ఏంటీ ఈ ప్రవర్తన?

వయసు 48. ఆర్నెల్లుగా కొత్త హోదాలో పనిచేస్తున్నా. టీమ్‌లో నేనే జూనియర్‌ని. మా టీమ్‌ లీడ్‌కి 35. నాకు స్నేహితుడవ్వడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఎంత వారించినా.. నీ వయసెంత, జీతం, ఇంక్రిమెంట్లు ఎన్నొచ్చాయి ఇలా ఏవేవో అడుగుతాడు.

Published : 28 Dec 2022 01:10 IST

వయసు 48. ఆర్నెల్లుగా కొత్త హోదాలో పనిచేస్తున్నా. టీమ్‌లో నేనే జూనియర్‌ని. మా టీమ్‌ లీడ్‌కి 35. నాకు స్నేహితుడవ్వడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఎంత వారించినా.. నీ వయసెంత, జీతం, ఇంక్రిమెంట్లు ఎన్నొచ్చాయి ఇలా ఏవేవో అడుగుతాడు. బంధువుల పెళ్లని ఆమధ్య కొన్నిరోజులు సెలవు పెట్టా. తిరిగొచ్చాక ‘సోషల్‌ మీడియాలో పెళ్లి ఫొటోలు చూశా. ‘సెక్సీ’గా ఉన్నావ్‌’ అన్నాడు. ఆ పదం విని షాకయ్యా. ఎలా స్పందించాలో తెలియక ఊరుకున్నా. అయినా ఏంటీ ప్రవర్తన? మేనేజర్‌కి రిపోర్టు చేయాలా.. చేస్తే ఏం చెప్పాలో తోయడం లేదు. సలహా ఇవ్వండి?

- విల్మా, బెంగళూరు

మీ లీడ్‌ ప్రవర్తన స్నేహంలా తోయడం లేదు. ప్రశ్నలూ కుతూహలం కొద్దీ అన్నరీతిలో అడుగుతున్నాడు. ‘అడగొద్దు’ అని మీరు చెప్పినా అడుగుతున్నాడంటే.. వేరే రీతిలో ఆపించాలని అర్థం. ముందు మీ మేనేజర్‌ని కలిసి అతని తీరు, కొన్ని ప్రశ్నలు ఎలా ఇబ్బంది పెడుతున్నాయో చెప్పి, దానికి ఎలా సమాధానమివ్వాలని సలహా కోరండి. గట్టిగా సమాధానం చెప్పినా ఫర్లేదు అనడమో, ఆయనే మాట్లాడటమో చేస్తారు. తర్వాత మీమీద కోపం చూపినా, ఇంకా అనుచిత ప్రవర్తన పెరిగినా ఈసారి ‘హెచ్‌ఆర్‌’ దగ్గరికెళ్లండి. వయో వివక్ష, ప్రశ్నల పేరిట వేధించడం వంటివీ ఆయన దృష్టికి తీసుకెళ్లండి. మేనేజర్‌ ఆధ్వర్యంలోనే చేస్తే ఇంకా మంచిది. లేదూ నేరుగా మీ లీడ్‌తోనే మాట్లాడొచ్చు. అయితే మర్యాదగా, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలాగంటే..

* మర్యాదగా సంభోదించండి. ఆ స్థానానికి చేరడానికి ఏదో ఒక గొప్ప లక్షణం ఉంటుంది కదా! దాన్ని ప్రధానాంశంగా ‘మీ బృందంలో పనిచేయడాన్ని మంచి అవకాశంగా భావిస్తున్నా. మీ ‘ఫలానా పనితీరు’ (తన ప్రత్యేకతను తెలిపేది) ఆకట్టుకుంటుంది. అయితే ఒకటి మాత్రం మన మధ్య పని పరమైన సత్సంబంధాలకు ఆటంకం కలిగించేలా ఉంది’ అంటూ సంభాషణ ప్రారంభించాలి.

* ఈసారి వంతు మీ సమస్యది. ‘పనివి కాకుండా ఇతర ప్రశ్నలు అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి నేను ఇష్టపడని విషయం గమనించి ఉంటారు. వాటికి సమాధానమివ్వడం నాకు అసౌకర్యంగా ఉంటుంది. వాటినెందుకు అడుగుతున్నారో అర్థం కాలేదు’.. ఇలా కోపం, బాధ లేకుండా సహజ విషయంగా మాట్లాడాలి.

* ‘పని పరంగా నాతో ఏమైనా సమస్యలున్నాయా? వాటిని పోగొట్టడానికి నేనేం చేయగలను’ అని సమాధానం కోసం చూడండి. అది ఎలాంటిదైనా మీ భావాలు ముఖంపై కనిపించకూడదు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు షాకవ్వడం, కంగారు పడటం సహజమే. అలాగని వాటినలా చూసీచూడనట్లు వదిలేయొద్దు.. ఎదుర్కోవాలి. అదే చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్