ఆసరా దక్కని అసంఘటిత రంగం

ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సామాజిక భద్రతా ప్రయోజనాలపై కేంద్రం దృష్టి సారించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సంఘటిత రంగం మాదిరిగా అసంఘటిత రంగ కార్మికులకూ కనీస వేతనం, పింఛన్‌, ఆరోగ్య బీమా తదితరాలు అందించాలని సర్కారు యోచిస్తోంది.

Updated : 21 Jan 2024 14:38 IST

ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సామాజిక భద్రతా ప్రయోజనాలపై కేంద్రం దృష్టి సారించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సంఘటిత రంగం మాదిరిగా అసంఘటిత రంగ కార్మికులకూ కనీస వేతనం, పింఛన్‌, ఆరోగ్య బీమా తదితరాలు అందించాలని సర్కారు యోచిస్తోంది. ఇదంతా 2020లో రూపొందించిన సామాజిక భద్రతా నిబంధనావళిలో భాగమే. పలు దేశాలతో పోలిస్తే సామాజిక భద్రత కల్పనలో భారత్‌ వెనకబడింది.

కొవిడ్‌ కాలంలో, ఆ తరవాత ఉపాధి కల్పనకు ఉద్దేశించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ పథకం (ఏబీఆర్‌వై) పరిధిలోకి 71.8 లక్షల మంది కార్మికులను తేవాలని కేంద్రం తలపెట్టింది. నిరుడు డిసెంబరు నాటికే లక్ష్యాన్ని అధిగమించినట్లు ప్రకటించింది. ఉద్యోగులు, యజమానులు పీఎఫ్‌ కింద చెల్లించాల్సిన చెరి 12శాతం వాటాలను ఏబీఆర్‌వై కింద రెండేళ్లపాటు ప్రభుత్వమే జమ చేస్తుంది. దీనివల్ల సంస్థలపై పీఎఫ్‌ భారం తగ్గి, ఉద్యోగ కల్పన పెరుగుతుందని భావించింది. నెలకు రూ.15,000 కన్నా తక్కువ వేతనం పొందేవారే దీనికి అర్హులు. ఈ పథకం కింద కేంద్రం రూ.10 వేల కోట్లు వెచ్చించింది. ఆటొమొబైల్‌ మరమ్మతుదారులు, గని కార్మికులు తదితర 194 పనుల్లో ఉన్నవారు ఏబీఆర్‌వై లబ్ధిదారులు. ఇంతాచేసి ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య భారతదేశ మొత్తం కార్మిక బలగంలో రెండు శాతానికి మించదు! వీరంతా అసంఘటిత రంగంలోనే ఉన్నారు.

పెను సవాలు

పేదరికం తాండవిస్తున్న దేశంలో అసంఘటిత రంగ కార్మికుల బాగోగులను ఉపేక్షించడం ఉత్పాదకతకు, దేశ ఆర్థికాభివృద్ధికి మేలు చేయదు. సామాజిక భద్రత లేనివారిని అసంఘటిత రంగ కార్మికులుగా అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నిర్వచిస్తోంది. భారత్‌లోని 47.5 కోట్ల కార్మిక బలగంలో 91శాతం అసంఘటిత రంగంలోనే కొనసాగుతున్నారు. బొలీవియా, మంగోలియా, నమీబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఇద్దరికీ సామాజిక భద్రత కల్పిస్తున్నాయి. మిగతా వర్ధమాన దేశాలు తమ జీడీపీలో ఏడు శాతాన్ని మాత్రమే సామాజిక భద్రతకు వెచ్చిస్తుంటే- ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)లోని సంపన్న దేశాలు అంతకు మూడు రెట్లు అధికంగా కేటాయిస్తున్నాయి.

భారత ప్రభుత్వం 2020లో తెచ్చిన సామాజిక భద్రతా నిబంధనావళి అంతకుముందు నుంచి అమలులో ఉన్న ఎనిమిది సామాజిక భద్రతా చట్టాల కలయికే తప్ప- అసంఘటిత రంగ కార్మికులకు కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వ చట్టాలు, పథకాలు ఇప్పటికీ సంఘటిత రంగంపట్లే పక్షపాతం కనబరుస్తున్నాయి. నిర్మాణ కార్మికులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లేదా ఉన్న రాష్ట్రంలోనే ఒక చోటు నుంచి మరో చోటుకు తరచూ తరలిపోతుంటారు. 2020 నిబంధనావళి ఇలాంటి వారికి ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. దాంతో నిర్మాణ కార్మికుల నిధిలో వారి భాగస్వామ్యం ప్రశ్నార్థకమవుతోంది. ఆ కార్మికుడు ఎక్కడి నుంచి ఈ నిధి ప్రయోజనాల కోసం దరఖాస్తు చేయాలనేది చిక్కు ప్రశ్నగా మారింది. అదీకాకుండా ఒక్కో సంస్థలో ఉద్యోగుల సంఖ్యను బట్టి పథకం ప్రయోజనాల పరిమాణం మారుతుంది. వ్యవసాయ-వ్యవసాయేతర, పరిశ్రమలు-పారిశ్రామికేతర కార్మికులందరికీ సామాజిక భద్రత లభించాలి. కాంట్రాక్టర్లు సరఫరా చేసే ఒప్పంద కార్మికుల విషయంలో సామాజిక భద్రతా నిబంధనావళి మౌనం పాటించడం మరో వైరుధ్యం. ఇటువంటి అదృశ్య కార్మికులనూ పరిగణనలోకి తీసుకోవాలి. 2008నాటి అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం, 2004నాటి జాతీయ పింఛన్‌ వ్యవస్థ (ఎన్‌పీఎస్‌) కూడా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంలో విఫలమయ్యాయి. 2020నాటి నిబంధనావళి ఈ లోపాన్ని సరిదిద్ది అసంఘటిత కార్మికులకు న్యాయం చేసి ఉంటే ఎంతో బాగుండేది.
సామాజిక భద్రత రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి- సామాజిక సహకారం, రెండు- సామాజిక బీమా. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు నగదు రూపంలో ఇచ్చే పింఛన్లను సామాజిక సహకారంగా పరిగణిస్తారు. సామాజిక బీమా కిందకు ఆరోగ్య బీమా, పింఛన్లు, మాతా సంక్షేమ భృతి వంటివి వస్తాయి. 2020నాటి నిబంధనావళి సామాజిక బీమాను తప్ప సామాజిక సహకారాన్ని పట్టించుకోవడం లేదు. దేశంలో 6.5 కోట్ల సంస్థలు ఉండగా, వాటిలో మూడింట రెండొంతులు అసంఘటిత రంగంలోనివే. వాటన్నింటినీ ఒకే ఛత్రం కిందకు తెచ్చి సామాజిక భద్రత కల్పించడం పెను సవాలు.

నిరుపేదలకు అండ అవసరం

భారత్‌లోని 47.5 కోట్ల కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి ఏకీకృత నిధిని ఏర్పరచాలి. దీనిలో ఉద్యోగులు, యజమానుల పీఎఫ్‌ వాటాలను జమచేయడం ఒక పద్ధతి. ప్రభుత్వమే ఈ వాటాలను పన్నుల ఆదాయం నుంచి చెల్లించడం రెండో పద్ధతి. ఈ రెండింటి మిశ్రమంగా మూడో పద్ధతిని రూపొందించవచ్చు. నిరుపేద కార్మికుల వాటాను ప్రభుత్వమే చెల్లించడం ఉత్తమం. పేదల పరిధిలోకి రాని ఉద్యోగులు, స్వయం ఉపాధి సంస్థలు కొంత వాటాను చెల్లిస్తే, మిగతాది ప్రభుత్వం అందించవచ్చు. అసంఘటిత కార్మికులకు ఈ పద్ధతులు సముచితంగా ఉంటాయి. సంఘటిత రంగంలోనివారికి యథాప్రకారం ఈపీఎఫ్‌ఓ నిబంధనలు వర్తించాలి. దేశ జనాభాలో 20శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. వారందరికీ సామాజిక భద్రత కల్పించడానికి రూ.1.37 లక్షల కోట్లు కావాలని 2019-20లో లెక్కవేశారు. ఈ మొత్తం భారత జీడీపీలో 0.69శాతమే. అందులో సగం- అంటే దాదాపు 0.35శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం కష్టమేమీ కాదు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సామాజిక సంక్షేమం, భద్రతపై ఏటా రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతకు పూనిక వహించాలి.


పెరగనున్న వృద్ధ జనాభా

భారత్‌లో వృద్ధుల జనాభా 2050కల్లా రెండింతలు అవుతుందని ఐక్యరాజ్య సమితి జనాభా వ్యవహారాల సంస్థ అంచనా వేసింది. 2022లో దాదాపు 15 కోట్లు ఉన్న వృద్ధుల జనాభా అప్పటికి 34.7 కోట్లకు చేరుతుంది. ఇప్పటికే ఇండియాలో 91శాతం కార్మికులకు సామాజిక భద్రత లేదు. ఇక భవిష్యత్తులో పెరిగిపోనున్న వృద్ధ జనాభాను ఆదుకోవడమెలా అన్నది కీలక ప్రశ్న. వృద్ధుల ఆర్థిక, ఆరోగ్య అవసరాలను తీర్చడానికి పకడ్బందీ పథకాలను ఇప్పటి నుంచే రూపొందించాలి. లేదంటే సామాజిక సంక్షోభం తలెత్తుతుంది. ఆర్థిక అంతరాలు లేని వికసిత భారతాన్ని 2047కల్లా సృష్టించాలనేది పగటి కలగా మిగిలిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.