తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?

అందాల తారలు ఏ ఫ్యాషన్‌ ధరించినా ట్రెండే! క్యాజువల్‌గానైనా, అకేషనల్‌గానైనా వాళ్లు ధరించే అవుట్‌ఫిట్స్ చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇటీవలే టాలీవుడ్‌ బ్యూటీ కీర్తి సురేశ్‌ కట్టుకున్న ఓ చీర కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Published : 25 Apr 2024 13:12 IST

(Photos: Instagram)

అందాల తారలు ఏ ఫ్యాషన్‌ ధరించినా ట్రెండే! క్యాజువల్‌గానైనా, అకేషనల్‌గానైనా వాళ్లు ధరించే అవుట్‌ఫిట్స్ చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఫిదా అవుతుంటారు.  ఇటీవలే టాలీవుడ్‌ బ్యూటీ కీర్తి సురేశ్‌ కట్టుకున్న ఓ చీర కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రముఖ డిజైనర్‌ తరుణ్‌ తహ్లియానీ రూపొందించిన ఫుల్కారీ చీర అది. ఈ కలర్‌ఫుల్‌ శారీలో కీర్తి మరింత అందంగా కనిపించేసరికి ఫుల్కారీ ఫ్యాషన్‌ గురించి తెగ వెతికేస్తున్నారు ఫ్యాషన్‌ ప్రియులు. అయితే కీర్తే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు ఫుల్కారీ దుస్తుల్లో మెరిసిపోయారు. మరి, ఇంతకీ ఏంటీ ఫుల్కారీ ట్రెండ్‌? సెలబ్రిటీలకు దీనిపై ఎందుకంత క్రేజ్‌? చదివేద్దాం రండి..

మన దేశం విభిన్న కళలకు పుట్టినిల్లు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సంప్రదాయ కళల్ని పాటిస్తుంటారు అక్కడి ప్రజలు. ఫుల్కారీ కళ కూడా అలాంటిదే! నిజానికి ఇదో హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ పద్ధతి. 15వ శతాబ్దంలో పంజాబ్‌లో పుట్టిన ఈ కళను తొలుత అక్కడి గృహిణులు ఖాళీ సమయాల్లో సాధన చేసేవారట! ఈ క్రమంలోనే కాటన్‌ వస్త్రం, సిల్క్‌ దారాలు ఉపయోగించి విభిన్న కళాఖండాల్ని రూపొందించేవారట! వీటిని శుభసూచకంగా భావిస్తూ పెళ్లి, సీమంతం తదితర వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులకు బహుమతులుగా అందించేవారట! ఇలా పంజాబీయులు సంపదకు, సంతోషానికి ప్రతీకగా భావించే ఈ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ కళ.. తొలుత బహుమతుల కోసం మొదలైనా.. ఆపై క్రమంగా దుస్తుల పైకీ విస్తరించింది.

అదే దీని ప్రత్యేకత!

సాధారణంగా ఎంబ్రాయిడరీ అంటే వస్త్రం పైన కనిపించేలా డిజైన్‌ చేస్తారు. కానీ ఫుల్కారీ ఇందుకు భిన్నం. వస్త్రానికి ఉల్టా సైడ్‌ ఎంబ్రాయిడరీ చేస్తే.. దాని పనితనం చీర ముందు భాగంలో కనిపించడం దీని ప్రత్యేకత! దుస్తులపై దారాలతో దూరంగా, దగ్గరగా కుడుతూ చేసే ఈ ఎంబ్రాయిడరీలో భాగంగా ఫ్లోరల్‌, జామెట్రిక్‌ ప్యాటర్న్స్‌తో పాటు పూలు/ఆకులు/పక్షులు/జంతువులు/పండ్లు.. వంటి ఫుల్కారీ మోటీఫ్స్‌ని ఎక్కువగా రూపొందిస్తుంటారు డిజైనర్లు. ఇక తొలుత ఖద్దర్‌, కాటన్‌ వస్త్రాల్ని ఈ ఎంబ్రాయిడరీకి కేన్వాస్‌లుగా వాడేవారు.
ఇలా రంగురంగుల దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఇలాంటి ఫుల్కారీ చీరలోనే మెరిసిపోయింది కీర్తి. తన శారీపై ఈ త్రెడ్‌వర్క్‌తో పాటు సీక్విన్‌, కుందన్‌, జర్దోసీ, ఆరీ.. వంటి వాటితో అదనపు హంగులద్దారు. ఇలా తన చీరకు జతగా మ్యాచింగ్‌ బ్లౌజ్‌ని ఎంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. దీనికి ‘యు’ ఆకృతిలో ఉన్న స్లీవ్స్‌ని జత చేసింది. బ్లౌజ్‌ అంచులకు రంగురంగుల టాజిల్స్‌తో హంగులద్దింది. ఇలా కీర్తి ఫ్యాషన్‌ కోషెంట్‌ని పూర్తిగా పెంచేసిన ఈ చీర ధర రూ. 3 లక్షల దాకా ఉంటుందట!

ఎన్నెన్నో వెరైటీలు!

ఫుల్కారీ ఎంబ్రాయిడరీ అవడానికి ప్రాచీన కళే అయినా.. నానాటికీ కొత్త హంగులద్దుకొని ఫ్యాషన్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ఎంబ్రాయిడరీలో విభిన్న వెరైటీలు మార్కెట్లో కొలువుదీరాయి.

⚛ బాగ్‌ ఫుల్కారీ - పంజాబీలో బాగ్‌ అంటే ఉద్యానవనం అని అర్థం. గార్డెన్‌లో ఎలాగైతే ఖాళీ లేకుండా మొక్కలు, చెట్లు ఉంటాయో.. బాగ్‌ ఫుల్కారీ ఎంబ్రాయిడరీని కూడా వస్త్రంపై ఖాళీ లేకుండా డిజైన్‌ చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే వస్త్రం బ్యాక్‌గ్రౌండ్‌ రంగేదో తెలియనంత హెవీగా ఉంటుందీ ఎంబ్రాయిడరీ.

⚛ చోప్‌ ఫుల్కారీ - పంజాబీలో బోర్డర్‌గా పిలిచే ఈ ఎంబ్రాయిడరీలో భాగంగా.. ఫ్యాబ్రిక్‌ బోర్డర్స్‌పై ఎక్కువగా దృష్టి పెడతారు డిజైనర్లు. దుస్తులకు నలువైపులా బోర్డర్‌పై ఈ ఎంబ్రాయిడరీని డిజైన్‌ చేస్తారు. ఎక్కువగా ఎరుపు, మెరూన్‌ రంగు వస్త్రాలపై పసుపు, గోల్డెన్‌ దారాలతో.. విభిన్న డిజైన్లలో రూపొందించే ఈ ఫుల్కారీ దుస్తుల్ని పంజాబీయులు పెళ్లిళ్లలో ఎక్కువగా ధరిస్తుంటారు. ముఖ్యంగా వధువు తరపు బంధువులు పెళ్లిలో వధువుకు వీటిని కానుకగా ఇస్తారట!

⚛ తిల్‌ పత్ర ఫుల్కారీ - పేరుకు తగ్గట్లే నువ్వుల్లాంటి చిన్న చిన్న డిజైన్లు/మోటీఫ్స్‌ని వస్త్రంపై సమాన దూరాల్లో ఎంబ్రాయిడరీ చేయడం దీని ప్రత్యేకత! తెలుపు/క్రీమ్‌ కలర్‌ ఫ్యాబ్రిక్‌పై విభిన్న రంగుల్లో చేసే ఈ ఎంబ్రాయిడరీ వస్త్రాల్ని పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల కోసం ఎంచుకుంటారట పంజాబీయులు.

⚛ దర్శన్‌ ద్వార్ ఫుల్కారీ - పౌరాణిక కథలు, సిక్కుల చరిత్ర, వారి మత గ్రంథానికి సంబంధించిన గాథల్ని దుస్తులపై ఎంబ్రాయిడరీ చేయడాన్నే ‘దర్శన్‌ ద్వార్‌ ఫుల్కారీ’గా పేర్కొంటారు. ఇలా రూపొందించిన పీసెస్‌ని అక్కడి దేవాలయాలు, గురుద్వారాల్లో వాల్‌హ్యాంగింగ్స్‌గా ఉపయోగిస్తారట!

ట్రెండు మారుతోంది!

మారే కాలాలు, అతివల అభిరుచుల్ని బట్టి ఆయా ఫ్యాషన్లలో మార్పులొచ్చినట్లే.. కాలక్రమేణా ఫుల్కారీ కళలోనూ కొత్త ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. మొదట్లో ఫుల్కారీ ఎంబ్రాయిడరీని కేవలం బహుమతుల కోసమే డిజైన్‌ చేసిన డిజైనర్లు.. క్రమంగా ఈ కళను దుస్తుల పైకీ విస్తరించారు. తొలుత ఖద్దర్‌, కాటన్‌ వస్త్రాలకే పరిమితమైన ఈ కళ.. ప్రస్తుతం సిల్క్‌, జార్జెట్‌, షిఫాన్‌.. ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ పైనా హంగులద్దుకుంటోంది. ఫుల్కారీ చీరలే కాదు.. ఈ ఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేసిన సల్వార్‌ సూట్స్‌, కుర్తీస్‌, లెహెంగాలు, స్కర్ట్స్‌, జాకెట్స్‌, దుపట్టాలు.. ప్రస్తుతం మగువల మనసు దోచుకుంటున్నాయి. హ్యాండ్‌బ్యాగ్స్‌, షూస్‌, బెల్టులు, జ్యుయలరీ పీసెస్‌.. వంటి యాక్సెసరీస్‌కూ ఈ కళ విస్తరించింది. హ్యాండ్‌ ఎంబ్రాయిడరీగానే కాదు.. మెషీన్‌ ఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేసిన ఫుల్కారీ దుస్తులూ మార్కెట్లో ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి అకేషన్‌కైనా అటు సంప్రదాయాన్ని జోడిస్తూనే.. ఇటు స్టైలిష్‌ లుక్‌ని అందిస్తోన్న ఈ ఫుల్కారీ అవుట్‌ఫిట్స్‌ని సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యులూ తమ వార్డ్‌రోబ్‌లో చేర్చుకోవడానికి పోటీపడుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్