నెత్తిన నిప్పుల కుంపటి

భారత్‌ కొద్దిరోజులుగా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. వాతావరణ మార్పులకు ఎల్‌ నినో ప్రభావం తోడవడమే అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భానుడి భగభగలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌- జూన్‌...

Updated : 06 May 2024 04:21 IST

భారత్‌ కొద్దిరోజులుగా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. వాతావరణ మార్పులకు ఎల్‌ నినో ప్రభావం తోడవడమే అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భానుడి భగభగలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌- జూన్‌ మధ్యకాలంలో వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ)- ముందుగానే హెచ్చరికలు జారీచేసింది. సాధారణంగా ఈ మూడు నెలల కాలంలో వడగాడ్పులు రెండు నుంచి నాలుగు రోజులపాటు ఉంటాయి. ఈసారి అవి 10-20 రోజులపాటు కొనసాగవచ్చని ఐఎండీ అంచనా  వేసింది. శరవేగంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులకు ఎల్‌ నినో పరిస్థితులు తోడవడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి, వడగాడ్పులు వీస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 1901 అనంతరం అత్యధిక ఉష్ణోగ్రతలు 2016లో నమోదయ్యాయి. ఆ తరవాతి అత్యధిక ఉష్ణ సంవత్సరంగా 2023 నమోదైంది. అయితే, ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గతేడాది కన్నా ఎక్కువగా ఉంటాయంటూ ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే అంచనా వేసింది.

అధిక ధరల ముప్పు

ఏప్రిల్‌ మొదటివారంలో విడుదలైన ‘హీట్‌ మ్యాప్‌’ ప్రకారం, ప్రపంచంలోని మిగతా దేశాలకంటే భారత్‌లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎడారి దేశాలైన సౌదీ అరేబియా, ఒమన్‌, సూడాన్‌, ఆఫ్రికాల కంటే ఇండియాలోనే భానుడి తాపం అధికంగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈసారి వేసవి ఎండలు దంచి కొడతాయని ఐఎండీ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో వడగాడ్పులు (హీట్‌ వేవ్స్‌) ఎక్కువ రోజుల పాటు కొనసాగవచ్చని కేంద్రంతోపాటు ఆయా రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఉష్ణోగ్రతలు వరసగా రెండు రోజులపాటు మైదాన ప్రాంతంలో 40డిగ్రీలు, కొండ ప్రాంతాల్లో 30డిగ్రీలు, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు దాటితే వడగాడ్పులుగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. అదే 47డిగ్రీల కన్నా అధికంగా ఉంటే తీవ్రమైన వేడి తరంగాలుగా పేర్కొంటూ హెచ్చరికలు జారీ చేస్తారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. వేసవిలో వడగాడ్పులు భారత్‌లో సర్వసాధారణం. అయినప్పటికీ, 20వ శతాబ్దంలో ఇవి ఎక్కువయ్యాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గడచిన వందేళ్లలో భారత్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 0.66 డిగ్రీల మేర పెరిగాయి. దేశ చరిత్రలో 12 అత్యంత వేడి సంవత్సరాలు 2006 తరవాతే నమోదయ్యాయి. భూవిజ్ఞాన శాఖ 2023లో వెల్లడించిన వివరాల ప్రకారం, 1961-2021 మధ్యకాలంలో వాతావరణ మార్పుల కారణంగా దేశంలో వేడి తరంగాలు సగటున 2.5 రోజులు పెరిగాయి. అడవుల నరికివేత, కాలుష్యం, కర్బన ఉద్గారాలు ఇలాగే పెచ్చుమీరితే- 2050 నాటికి దేశంలో మనిషి మనుగడ సాగించలేని పరిస్థితులు తలెత్తుతాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటల దిగుబడి తగ్గుతుంది. దాంతో నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగిపోతాయి. దాంతో పేదవాడి బతుకు దుర్భరంగా మారుతుంది. జలవనరుల్లో నీరు తగ్గిపోయి తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల అసంఘటిత రంగం కుంటువడుతుంది. ఫలితంగా పది శాతం వరకు ఉత్పత్తి తగ్గిపోతుంది. ‘వాతావరణ పారదర్శకత- 2021’ నివేదిక ప్రకారం దేశంలో అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా వ్యవసాయ, తయారీ, నిర్మాణ, సేవా రంగాల్లో సుమారు రూ.13,25,000 కోట్లకు పైగా (159 బిలియన్‌ డాలర్ల) నష్టం వాటిల్లింది. దేశ జీడీపీలో అది 5.4శాతం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 19శాతం వరకు నష్టపోతుందని ‘నేచర్‌ జర్నల్‌’ ప్రచురించిన అధ్యయనం విశ్లేషించింది. ఆ నష్టం భారత ఆర్థిక వ్యవస్థలో 22శాతంగా ఉంటుందని హెచ్చరించింది. వేడి తరంగాల వల్ల దేశంలో ఏటా అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. 2023లో వడగాడ్పుల కారణంగా 14 రాష్ట్రాల్లో మొత్తం 264 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లోక్‌సభలో వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు వడదెబ్బ, గుండెపోటు, మూత్రపిండ వ్యాధులు, మధుమేహ తీవ్రతకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

భూతాపాన్ని తగ్గించుకుంటేనే...

ఎల్‌ నినో, లా నినా పరిస్థితులను నియంత్రించడం సాధ్యం కాదు. కానీ, కట్టుదిట్టమైన చర్యల ద్వారా భూతాపాన్ని తగ్గించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలికి పునరుత్పాదక ఇంధనాల వైపు వేగంగా మళ్ళడం ద్వారా పరిస్థితిలో కొంత మార్పు తీసుకురావచ్చు. వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేసే ఏసీలు, వాహనాల వాడకాన్ని తగ్గించాలి. నగరాలు, పట్టణాల్లో పర్యావరణ అనుకూల నిర్మాణాలు చేపట్టాలి.

ప్రభుత్వాలతోపాటు ప్రజలు సైతం విస్తారంగా మొక్కలను పెంచాలి. ఒక అధ్యయనం ప్రకారం, మామిడి చెట్టు ఏభై ఏళ్ల జీవితకాలంలో 81 టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని 271 టన్నుల ప్రాణవాయువును విడుదల చేస్తుంది. అలాగే అయిదు ఏసీలు వెయ్యి గంటల పాటు పనిచేయడం ద్వారా వచ్చే చల్లదనాన్ని ఏపుగా పెరిగిన ఓ మామిడి చెట్టు ఇస్తుంది. ఇటువంటి విషయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించి పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలి. అప్పుడే భూతాపాన్ని తగ్గించి, ప్రకృతి విపత్తులను నివారించగలం.


వర్షపాతంపై ప్రభావం

భూమధ్య రేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్ర జలాలు వేడెక్కినప్పుడు ‘ఎల్‌ నినో’ సంభవిస్తుంది. ఇది మూడేళ్లు లేదా అయిదేళ్లకు ఒకసారి పునరావృతమవుతుంది. 2023లో మొదలైన ఎల్‌ నినో పరిస్థితులు ప్రపంచాన్ని వేడెక్కించాయి. భారత్‌లో సరిగ్గా రుతుపవనాల సమయంలోనే ఎల్‌ నినో రావడంవల్ల వర్షపాతం ఆరు శాతం తెగ్గోసుకుపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి తరవాత పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, దేశంలో జూన్‌ నాటికి ఎల్‌ నినో ముగిసిపోయి లా నినా ప్రారంభమవుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ, అప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల వల్ల తీవ్రస్థాయి నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.