ఒత్తిడా.. డ్యాన్స్ చేసేద్దాం!

ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఒత్తిడితో చిత్తవుతున్నారు. దీన్నుంచి విముక్తి పొందడానికి యోగా, ధ్యానం, జిమ్‌లో కసరత్తులు.. మొదలైనవి చేస్తున్నారు. ఈ క్రమంలో- మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని దూరం చేసుకోవడానికి డ్యాన్స్ కూడా ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.

Eenadu icon
By Vasundhara Team Published : 30 Oct 2025 21:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఒత్తిడితో చిత్తవుతున్నారు. దీన్నుంచి విముక్తి పొందడానికి యోగా, ధ్యానం, జిమ్‌లో కసరత్తులు.. మొదలైనవి చేస్తున్నారు. ఈ క్రమంలో- మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని దూరం చేసుకోవడానికి డ్యాన్స్ కూడా ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.

ఒత్తిడితో కలిసి జీవించాల్సిన కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి మన భావోద్వేగాల్ని అదుపులోకి తీసుకోకముందు మనమే అలర్ట్‌ అవ్వాలి. అందుకే మానసిక ప్రశాంతత కోసం చాలామంది యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు, జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. అయితే వీటితో పాటు కాసేపు డ్యాన్స్ చేసినా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు.

ఒత్తిడి ఎలా తగ్గుతుంది?

⚛ డ్యాన్స్‌ చేయాలంటే సంగీతం కావాలి. ఈ మ్యూజిక్‌ శరీరంలో కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్లు) స్థాయుల్ని తగ్గిస్తుంది. ఫలితంగా ఆందోళన తగ్గుతుంది.

⚛ పాట మొదలవగానే మనకు తెలియకుండానే కాళ్లు కదుపుతాం.. శరీరంలోని అన్ని అవయవాలకూ ఊపొస్తుంది. హ్యాపీ హార్మోన్లైన డోపమైన్‌, ఎండార్ఫిన్లు విడుదలవడమే ఇందుకు కారణం. ఇలా డ్యాన్స్‌ చేస్తుంటే మనసు కుదుటపడుతుంది. దీన్నే అలవాటుగా మార్చుకుంటే క్రమంగా ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత సొంతమవుతుందంటున్నారు నిపుణులు.

⚛ నచ్చిన పని చేస్తున్నప్పుడు దానిపైనే పూర్తి ఏకాగ్రత పెడతాం. తద్వారా మన బాధలన్నీ మర్చిపోతాం. ఇదే విధంగా డ్యాన్స్‌ కూడా మానసిక సమస్యల్ని దూరం చేసి ప్రశాంతతను అందిస్తుంది.

⚛ ఒంటరిగా డ్యాన్స్‌ చేయడం ఇష్టం లేని వారు ఇంట్లో భాగస్వామితో కలిసి నృత్యం చేయచ్చు. ఈ క్రమంలో ఒకరి శరీరాన్ని మరొకరు తాకడం వల్ల ఆక్సిటోసిన్‌ అనే లవ్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది మనసుకు సాంత్వన చేకూర్చుతుందంటున్నారు నిపుణులు.

⚛ రోజూ ఒకే రకమైన జిమ్‌ వ్యాయామాలంటే ఎవరికైనా బోరే! అదే డ్యాన్స్‌లో అయితే విభిన్న భంగిమలు ప్రయత్నించచ్చు. దీనివల్ల మరింత సరదా సొంతమవుతుంది. ఇది పరోక్షంగా ఒత్తిడినీ దూరం చేస్తుంది.

⚛ డ్యాన్స్‌ క్లాసుల్లో చేరడం వల్ల మన చుట్టూ ఉన్న వారితో అనుబంధాన్ని పెంచుకోవచ్చు. ఇదీ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.

⚛ కొంతమంది తమకు ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనల్ని తమలోనే దాచుకుంటారు. దానివల్ల మానసికంగా మరింత ఇబ్బంది పడుతుంటారు. అదే భావోద్వేగాల్ని డ్యాన్స్‌ రూపంలో వ్యక్తపరిస్తే మనసు కాస్త కుదుటపడుతుంది.

⚛ మానసిక సమస్యల కారణంగా ఆయా శారీరక కండరాలపై ఒత్తిడి పడుతుంది. అదే డ్యాన్స్‌ వల్ల ఈ కండరాలు కాస్త రిలాక్సవుతాయి.. శరీరంలో శక్తి స్థాయులూ పెరుగుతాయి. పరోక్షంగా ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

⚛ నృత్యం శరీరంలో సెరటోనిన్‌ స్థాయుల్ని పెంచుతుందని, ఫలితంగా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత సొంతమవుతుందని పలు పరిశోధనలూ రుజువు చేశాయి.

అలాగే డ్యాన్స్‌తో శరీర అవయవాలకూ చక్కటి వ్యాయామం అందుతుంది. కాబట్టి ఇటు శరీరానికి దృఢత్వాన్ని అందిస్తూనే.. అటు మానసికంగా ప్రశాంతతను సొంతం చేసుకోవాలంటే ఓ అరగంట పాటు నృత్యం చేయండి. తద్వారా అటు సరదాగా ఎంజాయ్‌ చేయచ్చు.. ఇటు ఒత్తిడినీ దూరం చేసుకోవచ్చు.. అంటున్నారు నిపుణులు. మరింకెందుకాలస్యం? కమాన్.. లెట్స్ డ్యాన్స్..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్