కొత్త పథకాల ఏరువాక?

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రైతులకు ఇందులో ఎలాంటి వరాలు కురిపిస్తారోనన్న చర్చ సాగుతోంది.

Updated : 27 Jan 2024 12:51 IST

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రైతులకు ఇందులో ఎలాంటి వరాలు కురిపిస్తారోనన్న చర్చ సాగుతోంది.

రైతులకు ఏటా కనీస ఆదాయ కల్పనకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిని 2019నాటి తాత్కాలిక బడ్జెట్లోనే ప్రకటించారు. అయినా, ఆ పథకాన్ని రెండు నెలల ముందుగానే- 2018 డిసెంబరు నుంచి అమలులోకి తెచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే పెద్ద సంఖ్యలో రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధులు అందించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందూ రైతుల కోసం అలాంటి విశేష పథకం ఏదైనా రాబోయే బడ్జెట్లో ప్రవేశపెడతారా అన్నది కీలక ప్రశ్న. కొత్త బడ్జెట్లో వ్యవసాయ రంగం కోసం చేయదగిన ప్రతిపాదనలను అంచనా వేయడం సందర్భోచితంగా ఉంటుంది. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం చాలా ముఖ్యం. సాగు నీటి సౌకర్యం, వ్యవసాయ సామగ్రి కొనుగోలు వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రాయితీపై అన్నదాతలకు నేరుగా రుణాలివ్వాలి. తాత్కాలిక అవసరాలపై కాకుండా దీర్ఘకాల ప్రయోజనాలపై కేంద్రం దృష్టి సారించాలి. వ్యవసాయ ప్రగతికి, బఫర్‌ నిల్వల సృష్టికి పంట బీమా సదుపాయం ఎంతగానో తోడ్పడుతుంది. రాబోయే బడ్జెట్లో ఈ సౌకర్యాన్ని బాగా విస్తరించాలి. ముఖ్యంగా, వినూత్న సాగు విధానాలకు బడ్జెట్‌ అండనివ్వాలి. నీటి కొరత అధికంగా ఉండే భారత్‌లో బిందు సేద్యానికి పెద్దయెత్తున ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, సులభ రుణాలను కల్పించాల్సిన అవసరం ఉంది. సేద్య భూమి కొరతను అధిగమించడానికి ఎత్తిపోతల పథకాలు, నిటారు సేద్యం (వర్టికల్‌ ఫార్మింగ్‌) కీలకమవుతాయి. 2024 బడ్జెట్లో ఈ తరహా సాగు విధానాలకు ప్రోత్సాహకాలను ప్రకటించాలి.

పప్పుగింజల కొరత

రసాయన ఎరువుల విచ్చలవిడి వాడకంతో నేల నిస్సారమవుతోంది. దీన్ని నివారించేలా భూసార పరీక్షకు సంచార ప్రయోగశాలల కోసం నిధులు కేటాయించాలి. భారతీయ వ్యవసాయం తక్కువ ధరకు లభించే యూరియాపైనే అధికంగా ఆధారపడుతోంది. ఇది భూసారాన్ని దెబ్బతీస్తోంది. దీన్ని నివారించడానికి పొటాషియం, ఫాస్పేట్‌ ఎరువుల వినియోగాన్ని అవసరం మేరకు పెంచాలి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో వృథాను తొలగించడానికి, శీతల నిల్వ కేంద్రాలు, వ్యవసాయ గిడ్డంగుల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ వసతులను విస్తరించాలి. వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణానికి పన్ను రాయితీలను బడ్జెట్లో పొందుపరచాలి. వ్యవసాయోత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తే దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితి తప్పుతుంది. భారత్‌ ఇప్పటికీ పప్పు గింజలు, వంట నూనెలు, కూరగాయల కోసం దిగుమతులపై ఆధారపడాల్సి రావడం ఏమాత్రం సమర్థనీయం కాదు. 2024-25 మార్కెటింగ్‌ సంవత్సరంలో పప్పు గింజల కొరతను తీర్చడానికి భారత్‌ 10 లక్షల టన్నుల కందిపప్పును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా పప్పుగింజల పంట విస్తీర్ణం తగ్గడమే ఈ కొరతకు కారణం. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో వర్షపాతంలో వచ్చిన మార్పులతో అక్కడ కంది ఉత్పత్తి పడిపోయింది. 2022-23లో దేశంలో 34 లక్షల టన్నుల కందిపప్పు మాత్రమే ఉత్పత్తి అయింది. అంతకుముందు సంవత్సరంలో అది 42 లక్షల టన్నులు. 19శాతం తరుగుదల ఏర్పడింది. ఈ కొరతను భర్తీ చేయడానికి ఆఫ్రికా దేశాల నుంచి కందిపప్పును దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 2018 నుంచే భారత్‌లో కంది ఉత్పత్తి తగ్గిపోతూ వస్తోంది. దేశీయంగా అన్ని రకాల పప్పుగింజల సాగు విస్తీర్ణం సన్నగిల్లుతోంది. 2023 సెప్టెంబరు నాటికి దేశంలో 122.57 లక్షల హెక్టార్లలోనే పప్పు గింజలు సాగయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఈ విస్తీర్ణం 128.49 లక్షల హెక్టార్లు. కందిపప్పు ధరలో తీవ్ర హెచ్చుతగ్గులు మిగతా పప్పుల రేట్లనూ ప్రభావితం చేస్తున్నాయి. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతోంది. భారతీయుల ఆహారంలో పప్పులు కీలకపాత్ర పోషిస్తాయి. పప్పుగింజల కొరత వల్ల ప్రజల పోషకాహారంపై తీవ్ర ప్రభావం ప్రసరిస్తుంది. పప్పులతో పాటు వంట నూనెల కొరతా వేధిస్తోంది. భారత్‌లో నూనెగింజల ఉత్పత్తి, గిరాకీకి మధ్య అంతరం వల్ల ఏటా వెయ్యి కోట్ల డాలర్లను వెచ్చించి వంటనూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీన్ని నివారించి స్వదేశంలో వంటనూనెల ఉత్పత్తిని పెంచే చర్యలను కొత్త బడ్జెట్లో ప్రకటించాలి.

అంకుర సంస్థల విస్తరణ

కేంద్రం గతంలో తెచ్చిన సాగు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ ఉద్యమం చేశారు. దాంతో కేంద్రం వాటిని ఉపసంహరించుకుంది. అంతమాత్రాన వ్యవసాయ సంస్కరణలను మూలన పడేయకూడదు. దళారుల గుప్పిట్లోని మండీలలో మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లలో తమ ఉత్పత్తులను విక్రయించుకునే స్వేచ్ఛను రైతులకు కల్పించాలి. కొత్త బడ్జెట్‌ ఈ అంశంపై స్పష్టతనివ్వాలి. సాగు రంగంలో వ్యవస్థాపకులకు ప్రోత్సాహం, ఆధునిక సాంకేతికతల వినియోగం 2024 బడ్జెట్లోనైనా ప్రధానాంశాలు కావాలి. వ్యవసాయ రంగంలో అంకుర సంస్థల విస్తరణకు ఊతమివ్వాలి. పంటలకు అఖిల భారత స్థాయిలో పలుకుతున్న ధరలు, ప్రభుత్వ విధానాల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఏర్పాట్లు ఉండటమూ మరో కీలకాంశం. ముఖ్యంగా వాతావరణ సమాచారాన్ని అన్నదాతలకు అందిస్తూ సరైన పంటలు సాగు చేసేలా తోడ్పడాలి.


ఆర్‌అండ్‌డీ కీలకం

కొవిడ్‌ మహమ్మారి తరవాత సేంద్రియ (ఆర్గానిక్‌) వ్యవసాయానికి ప్రాచుర్యం పెరిగింది. రాబోయే కేంద్ర బడ్జెట్లో ఈ తరహా సేద్యానికి ప్రోత్సాహకాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. పంటల వైవిధ్యీకరణనూ విస్తరించాలి. జొన్నల వంటి చిరుధాన్యాల సాగును పెద్దయెత్తున పెంచడానికి రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. రాబయే బడ్జెట్లో వ్యవసాయ రంగంలో పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)కి సమధిక నిధులను కేటాయించాలి. చైనా తన జీడీపీలో 0.80శాతాన్ని వ్యవసాయ ఆర్‌అండ్‌డీకి వెచ్చిస్తోంది. భారత్‌ కేవలం 0.35శాతాన్ని ఖర్చుపెడుతోంది. ఇతర ఆసియా దేశాలు సైతం భారత్‌ కన్నా ఎక్కువగా వ్యయం చేస్తున్నాయి. వ్యవసాయ ఆర్‌అండ్‌డీపై వెచ్చించే ప్రతి రూపాయికి పది రూపాయల ప్రతిఫలం చేకూరుతుంది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.