సూక్ష్మ రుణాలతోనే ప్రగతికి మోక్షం

భారత స్థూల దేశీయోత్పత్తికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఈ) 33శాతం వాటాను సమకూరుస్తోంది. 11.1 కోట్ల ఉద్యోగాలను  కల్పిస్తోంది. దేశ పారిశ్రామికోత్పత్తిలో 45శాతానికి ఈ రంగమే ఆధారం. ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తున్న ఎంఎస్‌ఎంఈ సంస్థల్లో అత్యధికం సంఘటిత రంగం పరిధిలో లేవు. ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అవి రుణాలకు నోచుకోలేకపోతున్నాయి.

Updated : 21 Jan 2024 14:37 IST

భారత స్థూల దేశీయోత్పత్తికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఈ) 33శాతం వాటాను సమకూరుస్తోంది. 11.1 కోట్ల ఉద్యోగాలను  కల్పిస్తోంది. దేశ పారిశ్రామికోత్పత్తిలో 45శాతానికి ఈ రంగమే ఆధారం. ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తున్న ఎంఎస్‌ఎంఈ సంస్థల్లో అత్యధికం సంఘటిత రంగం పరిధిలో లేవు. ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అవి రుణాలకు నోచుకోలేకపోతున్నాయి.

దేశంలో సుమారు 6.4 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఉన్నాయి. వాటిలో 14శాతానికి మాత్రమే ఆర్థిక సంస్థల నుంచి రుణాలు అందుతున్నాయి. సంఘటిత రంగంలోని ఎంఎస్‌ఎంఈలకు మొత్తంగా 37లక్షల కోట్ల రూపాయల రుణాలు అవసరం. కానీ, రూ.14.5లక్షల కోట్ల మేరకు మాత్రమే రుణాలు అందుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల నుంచి మరిన్ని రుణాలు అందినప్పుడే ఎంఎస్‌ఎంఈ రంగం దేశాభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించగలుగుతుంది. పూర్తిస్థాయిలో రుణ లభ్యత కొరవడినప్పటికీ, వర్ధమాన దేశాల్లో ఎంఎస్‌ఎంఈలే అతిపెద్ద ఉపాధి కల్పనదారులుగా నిలుస్తున్నాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

ఉపాధికి ఊతం

ప్రపంచమంతటా 2030కల్లా 60 కోట్ల ఉద్యోగాలు కల్పించాలంటే ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పెద్దయెత్తున ప్రోత్సహించాలి. భారత్‌లో ఎంఎస్‌ఎంఈ సంస్థలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ రంగం ఎంతగా అభివృద్ధి చెందితే ఆదాయాలు అంతగా పెరుగుతాయి. అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు తొలగుతాయి. కానీ, మధ్యతరహా ఎంఎస్‌ఎంఈలు తప్పిస్తే 80శాతం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించడం లేదు. ఈ కొరతను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం- సూక్ష్మ, చిన్న పరిశ్రమల పరపతి హామీ నిధి ట్రస్టు (సీజీటీఎంఎస్‌ఈ) పథకాన్ని ప్రారంభించింది. దీనికింద 2022లో 52శాతం ఎక్కువగా రుణాలిచ్చారు. రుణ మొత్తాలూ పెరిగాయి. అయినప్పటికీ, మొత్తం అవసరాల్లో తీరుతున్నది స్వల్పమే. ఎంఎస్‌ఎంఈలకు రుణ లభ్యత మరింత పెరగాలి. ఈ పరిశ్రమల రుణ అవసరాల్లో కేవలం 15శాతాన్ని మాత్రమే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తీర్చగలుగుతున్నాయని 2022నాటి బ్లింక్‌ ఇన్వెస్ట్‌ నివేదిక తెలిపింది. కొవిడ్‌ వచ్చినప్పటి నుంచి ఎంఎస్‌ఎంఈ సంస్థలు డిజిటలీకరణ అవసరాన్ని గుర్తించాయి. ఈ విషయంలో టెక్నాలజీ కంపెనీల సాయం ఎంఎస్‌ఎంఈలకు ఎంతగానో ఉపకరిస్తోంది. ఇవి డిజిటలీకరణ చేపట్టి వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నా- రుణ లభ్యత పెరగాలి. ఎంఎస్‌ఎంఈల రుణావసరాలను తీర్చడానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ ఎం.రాజేశ్వరరావు ఇటీవల పిలుపిచ్చారు. ఎంఎస్‌ఎంఈల రుణావసరాలకు, లభ్యతకు మధ్య ఉన్న అంతరాన్ని అధిగమించాలంటూ ఆయన మేలిమి సూచన చేశారు. ఎంఎస్‌ఎంఈలతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ఆదాయ స్థాయులను బట్టి రుణాలు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు ఎంతో అవసరమన్నారు. ఇందుకు ఆర్థిక సంస్థలు అధునాతన సాంకేతికతల ద్వారా వినూత్న మార్గాలను అందిపుచ్చుకోవాలి. వ్యక్తులు, సంస్థల గురించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకుని స్థోమతకు తగిన మొత్తంలో రుణాలను మంజూరు చేయవచ్చు. వ్యాపార సంస్థల మార్కెట్‌కు తగిన రుణాలు సమకూర్చవచ్చు. ఇదే తరహాలో వీధి వర్తకుల రుణ అవసరాలను కూడా తీర్చాలన్నది రిజర్వ్‌ బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ రాజేశ్వరరావు సూచన.

కొవిడ్‌ కాలంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినప్పటికీ, ఆ తరవాత పరిస్థితిలో క్రమేణా మార్పు వస్తోంది. పారిశ్రామిక రంగంలోని ఎంఎస్‌ఎంఈలకు రుణ వితరణ పెరిగిందని, భారీ పరిశ్రమలకన్నా ఈ సంస్థలకే ఎక్కువ శాతం రుణాలు లభించాయని రిజర్వు బ్యాంకు 2022 డిసెంబరు నివేదికలో వెల్లడించింది. కానీ, 2019 ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్‌ఎంఈలకు రుణ వితరణ మూడు శాతం మేర, 2020లో రెండు శాతం మేర తగ్గింది. ఇది కొవిడ్‌ ప్రభావమే. కొవిడ్‌ నుంచి ఆర్థిక వ్యవస్థ తెప్పరిల్లిన తరవాత రుణ వితరణ క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2021లో ఎంఎస్‌ఎంఈలకు రుణ సరఫరా 20శాతం, 2022లో 35శాతం పెరిగినట్లు రిజర్వు బ్యాంకు తెలిపింది. 2021లో భారీ పరిశ్రమలకు రుణ సరఫరా అయిదు శాతం తగ్గి, 2022లో మూడు శాతం పెరిగింది. పరిస్థితుల్లో మార్పు వస్తున్నప్పటికీ... చిన్న, పెద్ద పరిశ్రమల రుణ అవసరాలు మాత్రం పూర్తిగా తీరడంలేదు.

ప్రత్యామ్నాయాలు...

రుణ వితరణకు సంప్రదాయ మార్గాలతోపాటు ప్రత్యామ్నాయాలనూ రిజర్వు బ్యాంకు ముందుకు తెచ్చింది. బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌లో రుణదాతలను, రుణ గ్రహీతలను కలపడం ఒక పద్ధతి. దీన్ని ‘పీర్‌ టు పీర్‌ లెండింగ్‌’ అంటారు. నిధులు ఇచ్చినందుకు ప్రతిగా సంస్థలో వాటాలు ఇచ్చే ఈక్విటీ ఫైనాన్సింగ్‌నూ చేపట్టవచ్చు. భారీ కంపెనీలకు ఎంఎస్‌ఎంఈలు సరఫరా చేసిన సరకుల ఇన్వాయిస్‌లపై త్వరగా కొంత చెల్లించడం ఒక పద్ధతి. దీన్ని టీఆర్‌ఈడీఎస్‌ అంటారు. ఇటువంటి ప్రత్యామ్నాయ రుణ సరఫరా మార్గాలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో, సముచిత స్థాయిలో రుణాలు అందడం లేదు. ఆత్మనిర్భర్‌ భారత్‌, డిజిటల్‌ ఇండియా వంటి కార్యక్రమాలు దేశంలో అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. వాటికి సకాలంలో రుణాలను, రిస్క్‌ క్యాపిటల్‌నూ అందించడానికి పకడ్బందీ ఏర్పాట్లు జరగాల్సి ఉంది. భారీ పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చిన రుణాల్లో పారుబాకీలుగా తేలుతున్నవి చాలా స్వల్పం. బ్యాంకులు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ఎంఎస్‌ఎంఈలకు మార్గదర్శనం చేయడానికి బ్యాంకులు ప్రత్యేక కన్సల్టెన్సీలను నియోగించాలి. పూచీకత్తు లేని రుణాల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సీజీటీఎంఎస్‌ఈ పథకం పరిధిని విస్తరించాలి. ప్రభుత్వ ఆర్డర్ల కోసం దరఖాస్తు చేసే ఎంఎస్‌ఎంఈలకు టెండరు పత్రాలను ఉచితంగా ఇవ్వడం, వివిధ రకాల డిపాజిట్‌లను మినహాయించడంతో పాటు బిడ్‌ ధరలో రాయితీ, వడ్డీపై సబ్సిడీ వంటి వెసులుబాట్లు కల్పించాలి.


డిజిటల్‌ మార్గం

కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి అధునాతన సాంకేతికతలను, విస్తృత డేటా బేస్‌లను ఉపయోగించి మెరుగైన ఎంఎస్‌ఎంఈలను గుర్తించవచ్చు. వాటికి డిజిటల్‌ మార్గంలోనే రుణాలు అందించవచ్చు. ఇలా ఆన్‌లైన్‌ మార్గంలో ఎంఎస్‌ఎంఈలకు అందుతున్న రుణాలు ఇటీవల రెండు రెట్లు పెరిగాయని బ్లింక్‌ ఇన్వెస్ట్‌ నివేదిక వెల్లడించింది. రిజర్వు బ్యాంకు ఇటీవల డిజిటల్‌ రుణాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తదనుగుణంగా ఫైనాన్స్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) సంస్థలు క్రెడిట్‌ రేటింగ్‌ను చేపట్టి ఎంఎస్‌ఎంఈల వ్యాపారాన్ని అంచనా వేసి రుణ వితరణకు పూనుకొంటున్నాయి. చిల్లర వర్తకుల లావాదేవీల రికార్డును పరిశీలించి, వారి సత్తాకు తగిన రుణాలు ఇస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో, తగిన స్థాయిలో రుణాలు అందించడానికి డిజిటల్‌ మార్గం ఉపకరిస్తోంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.