Published : 16/01/2023 16:11 IST

స్కిన్ బ్రషింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలో..!

స్కిన్ బ్రషింగ్.. చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తూ నిగారింపు తీసుకొచ్చే వాటిలో ఇది కూడా ఒక పద్ధతి. మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రష్ లేదా స్పాంజిని ఉపయోగించి చర్మాన్ని శుభ్రపరిచే ఈ ప్రక్రియ వల్ల కేవలం సౌందర్యపరంగానే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. సరైన రక్తప్రసరణకు, మానసిక ప్రశాంతతకు.. ఇలా ఈ ప్రక్రియ వల్ల ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది. ఇంతకీ ఏంటి ఈ స్కిన్ బ్రషింగ్? దానివల్ల కలిగే ఉపయోగాలేంటి..? చూద్దాం రండి..

మెత్తని, పొడవాటి బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ఉపయోగించి చర్మంపై మృదువుగా రుద్దుతూ పైపొరల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు.. వంటి వాటిని తొలగించే ప్రక్రియనే ‘స్కిన్ బ్రషింగ్’ అంటారు. అలాగని ఇదేమీ అంత కష్టమైనదీ కాదు.. ఇందుకు వేరొకరి సహాయం కూడా అవసరం లేదు. ఎవరికి వారు సులభంగా బ్రషింగ్ చేసుకోవచ్చు.

ప్రయోజనాలివి..

స్కిన్ బ్రషింగ్ వల్ల చర్మంపై ఉండే మృతకణాలు, దుమ్ము, ధూళి.. వంటివి తొలగిపోవడమే కాదు.. రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు కూడా అంత తొందరగా దరి చేరవు. ఈ ప్రక్రియ వల్ల కేవలం సౌందర్యపరంగానే కాదు.. ఆరోగ్యపరంగా కూడా పలు ప్రయోజనాలున్నాయి.

స్కిన్ బ్రషింగ్ వల్ల చర్మం మెరిసిపోవడంతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రస్తుత జీవనశైలిలో ప్రతిఒక్కరికీ సమస్యగా మారుతోన్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఇది బాగా దోహదపడుతుంది.

అలాగే ఈ ప్రక్రియ చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కాబట్టి శరీరానికి ఇదో మంచి డీటాక్సిఫయర్ అని చెప్పుకోవచ్చు.

లింఫాటిక్ వ్యవస్థ మీద ప్రభావం చూపి శరీరంలోని మలినాలు బయటకు పోయేలా చేస్తుంది. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.

జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.

శరీరంలో ఒకేచోట కొవ్వులు పేరుకుపోకుండా కాపాడుతుంది. అలాగే బ్రషింగ్ వల్ల సెల్యులైట్ బారిన పడకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

ఎలా చేసుకోవాలి..?

సాధారణంగా చాలామంది పొడి చర్మం మీదే బ్రష్ లేదా స్పాంజ్ ఉపయోగించి బ్రషింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే దానికి బదులు స్నానం చేసే సమయంలోనే శరీరంపై ఒకసారి నీళ్లు పోసుకున్న తర్వాత కాస్త ఆరనిచ్చి ఆ తర్వాత స్కిన్ బ్రషింగ్ చేసుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న మలినాలు, మృతకణాలు.. చాలా సులభంగా తొలగిపోతాయి. అంతేకాదు.. చర్మం కూడా మృదువుగా తయారై, నిగారింపు సంతరించుకుంటుంది.

అయితే బ్రష్‌ని ఎప్పుడూ కూడా గుండె వైపుకి వచ్చే దిశలోనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదా: కాళ్లపై చర్మాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు బ్రష్ లేదా స్పాంజిని కింద నుంచి పైదిశగా అంటే గుండె వైపుగా వచ్చేలా ఉపయోగించాలి. అలాగే మెడ వద్ద శుభ్రం చేసుకునేటప్పుడు పై నుంచి కిందకు అంటే మెడ నుంచి ఎద భాగం వైపు ఉపయోగించాలి. ఇలా ఏ భాగంలో శుభ్రం చేసుకుంటున్నా బ్రష్ లేదా స్పాంజిని మాత్రం గుండె వైపుగానే ఉపయోగించడం మంచిది.

శరీరానికి పొడవాటి బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌ని లేదంటే స్పాంజిని ఉపయోగిస్తే ముఖానికి మాత్రం చిన్న చిన్న, మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌ని ఉపయోగించాలి. శరీరానికి ఉపయోగించిన బ్రష్ లేదా స్పాంజిని ముఖానికి వాడకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని