Published : 20 May 2022 00:25 IST

మానవాళి మరువలేని నేస్తం

నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవం

సృష్టిలోని ప్రాణికోటిలో కీటక జాతి ఒకటి. ఎంటమాలజిస్టు(కీటక శాస్త్రవేత్త)ల విశ్లేషణ ప్రకారం మనిషికి, ప్రకృతికి మేలు చేసే కీటకాల్లో తేనెటీగలు ప్రధానమైనవి. క్రమశిక్షణ, స్వీయ రక్షణ వ్యూహం, సంతానాభివృద్ధి-పోషణ, శ్రమ విభజన, ఐకమత్యం లాంటి అనేక అంశాల్లో తేనెటీగలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మధురమైన తేనెను అందించడమే కాకుండా, మానవులకు ఆహార భద్రతను కల్పించడంలో తేనెటీగల పాత్ర ఎనలేనిది. వాటి ద్వారానే పరపరాగ సంపర్కం జరుగుతుంది. ఒక్కొక్క తేనెటీగ రోజూ కొన్ని వందల పుష్పాలపై వాలి మకరందాన్ని సేకరిస్తుంది. ఆ సమయంలో వాటి శరీరానికి ఉన్న సన్నని వెంట్రుకలకు పుప్పొడి అంటుకొని పరపరాగ సంపర్కం సాధ్యమవుతుంది. తద్వారా పువ్వులు ఫలాలుగా మారడంలో తేనెటీగలు తోడ్పడుతుంటాయి. పంటల ఉత్పత్తికి సహకరిస్తుంటాయి. తేనెను ఉత్పత్తి చేయడం కంటే ఈ విధంగా తేనెటీగలు మానవులకు, ప్రకృతికి చేసే మేలు పది రెట్లు ఎక్కువని వాటిపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విభిన్న రకాల పూలపై వాలే క్రమంలో సంకర జాతి వంగడాల సృష్టికి, కొన్ని రకాల తెగుళ్ల నివారణకు సైతం తేనెటీగలు సాయపడుతున్నాయి. 70శాతం పరపరాగ సంపర్కానికి తేనెటీగలే కారణం. తేనె ద్వారా ఆదాయాన్ని ఆర్జించడంతోపాటు, పంటల ఉత్పత్తికి తోడ్పడుతున్నందువల్ల తేనెటీగల పెంపకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖర్చు తక్కువ, బహుళ ప్రయోజనకారి కావడంతో ప్రపంచంలోని చాలా దేశాలు తేనెటీగల పెంపకాన్ని అనుబంధ, కుటీర పరిశ్రమగా ప్రోత్సహిస్తున్నాయి.

తేనెటీగలను ప్రధానంగా తేనె, మైనం కోసం పెంచుతారు. తేనె మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానికి సహజ ఔషధ గుణాలు ఉన్నాయి. కొన్ని ఔషధాలతో తేనెను కలిపినప్పుడు వాటి గుణాలు ఇనుమడించి, త్వరగా స్వస్థత చేకూరే అవకాశం కలుగుతుంది. అందువల్లనే ఆయుర్వేదంలో ఎక్కువగా తేనెను వాడతారు. తేనె మంచి యాంటీసెప్టిక్‌. చర్మరోగాల నివారణలో దాన్ని ఉపయోగిస్తున్నారు. చాక్లెట్లు, జామ్‌లు, కేకుల తయారీలో, ఇతర ఆహార ఉత్పత్తుల్లోనూ తేనెను వాడతారు. తేనె పట్టునుంచి తీసిన మైనాన్ని కొవ్వొత్తులు, పాలిష్‌లు, రంగులు, రసాయనాల తయారీలో వినియోగిస్తారు. తేనె, దాని అనుబంధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ ఉంది. ఏ దేశ వాతావరణానికి తగిన తేనెటీగ జాతులు ఆ ప్రాంతంలో పెరుగుతాయి. అందువల్ల సహజమైన తేనెటీగల రక్షణతోపాటు, కృత్రిమంగా వాటి పెంపకానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. పొద్దుతిరుగుడు, నువ్వులు, అవిసెలు వంటి వాణిజ్య పంటలు, మల్లె గులాబీ లాంటి పూల సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. కీటకాలను ఆకర్షించే కొన్ని వృక్షజాతులు, అటవీ పూల మొక్కలు అధికంగా ఉన్నచోట్లా వాటి పెంపకాన్ని చేపడుతున్నారు.

తేనెటీగలవల్ల ఎన్నో లాభాలు ఉన్నందువల్లనే ఐన్‌స్టీన్‌ వాటి గొప్పతనాన్ని కొనియాడారు. భూగోళం నుంచి తేనెటీగలు అంతర్థానమైతే పుడమిపై మానవులు నాలుగేళ్లకు మించి మనలేరని ఆయన ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. మానవాళితోపాటు సమస్త ప్రకృతికి ఎంతో మేలుచేసే తేనెటీగలకు ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వాతావరణ మార్పులు, పంటపొలాల్లో కీటక నాశనుల వినియోగం పెరగడం వల్ల తేనెటీగల మనుగడ ప్రమాదంలో పడింది. అడవులు తరిగిపోతుండటం, ఒకే రకమైన పంటలసాగు వంటివీ వాటి ఉనికికి ముప్పుతెస్తున్నాయి. మానవ చర్యల కారణంగా గత ముప్ఫై ఏళ్లలో 25శాతం తేనెటీగలు అంతరించిపోయినట్లు పరిశోధనలు చాటుతున్నాయి. భవిష్యత్తులో మానవాళికి ఆహార కొరత రాకుండా ఉండాలంటే తేనెటీగలను కాపాడుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచిస్తోంది. స్లొవేనియాకు చెందిన ఆంటోన్‌ జంసా తేనెటీగల పెంపకంపై విశిష్ట పరిశోధనలు చేశారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఏటా మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. తేనెటీగల దినోత్సవం నిర్వహణకోసం స్లొవేనియా మూడేళ్లపాటు ఐక్యరాజ్య సమితిలో కృషి చేసింది. చివరికి 2017లో ఐరాస సభ్యదేశాలు ఏకగ్రీవంగా అంగీకారం తెలపడంతో తేనెటీగల దినోత్సవం ఉనికిలోకి వచ్చింది. తేనెటీగల పెంపకం, వాటి ప్రాధాన్యం, పరిరక్షణ, వాటిద్వారా తయారయ్యే ఉత్పత్తులపై ఈ దినోత్సవాన అవగాహన కల్పిస్తారు.

- రమాశ్రీనివాస్‌

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని