Published : 31/03/2023 20:46 IST

తల్లి కాబోతున్నారని.. ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదట!

గర్భం ధరించిన మహిళకు నవ మాసాలు నిండడం ఒక కఠిన పరీక్ష లాంటిది. ఎందుకంటే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలంటే.. తన ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదల కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. పలు వైద్య పరీక్షల ద్వారా బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది చిన్నారుల్లో శారీరక-మానసిక లోపాలు తలెత్తడం, అవకరాలు రావడం.. వంటివి చూస్తుంటాం. నిజానికి ఇలాంటి సమస్యలకు గర్భధారణను త్వరగా గుర్తించకపోవడమూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. ఇదనే కాదు.. తాము గర్భం ధరించామన్న విషయం మహిళలు ఎంత త్వరగా గుర్తిస్తే.. కడుపులో పెరిగే బిడ్డకు అంత ప్రయోజనం చేకూరుతుందంటున్నారు. మరి, తొలినాళ్లలోనే ప్రెగ్నెన్సీని గుర్తించడం వల్ల తల్లీబిడ్డలిద్దరికీ ఎందుకు మంచిదో తెలుసుకుందాం రండి..

నెలసరి ఇలా మిస్సవగానే అలా ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటారు చాలామంది. ఈ క్రమంలో తాము గర్భం ధరించినా కొన్నిసార్లు నెగెటివ్‌ ఫలితమే రావచ్చు. దీంతో పిండం ఎదుగుదలకు సహకరించే సప్లిమెంట్స్‌ వాడడం ఆలస్యం కావచ్చు. దీని ద్వారా కూడా బిడ్డ ఎదుగుదలలో పలు సమస్యలు తలెత్తచ్చు. కాబట్టి తాము గర్భం ధరించామా? లేదా? అన్న విషయం కచ్చితంగా తెలుసుకోవాలంటే నెలసరి మిస్సయ్యాక వారం రోజులకు పరీక్షించుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. లేదంటే నిపుణుల వద్ద కూడా పలు పరీక్షలు చేయించుకోవచ్చు. తద్వారా కచ్చితమైన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు.

ఈ లక్షణాలుంటే..!

సరైన సమయంలోనే గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకున్నా.. తాము ప్రెగ్నెంట్‌ అయినా ఒక్కోసారి కొంతమందిలో నెగెటివ్‌ వస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని లక్షణాల ద్వారా తాము గర్భం ధరించామన్న విషయం తొలినాళ్లలోనే తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.

వక్షోజాల పరిమాణం పెరగడం, నొప్పిగా అనిపించడం..

వికారం, వాంతులవడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలనిపించకపోవడం.

అలసట, నీరసం..

పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం..

హార్మోన్ల అసమతుల్యత వల్ల కొంతమందిలో కడుపునొప్పి, మలబద్ధకం, కడుపుబ్బరం.. వంటి సమస్యలు రావచ్చు..

మూడ్‌ స్వింగ్స్‌, ఒత్తిడి, ఆందోళన.. వంటివి కొంతమందిలో కనిపించచ్చు.

అరుదుగా కొంతమందిలో స్పాటింగ్‌ కూడా కనిపించచ్చు.. గర్భం ధరించాక 10 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాన్ని గుర్తించచ్చు.


ఆ ముప్పు తప్పుతుందట!

స్వీయ గర్భధారణ పరీక్షలో నెగెటివ్‌ అని తేలినా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ వద్ద గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా తొలినాళ్లలోనే ప్రెగ్నెన్సీని గుర్తించచ్చంటున్నారు. అంతేకాదు.. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ పలు ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు.

కొంతమంది మహిళలకు బీపీ, మధుమేహం.. వంటి సమస్యలుంటాయి. ఇలాంటి వారు గర్భం ధరించామన్న విషయం త్వరగా గుర్తిస్తే.. వాటి ప్రభావం పిండంపై పడకుండా డాక్టర్‌ సలహా మేరకు పలు జాగ్రత్తలు పాటించచ్చు.

చాలామంది డాక్టర్లు గత నెలసరి తేదీ, ఇప్పుడు పిరియడ్‌ మిస్సయిన తేదీ.. వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని.. ప్రసవ తేదీ (EDD)ని అంచనా వేస్తారు. అయితే గర్భధారణ విషయం ఆదిలోనే గుర్తిస్తే.. కచ్చితమైన ప్రసవ తేదీని నిర్ణయించచ్చంటున్నారు నిపుణులు. తద్వారా ప్రసవం కోసం టెన్షన్‌ పడకుండా సన్నద్ధమవ్వచ్చు.

కొంతమంది తల్లుల్లో జన్యుపరంగా పలు సమస్యలుంటాయి. ఫలితంగా వీటి ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడే ప్రమాదం ఎక్కువ. ఈ క్రమంలో బిడ్డలో శారీరక-మానసిక లోపాలు, అవకరాలు.. రావచ్చు. అదే గర్భధారణను త్వరగా గుర్తిస్తే.. ఆయా చికిత్సల ద్వారా పుట్టబోయే బిడ్డలో చాలావరకు ఇలాంటి సమస్యల్ని తగ్గించడం లేదా రాకుండా చేయచ్చంటున్నారు నిపుణులు.

కొంతమంది తల్లులు గతంలో నెలలు నిండకుండానే బిడ్డను ప్రసవించి ఉండచ్చు. అయితే ఈసారి ఆ సమస్య పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలంటే.. గర్భధారణను తొలినాళ్లలోనే గుర్తించడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ఆయా చికిత్సలు చేయడానికి వైద్యులకు తగిన సమయం దొరుకుతుంది.

క్రోమోజోమ్‌ అసాధారణతలు పుట్టబోయే బిడ్డలో మానసిక, శారీరక లోపాలకు కారణమవుతాయి. అయితే గర్భ నిర్ధారణను ఆలస్యం చేయకుండా త్వరగా గుర్తిస్తే.. ఈ సమస్యల్నీ ముందే గుర్తించి.. వీటి ప్రభావం బిడ్డపై పడకుండా కొంతవరకు జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

కొంతమంది గర్భిణులు, వారి కడుపులోని బిడ్డ ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువుంటారు. ముందు నుంచీ సరైన పోషకాహారం, సప్లిమెంట్లు వాడకపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. అదే గర్భధారణను ఆదిలోనే గుర్తించి పోషకాహార నిపుణుల సలహా మేరకు ఆయా పోషకాలుండే ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే.. ఆరోగ్యకరమైన బరువున్న బిడ్డకు జన్మనివ్వచ్చు.. ఇలా ఆయా దశల్లో పోషకాలన్నీ అందడం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని