రివర్స్‌ గేర్‌!

‘పాపం... ఆ సీఎం సారు ఎంతలా బిక్కచచ్చిపోయారో... అవమానంతో ఎంతలా కుమిలిపోయారో!’‘ఏంట్రా నీ గోల... ఏమంటున్నావు అసలు’‘అదే అన్నా... ఎండాకాలం అని... భారీ టెంట్లు, కుర్చీలు వేసి, బస్సుల్లో జనాన్ని తరలించి, సకల వసతులతో పెద్ద సభను ఏర్పాటుచేస్తే... గోడకు కొట్టిన బంతిలాగా- వెళ్ళిన వాళ్లు మేము ఉండలేము బాబోయ్‌ అని వెంటనే ఇంటిబాట పట్టారు.

Published : 31 May 2023 00:37 IST

‘పాపం... ఆ సీఎం సారు ఎంతలా బిక్కచచ్చిపోయారో... అవమానంతో ఎంతలా కుమిలిపోయారో!’

‘ఏంట్రా నీ గోల... ఏమంటున్నావు అసలు’

‘అదే అన్నా... ఎండాకాలం అని... భారీ టెంట్లు, కుర్చీలు వేసి, బస్సుల్లో జనాన్ని తరలించి, సకల వసతులతో పెద్ద సభను ఏర్పాటుచేస్తే... గోడకు కొట్టిన బంతిలాగా- వెళ్ళిన వాళ్లు మేము ఉండలేము బాబోయ్‌ అని వెంటనే ఇంటిబాట పట్టారు. పైగా... ఈ పాడిన పాటలే మళ్ళీ మళ్ళీ మేము వినలేము అని గొణుక్కుంటూ, నీ పాపం పండెను చూడు అని శాపనార్థాలు పెట్టుకుంటూ సభ నుంచి బయటపడ్డారు’

‘కొందరు మాట్లాడితే చెవుల్లో తేనె పోసినట్లు హాయిగా ఉంటుంది. మరికొందరు ప్రసంగిస్తుంటే జోరీగలు జుయ్‌ అంటున్నట్లు తెగ చిరాకు పుడుతుంది. నువ్వు చెప్పే సభ తీరూ అలాగే ఉందేమో!’

‘అయినా, స్వయానా సీఎం ‘మీకోసమే నేనున్నది... మీ క్షేమమే నా పెన్నిధి’ అని గొంతు చించుకొంటుంటే, పట్టించుకోకుండా ప్రజలు ఇంటి బాట పట్టడం అంటే ఆయనకు ఎంత నామర్దా’

‘సరేలేవయ్యా... జనాల బాగుకోసమని ఆయనగారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ తెగ బటన్లు నొక్కేస్తున్నారు. మళ్ళీ ఆ ఇచ్చిన డబ్బును రాబట్టుకోవడానికి అడ్డదిడ్డంగా పన్నులు వాయిస్తున్నారు. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇది వారికి అవమానం కాదా? సభ నుంచి అర్ధాంతరంగా బయటికి వచ్చేసి తమ ఆక్రోశాన్ని అలా ప్రదర్శించి ఉంటారు’

‘అంతే అంటావా? ఒక్కసారి కాదు... ప్రతి సభలోనూ ఇలాగే జరుగుతోంది. దాన్ని చూసైనా ఆ సీఎం గారు తన విధానాలు మార్చుకోవాలి కదా’

‘ఆయనగారికి అంత వివేకమే ఉంటే, రాష్ట్రంలో రోడ్లు అంత అధ్వానంగా ఎందుకు ఉంటాయిరా? అయినా, ఆయనగారు బటన్లు నొక్కి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు. గోతుల రోడ్లలో ఒళ్లు, బళ్లు గుల్ల అయ్యి ప్రజలు వచ్చిన సొమ్మును ఖర్చుచేసేస్తున్నారు. ఇంతకన్నా వింత ఉంటుందా? భలే అభివృద్ధి కదూ! అన్నట్టూ, జనాలు అలా వెళ్ళిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాలే?’

‘అవును అన్నా! ప్రజలు సభ నుంచి బయటికి వెళ్ళిపోకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. జనం వాటిని తోసుకొని బయటపడ్డారు. అయినా, అంత ఇబ్బంది పడే బదులు ఆ సభకు వెళ్ళకుండా జనాలు ఇంట్లోనే ఉండి, ఆ సీఎం వాక్కులేవో ఆయనగారి అండతో ఎదిగిన అవినీతి మీడియాలో వినవచ్చు కదా?’

‘ఓరి వెర్రిబాగులవాడా... దాని వెనక పెద్ద తంతే జరిగి ఉంటుంది. సభకు జన సమీకరణ చేసిన నాయకులకే ఈసారి టికెట్లు ఇస్తామని చెప్పి ఉండవచ్చు. పైగా, బతిమిలాడినంత మాత్రాన ప్రజలు సభకు రారు కదా! అందుకని మీటింగుకు రాకపోతే ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తామని అభాగ్య జనాన్ని భయపెట్టి ఉండవచ్చు. ఎంత భయపడి వెళ్ళినా, సభలో పెద్దసారు చెప్పేవాటికి, బయట జరిగే వాటికి పెద్దగా పొంతన కుదరదని తెలియదా? అందుకే, అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు జారుకోవాలా అని జనం చూస్తారు’

‘భయపెట్టి ప్రజలను సభలకు తీసుకెళ్ళడం ఎంత అన్యాయం అన్నా’

‘పిచ్చివాడా... సైకో నేతల పాలనలో అన్యాయమే బోర విరుచుకొని వికృత నృత్యం చేస్తోందిరా. అందుకే కదా, ప్రజలు దేవుడో... జీవుడో అని మొత్తుకుంటున్నారు!’

‘ఇలా ఎంతకాలమన్నా?’

‘వచ్చే ఎన్నికల్లో వాళ్ల పాపం పండేంత వరకు!’

‘కానీ, దోచుకున్న ధన మదంతో రాబోయే ఎలెక్షన్లలో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి మళ్ళీ ప్రజల్ని మభ్యపెడతారేమో అని భయంగా ఉందన్నా’

‘వెర్రివాడా... వేల రూపాయలు ఇస్తామని అన్నంత మాత్రాన ఎవరూ కోరి కొరివితో తల గోక్కోరురా! ఒకసారి నమ్మి ఓటేసి నరకం చూశాక, మళ్ళీ మరో ఛాన్స్‌ ఇవ్వడానికి జనం ఏమన్నా వివేకశూన్యులా? ప్రజాస్వామ్య జయకేతనాలు వాళ్లేరా. నా అంత మొనగాడు లేడు అని విర్రవీగి అడ్డగోలు పరిపాలనతో పీడించుకు తిన్న ఎంతోమందిని జనాలు ఇంటికి పరిమితం చేశారు. మౌలిక వసతుల కల్పనను, అసలైన సంక్షేమాన్ని గాలికొదిలేసి బటన్ల నొక్కుళ్లతో భ్రమింపజేస్తూ, దొంగచాటు పన్ను పీకుళ్లతో ఏడిపించే ప్రభుత్వాలకు కచ్చితంగా భంగపాటు తప్పదు. అవసరమైతే అలాంటి నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని, తమ సంక్షేమానికి పాటుపడే మరో పార్టీకే ప్రజలు ఓట్లేస్తారు’

‘నువ్వన్నదే నిజం కావాలి అన్నా. రివర్స్‌ గేర్‌లో పాతాళంలోకి జారిపోతున్న అభివృద్ధి రథం, అలా అయితేనే మళ్ళీ టాప్‌ గేర్‌ అందుకొని ముందుకు సాగుతుంది’

 అక్కు మణికాంత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.