తొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2022లో మహారాష్ట్రలో అత్యధికంగా 4,801 అంకుర సంస్థలు నమోదయ్యాయి. తదుపరి రెండు, మూడు స్థానాలను ఉత్తర్‌ప్రదేశ్‌ (2,572), దిల్లీ (2,567) ఆక్రమించాయి. ఆ తరవాత ఎక్కువ అంకుర సంస్థలు ఉన్నది కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే. ప్రధాన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 91.5శాతాన్ని కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) సాంకేతికతలతో నడిచే సంస్థల్లోనే కేంద్రీకరిస్తున్నారు. 2023 నుంచి 2028 వరకు ప్రపంచ ఏఐ మార్కెట్‌ ఏటా 23శాతం చక్రీయ వార్షిక వృద్ధిరేటు సాధిస్తుందని అంచనా. భవిష్యత్తు ఏఐ, ఎంఎల్‌ రంగాల్లోని అంకుర సంస్థలదేనని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌, అనంతర కాలంలో చాలా అంకుర సంస్థలు మూతపడ్డాయి. ఇది కొత్త అంకురాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. డిజిటలీకరణ వేగం పుంజుకోవడం, సరఫరా గొలుసుల విచ్ఛిన్నం, పెట్టుబడుల కొరత, నగదు లభ్యత తగ్గడం, కొత్త నైపుణ్యాలు కలిగిన సిబ్బందిని నియమించుకోవాల్సిరావడం, ఉన్న సిబ్బందిని నిలబెట్టుకోవడం, ఆధునిక మార్కెటింగ్‌ వ్యూహాలను అందిపుచ్చుకోవడం, నియమ నిబంధనల బరువు... వంటివి అంకుర సంస్థలకు సవాళ్లుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త అంకురాల్లో 90శాతం విఫలమవుతున్నాయి. ఉత్పత్తులు, సేవలను సరిగ్గా మార్కెట్‌ చేసుకోలేకపోవడం, లాభాలు తగ్గిపోవడం, చేతిలో నగదు నిల్వలు లేకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

అంకుర సంస్థలకు 2022లో 1,560 కోట్ల డాలర్ల మలిదశ నిధులు అందాయి. నిరుడు మాత్రం అవి 420 కోట్ల డాలర్లకే పరిమితమయ్యాయి. అయితే కృత్రిమమేధ, డీప్‌టెక్‌, అంతరిక్ష, వాతావరణ మార్పుల నిరోధక పరిజ్ఞానాలకు సంబంధించిన స్టార్టప్‌లకు మాత్రం నిధులు పెద్దయెత్తున ప్రవహిస్తున్నాయని ట్రాక్‌ ఎక్స్‌ఎన్‌ సంస్థ తెలిపింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా వెంచర్‌ పెట్టుబడిదారులు 44,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2021లో భారతీయ అంకుర సంస్థలు 4,200 కోట్ల డాలర్ల వెంచర్‌ పెట్టుబడులను సంపాదించగలిగాయి. అంతకుముందు ఏడాదిలో అవి కేవలం 1,150 కోట్ల డాలర్ల నిధులనే సాధించాయి. భారతీయ అంకుర సంస్థలు 2030కల్లా స్థూలదేశీయోత్పత్తికి అదనంగా పది శాతం వరకు వాటా సమకూరుస్తాయని అంచనా. అయితే, ప్రస్తుతం అంకుర సంస్థలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2022లో 2,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు సాధించిన మన అంకుర సంస్థలు- 2023లో మాత్రం సుమారు 700కోట్ల డాలర్ల నిధులనే రాబట్టుకోగలిగాయి. ఇది 72శాతం తగ్గుదల. గత అయిదేళ్లలో ఇదే అతి తక్కువ పెట్టుబడుల ప్రవాహం.

వెన్నుతట్టి ప్రోత్సహిస్తే...

అంకుర సంస్థల వ్యవస్థాపకులు తమ నిర్వహణ సామర్థ్యాన్ని, లాభాలను పెంపొందించుకోవడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలి. ప్రభుత్వం పన్ను విరామాలను ప్రకటించి, ఆర్థిక సహాయం చేయడం ద్వారా అంకురాలకు ఊతమివ్వాలి. అధునాతన సాంకేతికతలతో విజయవంతంగా స్టార్టప్‌లను, యూనికార్న్‌లను నడుపుతున్న వ్యవస్థాపకులకు జాతీయ అంకుర సంస్థల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించాలి. యువతరాన్ని ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చే వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించాలి.


ఈ-కామర్స్‌లో అవకాశాలు

స్కైక్వెస్ట్‌ సంస్థ నివేదిక ప్రకారం, 2028 నాటికి అంతర్జాతీయ ఈ-కామర్స్‌ విక్రయాలు 58 లక్షల కోట్ల డాలర్లను మించనున్నాయి. కొవిడ్‌-19 ఉద్ధృతి తరవాత ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్‌ విజృంభిస్తోంది. ఈ రంగంలో నవకల్పనలను చేయగల అంకుర సంస్థల భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందన్న విశ్వాసం మార్కెట్‌ వర్గాలలో వ్యక్తమవుతోంది. అయితే, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొన్నందువల్ల 2024లో అంకురాలకు పెట్టుబడులు అంత తేలిగ్గా లభ్యంకాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.