సవ్యంగా సాగని రబ్బరు సాగు

గతంలో రైతులకు పాడి ఆవులా నిలిచిన రబ్బరు సాగు... ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏటికేడు ధరల పతనం కర్షకులను కుంగదీస్తోంది.

Updated : 31 Jan 2023 06:00 IST

గతంలో రైతులకు పాడి ఆవులా నిలిచిన రబ్బరు సాగు... ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏటికేడు ధరల పతనం కర్షకులను కుంగదీస్తోంది. దాంతో కేరళలోని ఎక్కువ మంది పంటకాలం పూర్తయిన తోటలను తొలగించి కొత్త మొక్కలను నాటడం లేదు. మరోవైపు దేశీయ డిమాండుకు సరిపడా సహజ రబ్బరు ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతులు అనివార్యం అవుతున్నాయి.

చైనా, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, మలేసియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, వియత్నాం, కంబోడియా, భారత్‌ వంటి దేశాలు రబ్బరు ఉత్పత్తికి ప్రసిద్ధిచెందాయి. ఒకప్పుడు కేరళ రైతులకు రబ్బరు సాగు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కానీ, కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. రబ్బరు పాల ధరలు పడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు తోటలకు కొత్తరకం చీడపీడలు సోకి పురుగు మందుల ఖర్చు పెరిగింది. వాతావరణ మార్పులకు తోడు కూలీల ఖర్చు, ఎరువుల ధరలు అధికం కావడం వంటి పరిణామాలు రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరోవైపు కేంద్రప్రభుత్వం రబ్బరు చట్టాన్ని, రబ్బరు బోర్డును రద్దు చేయనుందనే వార్తలు చిన్న, సన్నకారు రైతుల్లో ఆందోళన పెంచాయి. ఫలితంగా 60-70 శాతం రబ్బరు రైతుల కుటుంబాలు ఉద్యోగాలు తదితర ప్రత్యామ్నాయాలవైపు చూడటం మొదలుపెట్టాయి. చాలామంది రైతులు పొలాలను కొంతమేర అమ్మేశారు. ఉన్నవాటిలో తోటలను తిరిగి నాటేందుకు మొగ్గు చూపడంలేదు. కొందరైతే కుటుంబాలతోపాటు ఇతర దేశాలకు వలసపోయారు.

రైతులకు ఎదురవుతున్న సమస్యలకు తోడు రబ్బరు బోర్డు ద్వారా కర్షకులకు అందే పలు పథకాలు రద్దయ్యాయి. తమ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఈశాన్య రాష్ట్రాల్లో రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు బోర్డు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు కేరళ రైతుల నుంచి వస్తున్నాయి. రబ్బరు చట్టం-1947ను కొనసాగించాలని కోరుతున్నారు. ‘రబ్బరు (ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు-2022’ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రంగాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్యగా సహజ రబ్బరుపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న      20 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని రబ్బరు రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. దీన్ని ‘మేకిన్‌ ఇండియా’ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రబ్బరు సాగుదారులకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేలా ఓ పథకాన్ని ప్రకటించాలని విన్నవిస్తున్నారు. కేరళలో దాదాపు 60 శాతం తోటలను తిరిగి నాటాల్సి ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి తీవ్రతరమవుతుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తిరిగి నాటే ప్రక్రియకు రాయితీలు పెంచాలని కోరుతున్నారు.

మన దేశంలో రబ్బరు పాల ధర తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి అధికంగా దిగుమతి చేసుకోవడం మన రైతులకు ప్రతిబంధకంగా మారుతోంది. చైనాలో ఉత్పత్తి పెరగడం, కొవిడ్‌ వ్యాప్తి, అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు రబ్బరు ధరల పతనానికి దారితీశాయి. మాంద్యం భయాలు వాహన కంపెనీలను సైతం వెంటాడుతున్నాయి. దీనివల్ల కొంతమేరకు డిమాండు తగ్గవచ్చన్న అంచనాలున్నాయి. 2030 నాటికి భారత్‌లో సహజ రబ్బరుకు భారీగా గిరాకీ పెరుగుతుందని బోర్డు అంచనా వేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహన టైర్ల తయారీదారుల సంఘం- ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో రానున్న అయిదేళ్లలో కొత్తగా లక్షల హెక్టార్లలో రబ్బరు సాగుచేసే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ లక్ష్యం నెరవేరితే సహజ రబ్బరు ఉత్పత్తిలో ఈశాన్య రాష్ట్రాల వాటా పెరుగుతుందని అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో పండించే రబ్బరు మంచి నాణ్యత కలిగి ఉంటుందనే పేరుంది. ప్రస్తుతం దేశంలోని సుమారు పదహారుదాకా రాష్ట్రాల్లో రబ్బరు సాగవుతున్నా, ప్రధాన రాష్ట్రంగా కేరళే నిలుస్తోంది. ఆ తరవాత త్రిపురలో అత్యధికంగా సాగవుతోంది. సహజ రబ్బరును కొన్ని వేల వస్తువుల తయారీలో వాడతారు. దేశీయంగా జరిగే ఉత్పత్తిలో అధికభాగాన్ని వాహనాల టైర్ల రంగంలోనే వినియోగిస్తున్నారు. రబ్బరు సాగు వల్ల రైతులకు దీర్ఘకాలం పాటు స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ధరలు పతనమైనప్పుడు అన్నదాతలను ప్రభుత్వాలు ఆదుకోవాలి. దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే దేశంలో సాగు విస్తీర్ణాన్ని శరవేగంగా పెంచాలి. రైతులు గిట్టుబాటు ధర పొందేలా చర్యలు తీసుకోవాలి. ఈ రంగంలో ఎగుమతులకు సైతం అపార అవకాశాలు ఉన్నాయి.

డి.సతీష్‌బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.