Published : 09/03/2023 13:02 IST

‘డిజిటల్’ బాటలో అందాల తారలు!

(Photos: Instagram)

‘బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌’ అంటుంటారు. ఇది మన సినీ తారలకు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఓవైపు తమ అందం, అభినయంతో సినీరంగాన్ని ఏలుతూనే.. మరోవైపు వ్యాపార ప్రయాణాన్నీ ప్రారంభించారు కొందరు ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో తమ ఆలోచనలకు సాంకేతికతను జోడించి ఆన్‌లైన్ / డిజిటల్ వ్యాపారంలో రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమన్యాయం, సమానత్వాన్ని కోరుతోన్న (DigitALL) ఈ ఏటి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా.. కొందరు ముద్దుగుమ్మల స్టార్టప్స్/ ఆన్‌లైన్ వ్యాపారాల గురించి తెలుసుకుందాం..!

కృతీ సనన్‌ - ది ట్రైబ్

సవాళ్లతో కూడిన పాత్రలు ఎంచుకోవడంలో ముందుంటుంది బాలీవుడ్‌ అందాల తార కృతీ సనన్‌. గతేడాది విడుదలైన ‘మిమి’ సినిమానే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇందులో అద్దె గర్భం మోసే మహిళ పాత్రలో మెప్పించిన ఆమె.. ఈ క్రమంలో కిలోల కొద్దీ బరువు పెరిగింది. నిజానికి కృతికి ఫిట్‌నెస్ అంటే మక్కువ. ఈ ఇష్టంతోనే ‘ది ట్రైబ్‌’ పేరుతో ఈ మధ్యే ఓ ఫిట్‌నెస్‌ యాప్‌ను ప్రారంభించిందామె.

‘నేను సినీ రంగంలోకొచ్చి 8 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో మిమి చిత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా నాలో ఫిట్‌నెస్‌ పట్ల అంకితభావాన్ని పెంచింది. ఫిట్‌నెస్ ప్రాముఖ్యాన్ని నాకు తెలియజేసింది. అందుకే ఇదే స్ఫూర్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ‘ది ట్రైబ్‌’ యాప్‌ను ప్రారంభించా..’ అంటోన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ వేదికగా స్టూడియో సెషన్స్‌, వర్చువల్‌ సెషన్స్‌, నిపుణులతో డైట్‌ సలహాలు, వ్యక్తిగత లేదా బృంద తరగతులు.. వంటి సదుపాయాలెన్నో కల్పిస్తోంది. ఇలా తన యాప్‌తో ఫిట్‌నెస్‌ పట్ల అందరిలో అవగాహన పెంచుతోందీ బాలీవుడ్‌ అందం.


ఆలియా భట్, Ed-A-Mamma

నటిగా, నిర్మాతగానే కాకుండా.. తన సేవా కార్యక్రమాలతోనూ మెప్పిస్తోన్న బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌.. ప్రస్తుతం వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది. రెండేళ్ల క్రితం ‘Ed-A-Mamma’ పేరుతో ఆన్‌లైన్‌లో పిల్లల క్లాతింగ్‌ లైన్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ వేదికగా పిల్లలకు సంబంధించిన అన్ని రకాల దుస్తులు, గర్భం ధరించిన మహిళల కోసం మెటర్నిటీ వేర్‌ను అందిస్తోంది.‘ఈ వ్యాపారం ప్రారంభిద్దామనుకున్నప్పుడు నా మనసులో ఎన్నో ఆలోచనలు. నా సినిమాలతో ఫ్యాన్స్‌ను మెప్పించినట్లు.. ఫ్యాషన్ లవర్స్‌ని ఆకట్టుకోగలనా అనిపించింది. అయితే నాకున్న ఫాలోయింగ్‌తో కాకుండా విభిన్న దుస్తులతోనే వినియోగదారుల్ని ఆకట్టుకోవాలనుకున్నా. ఈ క్రమంలోనే మార్కెట్లో కాస్త పరిశోధించి, లోతుగా ఆలోచించి ఈ బ్రాండ్‌ను ప్రారంభించా. నా పిల్లి పేరు ఎడ్వర్డ్‌, దానికి నేను అమ్మను.. ఈ రెండూ కలిసేలా దీనికి పేరు పెట్టా..’ అంటూ ఓ సందర్భంలో పంచుకుంది ఆలియా. ఇలా తాను సొంతంగా వ్యాపారం ప్రారంభించడమే కాదు.. ‘ఫూల్‌’, ‘నైకా’, ‘స్టైల్‌ క్రాకర్‌’.. వంటి సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టిందీ బాలీవుడ్‌ బేబ్.


దీపికా పదుకొణె - 82°E

సినిమాల్లో నటనతోనే కాదు.. ఆయా ఈవెంట్లతో తన అందం, ఫ్యాషన్‌ సెన్స్‌తోనూ ఆకట్టుకుంటుంది అందాల తార దీపికా పదుకొణె. సౌందర్యం విషయంలో తాను పాటించే చిట్కాల్ని సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. అందం విషయంలో ఎవరికి వారు పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటోంది. ఇలా చెప్పడమే కాదు.. గతేడాది నవంబర్‌లో ముంబయికి చెందిన జిగర్‌ షాతో కలిసి ‘82°E’ అనే చర్మ సంరక్షణ బ్రాండ్‌కు తెరతీసింది. ప్రయోగశాలలో పరీక్షించిన వీగన్‌ పదార్థాలతో సౌందర్యోత్పత్తుల్ని తయారుచేస్తూ ఈ వేదికగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు.

 ‘రోజువారీ సౌందర్య సంరక్షణను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించామం’టోన్న దీప్స్‌.. సీరమ్‌, క్లెన్సర్‌, మాయిశ్చరైజర్‌, టోనర్‌.. వంటి వివిధ రకాల ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచింది. మరోవైపు.. ‘Epigamia’, ‘Blu Smart’.. వంటి స్టార్టప్స్‌లోనూ పెట్టుబడులు పెట్టిందీ బాలీవుడ్‌ బ్యూటీ.


ట్వింకిల్‌ ఖన్నా, ట్వీక్‌ ఇండియా

నటిగా, రచయిత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ భామ ట్వింకిల్‌ ఖన్నా. ఇంటీరియర్‌ డిజైనర్‌గానూ పేరున్న ఈ ముద్దుగుమ్మ.. ముంబయిలో ‘Gurlein’, ‘Manchanda’.. పేర్లతో రెండు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ స్టోర్లు నడుపుతోంది. మహిళా అంశాలపై ఎక్కువగా స్పందించే ఈ మిసెస్‌ అక్షయ్‌.. అన్ని వర్గాల మహిళల కోసం ‘ట్వీక్‌ ఇండియా’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా సంస్థను ప్రారంభించింది. మహిళలపై వివక్ష, మూసధోరణుల్ని బద్దలుకొట్టడమే లక్ష్యంగా ఈ వేదికను ప్రారంభించానంటోందీ డేరింగ్‌ బ్యూటీ.

‘సామాజిక నిర్ణయాలతో సంబంధం లేకుండా మహిళల కోసం ఓ స్వేచ్ఛా వేదికను ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతోనే ట్వీక్‌ ఇండియాను ప్రారంభించా. అన్ని వర్గాల మహిళలు.. ఇక్కడ తమ సమస్యల్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా పంచుకోవచ్చు. బుల్లీయింగ్‌, లింగ సమానత్వం, ఆరోగ్యం, బాడీ షేమింగ్‌, మానసిక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వంటి అనేక సమస్యలకు నిపుణులు-సెలబ్రిటీల సలహాలు పొందచ్చు..’ అంటూ తన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ గురించి ఓ సందర్భంలో పంచుకుంది ట్వింకిల్.

ఇలా వ్యాపారాలు ప్రారంభించడమే కాదు.. ఇది వరకే ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన ముద్దుగుమ్మలూ కొందరున్నారు. వారిలో సారా అలీ ఖాన్‌ (Souled Store), కత్రినా కైఫ్‌ (Nykaa), ప్రియాంక చోప్రా (Bumble), కాజల్‌ అగర్వాల్‌ (Okie Gaming), మౌనీ రాయ్‌ (Ultimate Gurus), అతియా శెట్టి (Stage3), సమంత (SustainKart).. తదితరులు ఆయా ఆన్‌లైన్ / డిజిటల్ వ్యాపారాల్లో భాగమయ్యారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని