తినేసే టీకప్పులు.. ఆరోగ్యకరంగా..!

ప్లాస్టిక్.. దీనివల్ల పలు అనారోగ్యాలు తలెత్తుతున్నప్పటికీ, దీని వాడకాన్ని పూర్తిగా మానలేకపోతున్నాం. తన భర్త విషయంలోనూ ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొన్నారు విశాఖపట్నానికి చెందిన తమ్మినేని జయలక్ష్మి. ఆయనలా మరెవరూ బాధపడకూడదన్న ఆలోచనతో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ....

Published : 12 Mar 2023 10:33 IST

ప్లాస్టిక్.. దీనివల్ల పలు అనారోగ్యాలు తలెత్తుతున్నప్పటికీ, దీని వాడకాన్ని పూర్తిగా మానలేకపోతున్నాం. తన భర్త విషయంలోనూ ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొన్నారు విశాఖపట్నానికి చెందిన తమ్మినేని జయలక్ష్మి. ఆయనలా మరెవరూ బాధపడకూడదన్న ఆలోచనతో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారామె. ఇదే ఎడిబుల్‌ టీకప్స్‌ వ్యాపారానికి నాంది పలికింది. ఆరోగ్యకరమైన పదార్థాలతో తినే టీకప్పులు తయారుచేస్తూ.. ఓవైపు పేపర్‌ కప్పులకు ప్రత్యామ్నాయం చూపుతూనే.. మరోవైపు పలువురికి ఉపాధినీ కల్పిస్తున్నారామె. ‘కష్టపడుతూనే ఎదగడానికి ఇష్టపడతా’నంటోన్న జయలక్ష్మి తన వ్యాపార ప్రయాణం గురించి ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

నేను పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లా దూసి గ్రామంలో! ఇంటర్మీడియట్‌ చదివేటప్పుడే నాకు పెళ్లైంది. మావారు శ్రీనివాసరావు. వివాహం తర్వాత విశాఖపట్నంలో స్థిరపడ్డాం. చిన్న వయసులో పెళ్లైనా.. నా భర్త ప్రోత్సాహంతో చదువుకున్నా. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు, గీతం యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లిష్‌ పూర్తిచేశాను. ఆపై బీఈడీ చేసి.. ఏడాదిన్నర పాటు స్థానిక ప్రైవేట్‌ స్కూల్లో తెలుగు టీచర్‌గా పనిచేశా.

అది కఠిన సమయం!

సరిగ్గా పదేళ్ల క్రితం మావారికి పొట్ట సంబంధిత వ్యాధి వచ్చింది. ఎలాంటి దురలవాట్లు లేని తనకు ఇలాంటి సమస్యేంటని ఆశ్చర్యపోయాం. శారీరకంగా, మానసికంగా రోజురోజుకీ కుంగదీస్తోన్న ఈ సమస్య మూలాలేంటో తెలుసుకోవడానికి ఎన్నో ఆస్పత్రులు తిరిగాం.. మరెన్నో పరీక్షలు చేయించాం.. అయినా సమస్య అంతుచిక్కలేదు. ఆఖరికి.. బయటి ఫుడ్‌ తినేటప్పుడు ఉపయోగించే పేపర్‌ కప్స్‌/బౌల్స్‌లోని ప్లాస్టిక్‌ అవశేషాలు పొట్టలోకి చేరి గడ్డకట్టుకుపోయాయని, తద్వారా తలెత్తిన ఇన్ఫెక్షనే ఈ వ్యాధికి దారితీసిందని ఓ డాక్టర్‌ చెప్పడంతో అసలు విషయం అర్థమైంది. దాంతో అత్యవసరంగా ఆపరేషన్‌ చేసి ప్లాస్టిక్‌ అవశేషాల్ని తొలగించడంతో గండం గట్టెక్కింది. అయితే సరిగ్గా అది కరోనా సమయం కావడంతో నా ఉద్యోగం పోయింది. మరోవైపు ఆపరేషన్‌తో మావారు ఆరు నెలలు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ పోషణ, ముగ్గురు పిల్లల చదువుకు సంబంధించిన బాధ్యతలు నాపైనే పడ్డాయి. ఈక్రమంలో ఉద్యోగం కంటే.. లాభమో, నష్టమో వ్యాపారమే ప్రారంభించాలనుకున్నా.

‘వ్యాపారం అవసరమా?’ అన్నారు!

అయితే ఓసారి ఇంటర్నెట్‌లో టీలు-వాటిలో ఉన్న రకాల గురించి వెతుకుతున్నా. ఈ క్రమంలోనే బిస్కట్‌ కప్‌ నా కంట పడింది. ఈ కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించింది. ఇంకాస్త లోతుగా వెతికితే.. ఈ వ్యాపారం మన తెలుగు రాష్ట్రాల్లోనూ తక్కువేనన్న విషయం అర్థమైంది. పైగా మార్కెట్లో దొరికే కప్స్‌ మైదాతో తయారవుతున్నాయన్న విషయం తెలుసుకున్నా. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని, దీనికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన పదార్థాలతో ఎడిబుల్‌ టీకప్స్‌ తయారుచేస్తే బాగుంటుందనిపించింది. ఇదే 2020లో ‘టీ బైట్‌ - జస్ట్‌ సిప్‌ అండ్‌ బైట్‌’ వ్యాపారానికి దారితీసింది. అయితే ప్రారంభంలో చాలామంది నా వ్యాపార ఆలోచనను వ్యతిరేకించారు. ‘అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్నావు. ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించడం అవసరమా? ఇందులో నష్టాలొస్తే భరించగలవా?’ అంటూ నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ముందు ప్రయత్నిస్తే కదా.. అందులో రాణించగలనా? లేదా? అన్నది అర్థమవుతుంది. అందుకే ఏదేమైనా భరించడానికి సిద్ధంగా ఉన్నానన్న ధైర్యంతోనే ముందుకు సాగాను.

ఈ పదార్థాలతో..!

మా ఎడిబుల్‌ టీకప్స్‌ తయారీ కోసం రాగి పిండి, బియ్యప్పిండి, కార్న్‌ ఫ్లోర్‌, చక్కెర.. వంటి పదార్థాలు వాడతాం. వీటిని ముద్దగా కలిపి.. అచ్చు యంత్రాలతో కప్స్‌ తయారుచేస్తున్నాం. చాక్లెట్‌, యాలకులు, మామిడి, స్ట్రాబెర్రీ, వెనీలా.. వంటి ఫ్లేవర్స్‌లో తయారయ్యే ఈ కప్పుల్ని.. టీ, కాఫీ, ఐస్‌క్రీమ్‌, మిల్క్‌షేక్స్‌.. ఇలా వేటికైనా ఉపయోగించచ్చు. అలాగే మా కప్పులో ఎంత వేడి పానీయం పోసినా అరగంట పాటు మెత్తబడకుండా ఉంటుంది. ప్రస్తుతం మా వద్ద 80 ఎంఎల్‌ (ధర రూ. 3.50), 60 ఎంఎల్‌ (ధర రూ. 2.50).. పరిమాణాల్లో కప్పులు తయారవుతున్నాయి. వీటిని గాలి తగలకుండా కాటన్‌ బాక్స్‌లో భద్రపరిస్తే సుమారు 8 నెలల పాటు నిల్వ ఉంటాయి. ప్రస్తుతం రోజుకు 3-4 వేల టీకప్స్‌ తయారుచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, చెన్నై, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ముంబయి.. వంటి రాష్ట్రాలతో పాటు అబుదాబి, జర్మనీ.. వంటి దేశాల్లోని రెస్టరంట్ల నుంచీ మాకు ఆర్డర్లొస్తున్నాయి. ఇలా టీకప్పులతో పాటు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి వీటిని తయారుచేసే మెషినరీని కూడా సప్లై చేస్తున్నాం.

విస్తరణ దిశగా..

ఎడిబుల్‌ టీకప్స్‌ తయారీలో ఆరోగ్యకరమైన పదార్థాలు వాడడం, చక్కటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం, అందుబాటు ధరల్లో అందించడం, ఆకర్షణీయమైన-సహజసిద్ధమైన ప్యాకింగ్‌.. ఇలా చాలా విషయాల్లో కస్టమర్లను ఆకట్టుకోగలుగుతున్నాం. ఒకవేళ ఇతర ప్రాంతాలకు పంపిణీ చేసేటప్పుడు కప్పులు డ్యామేజ్‌ అయినా వాటిని రీప్లేస్‌ చేసి.. ఆ ఖర్చునూ మేమే భరిస్తాం. ఇక భవిష్యత్తులో మా వ్యాపార విస్తరణలో భాగంగా.. పండ్ల రసాల కోసం 110 ఎంఎల్‌ పరిమాణంలో ఉండే కప్పుల్ని తీసుకురాబోతున్నాం. అలాగే ఎడిబుల్‌ చాట్‌ బౌల్స్‌ తయారుచేయాలన్న ఆలోచన కూడా ఉంది. మరోవైపు గోధుమపిండి, నెయ్యి.. వంటి పదార్థాలతో కొత్త కప్పుల తయారీకీ శ్రీకారం చుట్టాలనుకుంటున్నాం. బ్యాంకు రుణాలతో పాటు PMFME వంటి పథకాల ద్వారా వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆర్ధిక వనరులు సమకూర్చుకున్నా. స్థానిక కళాశాలలు, సంస్థల నుంచి ‘ఉత్తమ మహిళ’, ‘ఉత్తమ వ్యాపారవేత్త’.. వంటి అవార్డులూ అందుకున్నా.

కష్టపడితేనే ఎదగగలం!

ఆడవాళ్లు వ్యాపారంలో రాణించడం కష్టమనుకుంటారు చాలామంది. కష్టమో, నష్టమో.. ప్రయత్నించి చూస్తే గానీ తెలియదన్నది నేను నమ్మే సిద్ధాంతం. ఏ రంగమైనా కష్టపడితేనే ఎదగగలం. దీనికి తోడు పని పట్ల అంకితభావం, పట్టుదల, స్వీయ నమ్మకం, ఓపిక చాలా ముఖ్యం. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. ఆ పాఠాల్ని అనుభవాలుగా మలచుకోవాలి. మరోవైపు ఇంట్లో వాళ్ల ప్రోత్సాహమూ కావాలి. ప్రస్తుతం నా వ్యాపారంలో నేను సత్ఫలితాలు అందుకోగలుగుతున్నానంటే.. అందుకు మావారు, పిల్లల ప్రోత్సాహమే కారణం! అన్నట్లు.. మరో విషయం.. నేను రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ ప్లేయర్‌ని కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్