మొగ్గల్ని చిదిమేస్తున్న ఒత్తిడి

విజ్ఞానం, వ్యక్తిత్వమనే జంట దీపాల వెలుగులో పిల్లలను సానపట్టి, స్వీయ సామర్థ్యాల మేరకు సమాజాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడం విద్య పరమార్థం. అయితే, దేశీయంగా ఏమి జరుగుతోంది? బూజుపట్టిన బట్టీవిధానం, మార్కులు, ర్యాంకుల పరుగు పందెంలో చదువు అంటేనే ఒత్తిడికి పర్యాయపదంగా మారింది.

Published : 05 May 2024 00:29 IST

విజ్ఞానం, వ్యక్తిత్వమనే జంట దీపాల వెలుగులో పిల్లలను సానపట్టి, స్వీయ సామర్థ్యాల మేరకు సమాజాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడం విద్య పరమార్థం. అయితే, దేశీయంగా ఏమి జరుగుతోంది? బూజుపట్టిన బట్టీవిధానం, మార్కులు, ర్యాంకుల పరుగు పందెంలో చదువు అంటేనే ఒత్తిడికి పర్యాయపదంగా మారింది. దాన్ని తట్టుకోలేక ఎన్నో విద్యాకుసుమాలు అర్ధాంతరంగా రాలిపోతున్నాయి. దానివల్ల కుటుంబాల్లో ఆరని ఆవేదనా కుంపట్లు రాజుకుంటున్నాయి. తీవ్ర పోటీ ఉండే నీట్‌, జేఈఈ తదితర పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు రాజస్థాన్‌ రాష్ట్రంలోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ విద్యార్థుల శిక్షణ కోసం తల్లిదండ్రులు భారీగా ఫీజులు చెల్లిస్తున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురై కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలోనే ఎనిమిది మంది ఇలా ప్రాణాలు తీసుకున్నారు. నిరుడు ఏకంగా 30 మంది బలయ్యారు.

ఆసక్తి లేని కోర్సులను బలవంతంగా ఎంపిక చేసుకోవాల్సి రావడం, తల్లిదండ్రుల అంచనాల భారం, భవిష్యత్తుపై భయం తదితరాలు విద్యార్థులను బలవన్మరణాలకు పురిగొల్పుతున్నాయి. దేశీయంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలన్నింటిలో కలిపి దాదాపు యాభై వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికోసం ఏటా లక్షల మంది పోటీ పడుతున్నారు. రెండు లక్షల లోపు ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ సీట్లకోసం జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) రాస్తున్న వారి సంఖ్య ఇరవై లక్షలకు పైమాటే! ఇంతటి తీవ్ర స్థాయి స్పర్ధలో అలసిపోతున్న విద్యార్థులు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోటాలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒత్తిడిలో ఉన్న విద్యార్థుల కౌన్సిలింగ్‌ కోసం ఏర్పాటు చేసిన హాట్‌లైన్‌ సైతం ఆత్మహత్యలను నిరోధించలేకపోతోంది. విద్యార్థుల హాజరు పర్యవేక్షణ, మూడు నెలలకోసారి పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌, ఆదివారం తప్పనిసరి సెలవు, సోమవారం ఎలాంటి పరీక్షలూ నిర్వహించకూడదని అధికార యంత్రాంగం విధించిన నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎక్కువ మరణాలు ఫ్యాన్‌కు ఉరి వేసుకోవడం వల్ల జరుగుతున్నాయని గుర్తించి విద్యార్థుల వసతి గృహాల్లో స్ప్రింగ్‌ ఫ్యాన్‌లు ఏర్పాటు చేశారు. బహుళ అంతస్తు భవనాల చుట్టూ వలలు కట్టారు. అయితే, పిల్లల్లో ఒత్తిడిని దూరం చేయాలంటే మానసిక వైద్య నిపుణులను ప్రతి శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయాలి. వారిద్వారా విద్యార్థుల్లో మనోధైర్యాన్ని కలిగించాలని నిపుణులు సూచిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల శక్తిసామర్థ్యాలు, అభిరుచులను గుర్తించి ఆ మేరకు కోర్సులను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలి. పిల్లలకు జీవన నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణలతో పాటు సవాళ్లను, వైఫల్యాల్ని ఎదుర్కోవడం నేర్పించాలి. నిజానికి, సమస్య వ్యవస్థలో కాదు, మన దృక్పథంలోనే ఉందని గ్రహించాలి. పిల్లల ప్రయత్నాలను ప్రశంసించి, వారికి సరైన మార్గదర్శనం చేస్తే జీవితంలో మేటిగా రాణించడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఈ దిశగా ఆలోచించాలి.

ఆర్‌.శ్రీనివాసరాజు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.