మౌలికంగా మందగమనం

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చాలా దేశాలతో పోలిస్తే భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఊపు కొనసాగాలంటే మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేసుకోవాలి. కానీ... జీడీపీని పరుగులు పెట్టించడానికి, జనాభా అవసరాలకు తగిన స్థాయిలో మౌలిక వసతులు విస్తరించడం లేదు.

Updated : 21 Jan 2024 14:39 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చాలా దేశాలతో పోలిస్తే భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఊపు కొనసాగాలంటే మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేసుకోవాలి. కానీ... జీడీపీని పరుగులు పెట్టించడానికి, జనాభా అవసరాలకు తగిన స్థాయిలో మౌలిక వసతులు విస్తరించడం లేదు.

ఏ దేశ ఆర్థిక ప్రగతికైనా మౌలిక వసతులే పునాది. ప్రజల జీవన ప్రమాణాలను అవి ఎంతగానో మెరుగుపరుస్తాయి. సరకుల ఉత్పత్తితోపాటు మౌలిక వసతులపై వ్యయం పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది. మౌలిక వసతుల కల్పనకు ఒక రూపాయి వెచ్చిస్తే, స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి రెండున్నర నుంచి మూడున్నర రూపాయల మేర లబ్ధి కలుగుతుందని రిజర్వు బ్యాంకు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ సంస్థలు లెక్కగట్టాయి. అందుకే భారత ప్రభుత్వం మౌలిక వసతుల ఆధునికీకరణ, విస్తరణలకు అమిత ప్రాధాన్యమిస్తోంది. సరకుల రవాణా, బట్వాడాలను ఇతోధికంగా మెరుగుపరచడానికి పూనుకొంది. పెట్టుబడులు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు (పీపీపీ), ప్రోత్సాహకర పన్ను విధానాలు సైతం మౌలిక వసతుల కల్పనను ముందుకు తీసుకెళ్తాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదం చేసే సంస్థలను సాఫ్ట్‌ మౌలిక వసతులుగా పరిగణిస్తారు. రహదారులు, రేవులు, విద్యుత్‌ కేంద్రాలు, టెలీకమ్యూనికేషన్లను హార్డ్‌ మౌలిక వసతులుగా వర్గీకరించారు.

సమర్థ విధానాలతో...

భవిష్యత్తులో దశాబ్దాల పర్యంతం సమాజ అవసరాలను తీర్చగలిగే విధంగా అధునాతన పద్ధతుల్లో మౌలిక వసతులను నిర్మించాలి. కృత్రిమ మేధ(ఏఐ)తో మిళితమైన సమాచార సాంకేతిక సేవలు రేపటి మౌలిక వసతుల్లో కీలక అంతర్భాగమవుతాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఆధునిక మౌలిక వసతులకు ఆవశ్యకమవుతుంది. 61శాతం కంపెనీలు తమ వ్యాపారాభివృద్ధికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కీలకమవుతుందని భావిస్తున్నాయి. భారత్‌ను విజ్ఞానాధారిత సమాజంగా రూపాంతరం చెందించడానికి కేంద్రం 2015 జులైలో చేపట్టిన ‘డిజిటల్‌ ఇండియా’ ఇంకా సరైన ఫలితాలను అందించలేదనే చెప్పాలి. 2023-24 కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు జీడీపీలో 3.3శాతం ప్రత్యేకించడం డిజిటల్‌ ఇండియా పథకాన్ని వేగవంతం చేసి ఆశించిన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ కాల్‌’ పేరిట దేశాభివృద్ధిని వేగవంతం చేయాలని కేంద్రం లక్షిస్తోంది. అది సాకారం కావాలంటే జాతీయ రవాణా వ్యూహాన్ని పకడ్బందీగా అమలుపరచాలి. ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను ఆధునికీకరించి, కొత్త వసతుల నిర్మాణాన్ని చేపట్టాలి. నూతన సాంకేతికతలపై పెట్టుబడులు పెట్టాలి. వాటిని మరింతగా పెంచాలి. వీటి విషయంలో సమర్థ విధానాలను అవలంబించాలి.

కేంద్రం 2024-30 మధ్య హరిత మౌలిక వసతుల సృష్టికి రూ.36.6లక్షల కోట్లను వెచ్చించాలని తలపెట్టింది. పట్టణాల్లో ప్రయాణికులు, సరకు రవాణా సదుపాయాలను విస్తృతం చేయాల్సిన అవసరముంది. నివాస, వాణిజ్య వసతులను విస్తరించడానికి భూముల ధరలను క్రమబద్ధీకరించాలి. ఇండియాలో 2023లో మౌలిక వసతుల మార్కెట్‌ పరిమాణం సుమారు రూ.212 లక్షల కోట్లని అంచనా. ఇది 2028కల్లా దాదాపు రూ.290 లక్షల కోట్లకు పెరగనుంది. ఇది 6.27శాతం వార్షిక చక్రీయ వృద్ధిరేటుగా లెక్కతేలుతుంది. ఇవాళ రహదారులు, విద్యుత్‌, రేవుల వంటి భౌతిక మౌలిక వసతులతోనే పనికాదు. బ్రాడ్‌బ్యాండ్‌, స్వయంచాలిత మోటారు వాహనాలు, ఇతర స్మార్ట్‌ మౌలిక వసతులనూ కలుపుకొని భౌతిక-డిజిటల్‌ మౌలిక సదుపాయాలను సృష్టిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది.

విద్యుత్‌ వాహనాలు కీలకం

రోడ్ల నిర్మాణాన్ని వేగంగా విస్తరించడానికి కేంద్రం భారత్‌మాల పరియోజన పథకం చేపట్టింది. దీనివల్ల రహదారి నిర్మాణం ఏటా 6.6శాతం చొప్పున వృద్ధి చెందుతుంది. మొత్తం 34,800 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని భారత్‌మాల లక్షిస్తోంది. దీర్ఘకాలంలో దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజల జీవన అవసరాలు తీర్చడానికి ఉపకరించే మౌలిక వసతులను ఎంచుకొని నిర్మించాలి. కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఎదురైన సవాళ్ల వంటివి భవిష్యత్తులో ఎదురైనా తట్టుకొని స్థిరంగా వృద్ధి సాధనకు తోడ్పడేలా మౌలిక వసతులను విస్తరించాలి. డిజిటల్‌ అనుసంధానం, ఆరోగ్య సేవలు ఈ కోవలోకి వస్తాయి. శిలాజ ఇంధనాలు అవసరం లేని ఎలెక్ట్రిక్‌ వాహనాలు (ఈవీలు) ఆధునిక రవాణా రంగంలో కీలకం కానున్నాయి. టాటా మోటార్స్‌, హీరో వంటి కంపెనీలు ఈవీ రంగంలో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ కంపెనీల కృషి వల్ల 2024లో ఈవీ విక్రయాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయంటున్నారు. ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులు కేటాయిస్తేనే దేశీయంగా మౌలిక వసతులు మరింతగా జోరందుకుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.