గుర్తింపు సరే... గిరాకీ మాటేమిటి?

అస్సామ్‌లోని సంప్రదాయ బిహు డోలు వాయిద్యం, వారణాసి వీధుల్లో తయారుచేసే ‘బనారస్‌ తండయ్‌’ వంటకం వంటి 60 అంశాలకు ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించింది. ప్రోత్సాహం, ప్రచారమూ తోడైతే వాటిపై ఆధారపడిన వర్గాలతో పాటు పర్యటక రంగానికీ ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది.

Published : 03 May 2024 01:26 IST

అస్సామ్‌లోని సంప్రదాయ బిహు డోలు వాయిద్యం, వారణాసి వీధుల్లో తయారుచేసే ‘బనారస్‌ తండయ్‌’ వంటకం వంటి 60 అంశాలకు ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించింది. ప్రోత్సాహం, ప్రచారమూ తోడైతే వాటిపై ఆధారపడిన వర్గాలతో పాటు పర్యటక రంగానికీ ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది.

కొన్ని ప్రాంతాలకు చెందిన హస్తకళలు, చేనేత వస్త్రాలు, వస్తువులు, వంటకాలు వంటి వాటికి ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి వాటికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు చెందిన పేటెంట్‌, డిజైన్‌, ట్రేడ్‌మార్క్‌ విభాగం భౌగోళిక గుర్తింపు (జాగ్రఫికల్‌ ఇండికేషన్‌-జీఐ) ఇస్తుంది. డార్జిలింగ్‌ తేయాకు, కర్ణాటకలో తయారయ్యే మైసూర్‌ శాండల్‌ సబ్బు తెలియనివారుండరు. వాటితో పాటు తిరుమల శ్రీవారి లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు వంటి ఆహార వస్తువులు... పోచంపల్లి, వెంకటగిరి, కంచి పట్టు చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు వంటి సుమారు 360 వస్తువులకు ఇప్పటికే భౌగోళిక గుర్తింపు లభించింది.

ప్రచారం కీలకం

ఏదైనా వస్తువు భౌగోళిక గుర్తింపు పొందాలంటే- మొదట దాని ప్రత్యేకతలు, చరిత్ర, ప్రాంతీయంగా ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎటువంటి నైపుణ్యాలు అవసరమనే వివరాలను తెలియజేస్తూ ‘జాగ్రఫిక్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ’కి దరఖాస్తు చేసుకోవాలి. ఉత్తరాది ప్రాంతాలవారు దరఖాస్తు చేయడానికి దిల్లీలో, దక్షిణాది వారి కోసం చెన్నైలో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ‘జీఐ’ లభించినప్పటికీ, తగిన ప్రోత్సాహం కొరవడటంతో చాలా వస్తువులకు అదనంగా ఆర్థిక ప్రయోజనాలేవీ లభించడం లేదు. వరంగల్‌ దరీస్‌కు (తివాచీకి)  కొన్నేళ్ల కిందటే భౌగోళిక గుర్తింపు లభించినప్పటికీ, వాటికి తగినంత గిరాకీ ఉండటంలేదు. దాంతో వాటిపై ఆధారపడిన చేనేత కుటుంబాలు దరీస్‌ తయారీని విడిచిపెట్టి ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూస్తున్నాయి. జీఐ దక్కిన వస్తువులకు డిమాండ్‌ పెంచేలా రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ కనబరచడం ఎంతో అవసరం.

భౌగోళిక గుర్తింపు దక్కిన వస్తువుల చిత్రాలను ప్రయాణ ప్రాంగణాలు, పర్యటక సమాచార కేంద్రాలు, మార్కెట్లు తదితర చోట్ల ప్రదర్శించాలి. వాటి ప్రత్యేకతల గురించి తెలియజెప్పాలి. తద్వారా వాటికి గిరాకీ పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పోలిస్తే మిగతా రాష్ట్రాలే ఎక్కువగా తమ వస్తువులకు భౌగోళిక గుర్తింపు సాధిస్తున్నాయి. మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో జీఐ పొందిన వస్తువులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వస్తువులు చాలానే ఉన్నప్పటికీ, వాటికి భౌగోళిక గుర్తింపు తీసుకువచ్చేందుకు సరైన ప్రయత్నాలు జరగడంలేదు.

బిరియానీకి నిరాశ!

భౌగోళిక గుర్తింపు సాధించేలా చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని, అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందిస్తామని కేంద్ర జౌళిశాఖ ఇటీవల వెల్లడించింది. నాబార్డు సైతం సరికొత్త అధ్యయనం చేపడుతోంది. భౌగోళిక గుర్తింపు లభించిన వస్తువులకు ఎంత మేర ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నది క్షుణ్నంగా పరిశీలిస్తోంది. గతంలో నాబార్డు నిధులు అందించిన 144 వస్తువులకు జీఐ దక్కడం విశేషం. ఉమ్మడి ఏపీలో జీఐ గుర్తింపు పొందిన తొలి నాబార్డు ప్రాయోజిత వస్తువుగా పోచంపల్లి ఇక్కత్‌ పేరు గాంచింది. చారిత్రక నేపథ్యాన్ని వివరించడంలో విఫలమైనందుకు హైదరాబాద్‌ బిరియానీకి ఈ గుర్తింపు దక్కలేదు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో రకాల వంటకాలు, హస్తకళలు, వస్తువులకు ప్రత్యేకతలు ఉన్నాయి. వాటికి భౌగోళిక గుర్తింపు సాధించడమే కాకుండా, విస్తృతస్థాయిలో ప్రాచుర్యం కల్పించాలి. ఆయా వస్తువులపై ఆధారపడిన వారికి ఆర్థికంగా, మార్కెటింగ్‌ పరంగా తోడ్పాటు అందించాలి. అప్పుడే భౌగోళిక గుర్తింపువల్ల పూర్తిస్థాయిలో ప్రయోజనాలు ఒనగూడతాయి.

గుండు పాండురంగశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.