అబ్దుల్‌ కలామ్‌లని తీర్చిదిద్దుతున్నారు... అందుకే సారాభాయీ!

ఆమె చెబితే రాకెట్‌ సైన్స్‌ కూడా  అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత తేలిగ్గా అర్థమవుతుంది! పుస్తకంలోని పాఠాలు చెప్పడంతో సరిపెట్టుకోలేదామె. ప్రయోగాలతో విద్యార్థులని అబ్దుల్‌కలాములుగా తీర్చిదిద్దాలనుకున్నారు.

Updated : 09 Mar 2023 07:35 IST

ఆమె చెబితే రాకెట్‌ సైన్స్‌ కూడా  అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత తేలిగ్గా అర్థమవుతుంది! పుస్తకంలోని పాఠాలు చెప్పడంతో సరిపెట్టుకోలేదామె. ప్రయోగాలతో విద్యార్థులని అబ్దుల్‌కలాములుగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆ కృషే పాలకొండకి చెందిన బి.ఉమామహేశ్వరికి ప్రతిష్ఠాత్మక సారాభాయి టీచర్‌ సైంటిస్ట్‌ అవార్డు అందేలా చేసింది...

సైన్స్‌, లెక్కలంటే భయపడే పిల్లలే ఎక్కువగా కనిపిస్తారు కదా! కానీ ఆ స్కూల్‌ పిల్లలు అలా కాదు. వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్‌ సెమినార్లు, ప్రయోగాలు... ఎక్కడైనా వాళ్లే ముందుంటారు. కారణం వాళ్ల సైన్స్‌ టీచరమ్మ ఉమామహేశ్వరే. విజయనగరం జిల్లాలోని రేగిడి జెడ్పీ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలామె. స్వస్థలం శ్రీకాకుళం. 24 ఏళ్ల ఉద్యోగానుభవం. భర్త బి.వి.రమణమూర్తి ఆంగ్ల ఉపాధ్యాయుడు. ఉమామహేశ్వరికి చిన్నతనం నుంచే ఈ వృత్తిపై ఆసక్తి. అందుకే 1998లో ఎస్జీటీగా ఉద్యోగం సాధించారు. మూడున్నర సంవత్సరాల తరువాత డీఎస్సీ రాసి స్కూల్‌ అసిస్టెంట్‌ అయ్యారు. ప్రస్తుతం రేగిడిలో పని చేస్తున్నారు. ఆమె ప్రాణం పెట్టి, పాఠం చెబుతారని అంటారు విద్యార్థులు. ఆమె మార్గదర్శకత్వంలో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు పన్నెండుసార్లు రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయి అంటేనే అర్థమవుతుంది  ఆమె ఎంతగా లీనమై పాఠాలు చెబుతారో! ఆమె చేసిన ప్రయోగాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా, ప్రయోజనకరంగా ఉండటం విశేషం.


పానీపూరీ గిన్నెలు అలా..

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, పానీపూరీ బళ్ల వద్ద థర్మాకోల్‌తో చేసిన కప్పులు, చిన్నచిన్న పాత్రలు వినియోగిస్తుంటారు. వీటితో వ్యర్థాల సమస్య. దీనికి పరిష్కారంగా చిరుధాన్యాలతో చెంచాలు, కప్పులు, చిన్నగిన్నెలు తయారు చేశారు. వినియోగించిన తరువాత పడేయకుండా తినేలా చేసిన ప్రయోగానికి శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన నేషనల్‌ చిల్డ్రన్‌ కాంగ్రెస్‌లో అందరి ప్రశంసలు దక్కాయి.

* చిన్నవయసులో వచ్చే తెల్ల జుట్టు నివారణకు సహజ రంగులతో పేస్టును తయారు చేశారు. ఇది జాతీయ స్థాయి జర్నల్‌లో ప్రచురితమైంది. దీనికి పేటెంట్‌ కోసమూ దరఖాస్తు చేసుకున్నారు.

ఉమామహేశ్వరి పాఠశాల ఎన్జీసీ (నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌) విభాగానికి సమన్వయకర్తగా కూడా పని చేస్తున్నారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. విద్యార్థుల పుట్టిన రోజు, వాళ్ల తల్లిదండ్రుల పెళ్లిరోజు ఇలా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పాఠశాల ఆవరణలో ఒక మొక్క నాటాల్సిందే. దాని సంరక్షణ బాధ్యత వాళ్లదే. జూనియర్‌ రెడ్‌క్రాస్‌ నోడల్‌ అధికారిణిగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ‘ఉమా సైన్స్‌ గురు’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ని ప్రారంభించి.. ఆసక్తికరమైన ప్రయోగాలని అందులో వివరిస్తూ ఉంటారు. అందుకే ఆమెను ‘సైన్స్‌ గురూ’ అని పిల్లలు ప్రేమతో పిలుస్తుంటారు.


కోడిగుడ్డు అట్టలతో...

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు గుడ్లు ఇస్తుంటారు. అట్టతో తయారు చేసిన ట్రేలలో వీటిని సరఫరా చేసి, తరువాత పడేస్తుంటారు. వీటిని వినియోగంలోకి తీసుకురావాలని నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు కావాల్సిన బయోపాట్స్‌గా మార్చారు. ఈ అట్టలని మెంతులతో కలిపి గుజ్జుగా నూరి దాంతో కుండీలను రూపొందించారు. 2020లో విజయనగరంలో నిర్వహించిన ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో ఇది ద్వితీయ బహుమతిని గెలుచుకుంది.


జాతీయ స్థాయిలో...

సారాభాయి పురస్కారానికి జాతీయ స్థాయిలో పోటీ ఉంటుంది.. తోటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ పోటీకి దరఖాస్తు చేశారు. ప్రాథమికోన్నత పాఠశాల విభాగంలో దేశవ్యాప్తంగా అనేక వడపోతల అనంతరం పది మందిని ఎంపిక చేశారు. నాలుగు నిమిషాల సమయంలో పిల్లలు సాధించిన విజయాలను పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా వివరించి జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్