Updated : 14 Aug 2022 06:49 IST

‘అమృత’ భారతంలోనూ అంటరానితనమా?

దళితులు ముట్టుకుంటే మువ్వన్నెల జెండా మైలపడుతుందా? అలా అనుకునే అనాగరికులు ఇంకా ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే- స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సమయంలో యావద్దేశం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఏడున్నర దశాబ్దాల క్రితం భారతావనికి రాజకీయ స్వేచ్ఛ లభించిందే కానీ, అణగారిన వర్గాలకు సామాజిక స్వాతంత్య్రం నేటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. సాంఘిక విప్లవాల పురిటిగడ్డగా, అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన తమిళనాడులో జరిగిన ఒక అధ్యయనం- కుల రక్కసి కర్కశత్వానికి సాక్షీభూతంగా నిలుస్తోంది.

తమిళనాడులోని 24 జిల్లాల్లో దళితులు సర్పంచులుగా ఉన్న 386 గ్రామాల్లో స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒకటి తాజాగా సర్వే చేసింది. పంచాయతీ కార్యాలయాల్లో ఆయా పల్లెల ప్రథమ పౌరులు అనుభవిస్తున్న దారుణ అవమానాలను అది వెలుగులోకి తెచ్చింది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు దళిత సర్పంచులను అనుమతించకపోవడం, కార్యాలయాల్లో వారిని కుర్చీల్లో కూర్చోనివ్వకపోవడం, అధికారిక దస్త్రాలను అప్పగించకపోవడం, ఎస్సీ ప్రజాప్రతినిధులు అధ్యక్షత వహిస్తే ఏకంగా గ్రామసభలను బహిష్కరించడం, దళితేతర వర్గాలకు చెందిన ఉప సర్పంచుల నేతృత్వంలో పాలనను నడిపించడం వంటి మొత్తం 17 రకాల దుర్విచక్షణలు అక్కడ బహిరంగంగా అమలవుతున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల మౌలిక లక్ష్యాన్ని నీరుగార్చడమే కాదు- అంతరాలకు అతీతంగా దేశ ప్రజలందరూ సమానులేనంటున్న రాజ్యాంగ సూత్రాలను అవి ఘోరంగా అపహసిస్తున్నాయి.

ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ రూపమే కాదు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అభివర్ణించినట్లు... సాటి మనిషిని గౌరవిస్తూ, అందరితో మర్యాదపూర్వకంగా మెలగడంతోనే జనతంత్రం వికసిస్తుంది. పేరుకు ప్రజాస్వామ్య దేశమైనా- కుల తెగులు తలకెక్కిన జనం ఎక్కువగా పోగుపడ్డ ఇండియాలో ఆ సామాజిక చైతన్యం ఎండమావినే తలపిస్తోంది. పౌరులందరికీ సమన్యాయం ఒనగూడేలా బాధ్యత వహించాల్సిన సర్కారీయంత్రాంగమే అంటరానితనానికి వంతపాడుతోంది. తమిళనాడులోని కల్లాకురిచ్చి జిల్లా ఎడుత్తవైనాథమ్‌ పంచాయతీ అధ్యక్షురాలు సుధా వరదరాజన్‌కు ఎదురైన పరిస్థితుల్లో ఆ అవ్యవస్థ కళ్లకుకడుతుంది. పంద్రాగస్టు నాడు ప్రభుత్వ పాఠశాలలో సర్పంచి జెండా వందనం చేయడం అక్కడి ఆనవాయితీ. కానీ, సుధ దళితురాలు. ఆ సామాజిక వర్గం నుంచి ఎడుత్తవైనాథమ్‌ సర్పంచిగా ఎన్నికైన తొలి వ్యక్తి. దాంతో ఆమె జెండా ఎగరేస్తే ఒప్పుకొనేది లేదని గ్రామ పెత్తందారులు కొద్దిరోజుల క్రితం భీష్మించారు. తన కార్యాలయంలో ‘శాంతి చర్చలు’ ఏర్పాటుచేసిన స్థానిక తహశీల్దార్‌-పాఠశాల హెడ్మాస్టర్‌తో పతాకావిష్కరణ జరిపించడానికి నిర్ణయించారు. ‘కుల కొట్లాటలు లేకుండా కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకే అలా చేస్తున్నా’మని ఆయన సెలవిచ్చారు. కులోన్మాదుల అడుగులకు మడగులొత్తుతూ అస్పృశ్యతను నెత్తిన పెట్టుకోవడమేనా శాంతిని నిలబెట్టడమంటే? దళిత మహిళ చేతుల మీదుగా జాతీయ పతాకం నింగికెగిస్తే గొడవలు రేగుతాయంటే- ఇక దేశంలో స్వాతంత్య్రం ఎవరికి దఖలుపడినట్లు?

దళిత సర్పంచులపై కులోన్మత్తుల ఆగడాలపై పత్రికల్లో కథనాలు వెల్లువెత్తడంతో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరై అన్బు స్పందించారు. కులపరమైన దుర్విచక్షణ పాటించకుండా పంచాయతీ అధ్యక్షులందరితో పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహింపజేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వాటికోసం పోలీసు బలగాలను నియోగించాలని సూచించారాయన. ఆనాడు తెల్లదొరల పాలనలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన భారతీయులు చావుదెబ్బలు తిన్నారు. అదే జెండాను అంతే దేశభక్తితో ఆవిష్కరించాలని అనుకుంటున్న గ్రామీణ దళిత ప్రజాప్రతినిధులపై నేడు స్వజాతీయులే కన్నెర్ర చేస్తున్నారు. స్వాతంత్య్రోద్యమ సమరసేనానులు స్వప్నించిన స్వేచ్ఛాభారతం ఇదేనా? అధిక సంఖ్యాకులు నమ్ముతున్నందువల్ల ఒక తప్పుడు భావన సరైనది అయిపోదు. కిందివారి మూలగలను పీల్చేసే నిచ్చెనమెట్ల కులవ్యవస్థకూ అదే వర్తిస్తుంది. కలుపు తీయనివాడికి   కసువే మిగులుతుంది. సర్వ మానవ సౌభ్రాతృత్వానికి దేశీయంగా చేటుగా పరిణమించిన అమానుష కుల కట్టుబాట్లకు ఇకనైనా చరమగీతం పలకకపోతే- భారతావని పరువు అంతర్జాతీయంగా పలుచనైపోతూనే ఉంటుంది!

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాడే అంటరానితనం అధికారికంగా రద్దయ్యింది. కానీ, ‘అసుంట... అసుంట’ అంటూ దళితులను అవతలికి నెట్టే బూజుపట్టిన భావన మాత్రం మనుషుల మెదళ్లలోంచి ఇంకా తొలగిపోలేదు. దేశీయంగా ఆ జాడ్యం ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. ‘మా గ్రామానికి ప్రధాన్‌నైనా పంచాయతీ సమావేశాల్లో నాకు ఇప్పటికీ విడిగా ఉంచే గ్లాసులోనే టీ పోస్తారు’ అని గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లా జివాపుర్‌ సర్పంచి దయాభాయ్‌ దఫ్డా ఇటీవలే కన్నీళ్ల పర్యంతమయ్యారు. కారాగారాల నుంచి ఆసుపత్రుల వరకు ప్రతి చోటా కుల దుర్విచక్షణ రాజ్యమేలుతున్నట్లుగా తరచూ కథనాలు వెలువడుతున్నాయి. సర్వోన్నత న్యాయస్థానమే గతంలో స్పష్టీకరించినట్లు- ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలులో అధికారగణం వైఫల్యం కారణంగానే అణగారిన వర్గాల కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2018-2020 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా దళితులపై 1.39 లక్షల నేరాలు చోటుచేసుకున్నాయి. 2018లో 42,793గా ఉన్న వాటి సంఖ్య రెండేళ్లు తిరిగేసరికి యాభై వేలకు పైబడింది. ఈ పాపాల చిట్టాలో మొదటిది యూపీది అయితే- బిహార్‌, రాజస్థాన్‌, ఎంపీ దాన్ని అనుసరిస్తున్నాయి. 2019, 2020ల్లో ఆసేతుహిమాచలం 6856 మంది దళిత స్త్రీలు అత్యాచారాలకు గురయ్యారు. అంటే- రోజుకు సగటున తొమ్మిది మందికి పైగా మృగాళ్ల కాటుకు బలవుతున్నారు. మీసాలు పెంచుకున్నారని, పెళ్ళి ఊరేగింపులో గుర్రం ఎక్కారని, ప్రేమ వివాహాలు చేసుకున్నారని చెప్పి రాష్ట్రాలకు అతీతంగా దళిత యువకులను హింసిస్తున్నారు. అన్యాయంగా ప్రాణాలు తోడేస్తున్నారు. జరుగుతున్న నేరాలూ ఘోరాల్లో అన్నీ అధికారిక గణాంకాలకు ఎక్కడంలేదు. నమోదవుతున్న కేసుల్లో శిక్షలూ పెద్దగా పడటం లేదు. ఏపీలో దళితులపై అత్యాచారాలను నియంత్రించాలని, దోషులకు కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కేంద్ర మంత్రి రామదాస్‌ అథవాలే గత నెలలో సూచించడం- పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక హక్కులు అనుభవంలోకి రావాలంటే- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భగవతి హితవు పలికినట్లు వ్యవస్థను శాసనకర్తలు పునర్‌ నిర్మించాలి. అంటరానితనాన్ని అంతం చేయడం, సమ్మిళిత ప్రగతిపై కులవ్యవస్థ దుష్ప్రభావాలను కూకటివేళ్లతో పెకలించడంపై 1947లో జాతినిర్మాతలు ఎన్నో కలలు కన్నారు. అవి 2047లోనైనా నెరవేరతాయా? ఆ ఉదాత్త ఆశయంతో పాలకులు ఇప్పటికైనా సమగ్ర కార్యాచరణకు నడుంకడతారా?

- శైలేష్‌ నిమ్మగడ్డ

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని