ఇంటి శుభ్రతలో ఇవి ముఖ్యం!

ఇంట్లో పని ఎంత చేసినా ఓ పట్టాన తరగదు. ఇక వృత్తి ఉద్యోగాలు చేసే మహిళలకు రోజువారీ పనులు మినహాయిస్తే ఇంటి శుభ్రత, గృహోపకరణాల్ని శుభ్రం చేయడం.. వంటి అదనపు పనులకు సమయం కేటాయించడం కుదరనే కుదరదు.

Published : 12 Jan 2024 20:45 IST

ఇంట్లో పని ఎంత చేసినా ఓ పట్టాన తరగదు. ఇక వృత్తి ఉద్యోగాలు చేసే మహిళలకు రోజువారీ పనులు మినహాయిస్తే ఇంటి శుభ్రత, గృహోపకరణాల్ని శుభ్రం చేయడం.. వంటి అదనపు పనులకు సమయం కేటాయించడం కుదరనే కుదరదు. దానివల్ల ఇంట్లో దుమ్ము పేరుకుపోతుంది.. గృహోపకరణాల పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా పని మరింతగా పెరుగుతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఇంటి శుభ్రత విషయంలో కొన్ని పొరపాట్లు జరగకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

శుభ్రపరిచేవైనా సరే..!

ప్రస్తుతం ప్రతి ఇంట్లో వాషింగ్‌ మెషీన్లు, డిష్‌వాషర్లు కామనైపోయాయి. అయితే బట్టలు, గిన్నెల్ని శుభ్రం చేసే ఈ గృహోపకరణాల్ని ప్రత్యేకించి శుభ్రం చేయాల్సిన అవసరం లేదనుకుంటారు కొందరు. తద్వారా దుస్తుల మురికి, పదార్థాల అవశేషాలు మెషీన్లలో ఇరుక్కొని దుర్వాసన వెలువడుతుంది.. పైగా ఇవిలాగే ఉంటే బ్యాక్టీరియా, క్రిములు కూడా వాటిలో వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కనీసం నెలకోసారైనా క్లీన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా మెషీన్లను ఎలా శుభ్రం చేయచ్చో సంబంధిత మాన్యువల్‌ చూసి ఫాలో అవ్వాలి.

మురికివే వాడుతున్నారా?

వివిధ రకాల గృహోపకరణాలు, ఇతర వస్తువుల్ని మైక్రోఫైబర్‌ క్లాత్‌ లేదంటే కాటన్‌ క్లాత్‌తో శుభ్రం చేయడం మనకు అలవాటే! అయితే పని పూర్తయ్యే సరికి అవి మురికిగా తయారవుతాయి. వాటిని సాధారణ డిటర్జెంట్‌తో ఉతికి ఆరేసి తిరిగి వాడుకోవడం చాలామంది చేసే పని. అయితే ఇలా పైపైన ఉతకడం వల్ల అవి పూర్తిగా శుభ్రపడవు.. సరికదా.. వాటిపై బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదమూ లేకపోలేదు. అలాగే వాటి నుంచి అదో రకమైన వాసన కూడా వస్తుంటుంది. అందుకే అలాంటి మురికి క్లాత్స్‌/టవల్స్‌ని ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. వేడి నీళ్లలో టేబుల్‌స్పూన్‌ వెనిగర్‌ వేసి ఈ క్లాత్స్‌ని అరగంట పాటు నానబెట్టి.. ఆ తర్వాత ఉతికి ఎండలో ఆరేయాలి. ఇలా ఉతికితే అవి శుభ్రపడడంతో పాటు వాటిపై ఉన్న మరకలు కూడా తొలగిపోతాయి. ఆపై తిరిగి వీటిని ఉపయోగించుకోవచ్చు.

వీటిని కలపొద్దు!

ఇంటిని శుభ్రం చేయడానికి చాలామంది వెనిగర్‌, బేకింగ్‌ సోడా, బ్లీచ్.. వంటివి వాడుతుంటారు. అయితే ఇవి సహజసిద్ధమైనవే అయినప్పటికీ కొన్నింటిని కలిపి వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. వెనిగర్‌, బ్లీచ్‌.. ఈ రెండూ సహజ క్రిమిసంహారిణులు. అయితే వీటిని కలపడం వల్ల వెనిగర్‌లోని ఆమ్లగుణాలు విషపూరితమైన వాయువుల్ని విడుదల చేస్తాయి. తద్వారా కళ్లలో మంట, ఊపిరితిత్తులకు హాని కలిగే ప్రమాదం ఉంది. అలాగే అమ్మోనియా-బ్లీచ్‌, బేకింగ్‌ సోడా-వెనిగర్‌.. వంటివి కలిపినా వాటి స్వభావం మారిపోయి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు.

వాయిదాల పర్వం వద్దు!

సమయం లేకో, బద్ధకించో.. ఓ పని తర్వాత చేద్దాంలే అని అలాగే వదిలేస్తే.. అది తడిసి మోపెడవుతుంది. తద్వారా దాన్ని శుభ్రం చేయాలంటే ఎక్కువ శ్రమ పడాలి.. సమయం కూడా వృథా. అందుకే ఇంటి శుభ్రత విషయంలో వాయిదాల పర్వం వద్దే వద్దంటున్నారు నిపుణులు. ఓ అరగంట అటో, ఇటో.. శుభ్రం చేయాలనుకున్న వస్తువును అప్పటికప్పుడే క్లీన్‌ చేసేసుకోవడం మంచిది. అలాగే అన్ని పనులు ఒకేసారి పెట్టుకున్నా భారమవుతుంది. కాబట్టి ఒక రోజు ఒక వస్తువు శుభ్రం చేస్తే.. మరో రోజు మరో ర్యాక్‌ శుభ్రం చేయండి. పని సులువవుతుంది.

వీటితో పాటు ఇంటి పని సులభంగా పూర్తవ్వాలన్నా, అదనపు భారం పడకుండా ఉండాలన్నా.. మీ వారిని/ఇతర కుటుంబ సభ్యులను/పిల్లల్ని ఆయా పనుల్లో భాగం చేయాలి. వారికీ కొన్ని పనులు అప్పగించాలి. ఫలితంగా ఇల్లూ నీట్‌గా ఉంటుంది.. శ్రమా తగ్గుతుంది.. ఏమంటారు?!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్