ఎన్నికల ఖర్చు ఇంతలంతలు

కాలానుగుణంగా ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధాన లక్షణం. తమకు మంచి చేస్తుందని నమ్మిన పార్టీకి ఎలెక్షన్లలో ప్రజలు ఓటు వేసి పట్టం కడతారు. పోనుపోను ఇండియాలో ఎన్నికల వ్యయం కట్టుతప్పుతోంది. చాపకింద నీరులా ప్రవహిస్తున్న ప్రలోభాలు ఎన్నికల వ్యయాన్ని ఇంతలంతలు చేస్తున్నాయి.

Published : 01 May 2024 01:09 IST

కాలానుగుణంగా ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధాన లక్షణం. తమకు మంచి చేస్తుందని నమ్మిన పార్టీకి ఎలెక్షన్లలో ప్రజలు ఓటు వేసి పట్టం కడతారు. పోనుపోను ఇండియాలో ఎన్నికల వ్యయం కట్టుతప్పుతోంది. చాపకింద నీరులా ప్రవహిస్తున్న ప్రలోభాలు ఎన్నికల వ్యయాన్ని ఇంతలంతలు చేస్తున్నాయి.

దాదాపు 97 కోట్ల ఓటర్లతో ఇండియాలో సార్వత్రిక ఎన్నికల కుంభమేళా జరుగుతోందిప్పుడు. ఓటర్లంతా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) భారీ కసరత్తే చేస్తోంది. ఈ ఎన్నికల కోసం ఈసీ 55 లక్షల ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వినియోగిస్తోంది. పది లక్షలకు పైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. 1.5 కోట్ల మంది పోలింగ్‌, భద్రతా సిబ్బంది ఎన్నికల క్రతువులో పాలుపంచుకుంటున్నారు. దక్షిణాఫ్రికా (2.7 కోట్ల ఓటర్లు), మెక్సికో (9.8 కోట్లు), రష్యా (11.4 కోట్లు), బంగ్లాదేశ్‌ (11.9 కోట్లు), పాకిస్థాన్‌ (12.8 కోట్లు), అమెరికా (16.8 కోట్లు), ఇండొనేసియా(20.4 కోట్ల ఓటర్లు)లలోనూ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇండియాతో పోలిస్తే వాటిలో ఓటర్లు చాలా తక్కువ. భూరి సంఖ్యలో ఓటర్లు ఉన్న ఇండియాలో ఎన్నికల వ్యయం పోనుపోను కట్టుతప్పుతోంది.

ఓటర్ల అవగాహన, ఎన్నికల నిర్వహణకు ఈసీ వెచ్చించే ధనం, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, పలు సంస్థల వ్యయాలు తదితరాలన్నీ ఎన్నికల ఖర్చులో అంతర్భాగం. దేశీయంగా 1951-52లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలకు అయిన వ్యయం రూ.10.45 కోట్లు. 2014లో 16వ సార్వత్రిక ఎన్నికల నాటికి అది రూ.3,800 కోట్లకు మించిపోయింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఖర్చు రూ.55వేల కోట్లకు చేరింది. ఈసారి ఎన్నికల వ్యయం లక్ష కోట్ల రూపాయలు దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక ఎన్నికల ఖర్చు ఇదే!

జమిలితో ఉపయోగమెంత?

అర్హులైన ఓటర్లు, ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల సంఖ్య పెరగడం... పార్టీలు, ఈసీ సరికొత్త ప్రచార వ్యూహాలను అనుసరించడం, సామాజిక మాధ్యమాల్లో ప్రచార వ్యయం పెరగడం తదితరాల వల్ల ఎన్నికల ఖర్చు ఇతోధికమైంది. భారత్‌లో ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయి. జమిలి ఎన్నికల ద్వారా ఎలెక్షన్ల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చునని ఏకకాల ఎన్నికలపై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ ఇటీవల అభిప్రాయపడింది. అయితే, జమిలి ఎన్నికల విషయంలో పలు సవాళ్లు ఉన్నాయి. ఒకవేళ ఏకకాల ఎన్నికలు నిర్వహించినా, అయిదేళ్లలోపే ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఎలెక్షన్‌ జరపాల్సి వస్తుంది. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, అధికారులు, సాయుధ దళాల వినియోగం, ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌ యాంత్రాల (ఈవీఎంల) సేకరణ, ఓటర్ల వేలిమీద రాసే సిరా, ఓటరు అవగాహన కార్యక్రమాలు తదితరాలకు ఎన్నికల సంఘం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఈవీఎంల కొనుగోలుకు రూ.1,900 కోట్లు కేటాయించారు. రాజకీయ పార్టీల ప్రచారం, పోలింగ్‌ను ఈసీ వీడియోలు తీయిస్తుంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు సాయుధ దళాలను పెద్దయెత్తున మోహరిస్తున్నారు. వీటన్నింటి కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో 401 స్థానాలకు 53 పార్టీల నుంచి 1,874 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అప్పట్లో ఈసీ 1.96 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో 543 లోక్‌సభ స్థానాలకు 673 పార్టీల నుంచి ఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ ఎన్నికల కోసం పది లక్షలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 2024 వచ్చేసరికి దేశీయంగా రాజకీయ పార్టీల సంఖ్య దాదాపు 2,500కు పెరిగింది. పోటీ చేసే పార్టీలు, అభ్యర్థుల సంఖ్య పెరిగేకొద్దీ ఎన్నికల వ్యయం అధికమవుతోంది.

వేగంగా కొలిక్కి వచ్చేలా...

ఎన్నికల సమయంలో విచ్చలవిడి ధన ప్రవాహం వల్ల ఎలెక్షన్ల నిష్పాక్షికతపై ప్రభావం పడుతోంది. నగదు, మద్యం, ఇతర తాయిలాలతో పార్టీలు ఓటర్లకు ప్రలోభాల ఎరలు వేస్తుండటం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎలెక్షన్లు జరిగేందుకు ఎనిమిదేళ్ల క్రితం ఈసీ పలు సంస్కరణలు ప్రతిపాదించింది. వాటి ప్రకారం- అధికార పక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని నివారించాలంటే వాటి పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి ప్రకటనలు ఇవ్వడాన్ని ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే నిషేధించాలి. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలకూ ఎన్నికల వ్యయంపై పరిమితులు విధించాలి. వెల్లడించని విరాళాలు, కార్పొరేట్‌ నిధుల ద్వారా పార్టీలు ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఉండాలంటే ఆర్థిక విషయాల్లో అవి పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికలకు సంబంధించిన కేసుల విచారణను సత్వరం ఒక కొలిక్కి తెచ్చేందుకు హైకోర్టుల్లో అదనపు న్యాయమూర్తులను నియమించాలి. ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ (1998), న్యాయ సంఘం (1999) సిఫార్సు చేసినట్లు ఎన్నికల వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరించాలి. తద్వారా ప్రైవేటు విరాళాలపై పార్టీలు ఆధారపడటాన్ని తగ్గించాలి. ఏది ఏమైనా, ఎన్నికల్లో ఓటర్లపై పోనుపోను పెచ్చుమీరుతున్న పార్టీల ప్రలోభాలు ప్రజాస్వామ్యానికి వేరు పురుగులా పరిణమించాయి. ఈ దుర్విధానాలను ఎన్నికల సంఘం సమర్థంగా అడ్డుకోవాలి.


పరిమితికి మించి...

మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.25 వేల వరకే ఖర్చు చేయడానికి అనుమతించారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి పది వేల రూపాయలు మాత్రమే. 1971లో వ్యయ పరిమితిని దాదాపు అన్ని రాష్ట్రాల్లో రూ.35 వేలకు పెరిగింది. ఆర్థిక సంస్కరణల తరవాత 1996లో ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4.5 లక్షలకు చేరింది. 1998లో దీన్ని రూ.15 లక్షలకు పెంచారు. 2004లో రూ.25 లక్షలకు తీసుకెళ్ళారు. 2014లో లోక్‌సభ అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితిని రూ.70 లక్షలుగా నిర్ణయించారు. ఈసారి అది పెద్దరాష్ట్రాల్లో రూ.95 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ.75 లక్షలకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి గరిష్ఠ వ్యయాన్ని రూ.40 లక్షలుగా నిర్ణయించారు. అభ్యర్థుల వ్యయంపై పరిమితి ఉన్నా, పార్టీలకు అలాంటి కట్టుబాట్లు ఏమీ విధించలేదు. నిర్దేశిత పరిమితి కన్నా అభ్యర్థులు ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారన్నది బహిరంగ రహస్యమే. దీనివల్లే ఎన్నికల వ్యయం కట్టుతప్పుతోంది. 2019లో ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.