Hema Malini : 75 ఏళ్ల డ్రీమ్‌గర్ల్‌.. ఫిట్‌నెస్‌ రహస్యాలివే!

కొంతమంది వయసు పెరిగే కొద్దీ నీరసపడిపోతుంటారు.. మరికొందరు పెరిగే వయసుతో పాటే ఫిట్‌నెస్‌ను, ఉత్సాహాన్ని పెంచుకుంటూ పోతారు. బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌ హేమామాలిని రెండో కోవకు చెందుతారు.

Published : 25 Nov 2023 21:29 IST

(Photos: Twitter)

కొంతమంది వయసు పెరిగే కొద్దీ నీరసపడిపోతుంటారు.. మరికొందరు పెరిగే వయసుతో పాటే ఫిట్‌నెస్‌ను, ఉత్సాహాన్ని పెంచుకుంటూ పోతారు. బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌ హేమామాలిని రెండో కోవకు చెందుతారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసున్న ఆమె.. ఈ వయసులోనూ తన డ్యాన్స్‌ ప్రదర్శనలతో అదరగొట్టేస్తున్నారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ మథురలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆమె చేసిన నృత్య ప్రదర్శన అందరి చేతా చప్పట్లు కొట్టిస్తోంది. ఇక ఈ నృత్యంలో భాగంగా ఆమె ప్రదర్శించిన ముఖకవళికలు, హావభావాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీజీ కూడా ఈ సీనియర్‌ నటి చేసిన డ్యాన్స్‌ ప్రదర్శనను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. మరి, వయసు పెరుగుతున్నా ఇంత హుషారుగా ఆమె డ్యాన్స్‌ చేయడం వెనుక ఉన్న ఫిట్‌నెస్‌ రహస్యాలేంటో తెలుసుకుందాం రండి..

డ్యాన్స్‌తో అదరగొట్టారు!

హేమామాలిని.. బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌గా ఆమె మనందరికీ సుపరిచితురాలే! ఒకప్పుడు బాలీవుడ్‌ నటిగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్రస్తుతం భాజపా రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గ ఎంపీగా ఉన్న ఆమె.. శాస్త్రీయ నృత్యకారిణి కూడా! ఈ క్రమంలోనే ప్రత్యేక సందర్భాల్లో నృత్య ప్రదర్శనలిస్తుంటారు హేమ. అలా ఇటీవలే మథురలో ‘బ్రజ్‌ రాజ్‌ మహోత్సవ్‌’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మరోసారి తన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారామె. శ్రీ కృష్ణుడి భక్తురాలైన మీరాబాయి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో.. స్టేజీపై మీరాబాయిగా నర్తించారు హేమ. ఇలా ప్రస్తుతం తన 75 ఏళ్ల వయసులో ఆమె చేసిన నృత్య ప్రదర్శన, పలికించిన హావభావాలు.. ‘వయసు కేవలం సంఖ్య మాత్రమే!’ అని మరోసారి నిరూపించాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆమె నృత్య ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ఈ వయసులోనూ ఆమె తన డ్యాన్స్‌ ప్రదర్శనతో అదరగొట్టారు..’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీజీ కూడా హేమ నృత్య ప్రదర్శనను తిలకించారు. ‘హేమా జీ నృత్య ప్రదర్శన మీరాబాయి జీవితాన్ని కళ్లకు కట్టింది..’ అంటూ ప్రశంసిస్తూ ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశారు.

ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌!

బాలీవుడ్‌ అలనాటి నటి హేమమాలినికి భరతనాట్యంలో ప్రవేశం ఉంది. కూచిపూడి, మోహినీఅట్టం వంటి నృత్యాల్నీ నేర్చుకున్నారామె. స్వయంగానే డ్యాన్స్‌ లవర్‌ అయిన ఆమె.. తన ఇద్దరు కూతుళ్లు ఈషా డియోల్‌, అహనా డియోల్‌లకూ ఒడిస్సీ నేర్పించారు. అయితే తనలో ఉన్న ఈ డ్యాన్స్‌ నైపుణ్యాలే తనను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతున్నాయంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు హేమ.

రోజూ ఉదయం యోగా సాధనతోనే రోజును ప్రారంభించడం తనకు అలవాటని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు హేమ. ‘యోగా, ధ్యానంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అందుకే నిద్ర లేవగానే నేను చేసే మొదటి పని ఇదే! ఈ రెండూ రోజంతటికీ కావాల్సిన శక్తిని, ప్రశాంతతను, ఉత్సాహాన్ని, ఫిట్‌నెస్‌ను నాకు అందిస్తాయి..’ అంటున్నారామె.

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందానికి, ఫిట్‌నెస్‌కు డ్రీమ్‌గర్ల్‌ పాటించే ఆహార నియమాలు కూడా ఓ కారణమే! ఈ క్రమంలోనే సీజనల్‌ పండ్లు, కాయగూరలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారట హేమ! ఇక రోజూ 2-3 లీటర్ల నీళ్లు తాగడం ఆమెకు అలవాటట!

గత 20 ఏళ్లుగా చక్కెరకు దూరంగా ఉంటున్నారట హేమ. దీనికి బదులుగా తేనె తీసుకోవడంతో పాటు.. గ్రీన్‌ టీ రోజులో తన మొదటి ఆహారమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారామె.

ఉపవాసం ఆరోగ్యానికెంతో మంచిది. దీనివల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోయి.. ఆరోగ్యంగా, చురుగ్గా మారచ్చు. అందుకే తానూ వారానికి రెండు రోజులు ఉపవాస దీక్ష చేస్తానంటున్నారు హేమ. ఈ సమయంలో అన్నం, చపాతీ, సెరల్స్‌, గింజ ధాన్యాలు, పండ్లు, పనీర్‌, కాయగూరలు.. వంటి ఆహార పదార్థాలకు ప్రాధాన్యమిస్తానంటున్నారు.

హేమమాలిని శాకాహారి. ఇదే తన అందానికి, ఫిట్‌నెస్‌కు కారణమంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు.

ఇక రాత్రి భోజనం 8 లోపే పూర్తిచేస్తానంటున్నారు హేమ. అది కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలే తీసుకుంటానంటున్నారు. అంతేకాదు.. ఈ సమయంలో నూనె పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉపయోగించి తయారుచేసిన పదార్థాల్ని పూర్తి దూరం పెడతానంటున్నారు.


డ్రీమ్‌గర్ల్‌.. అందం వెనుక..!

ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ అందం విషయంలో ఈ కాలపు అమ్మాయిలతో పోటీ పడుతున్నారు హేమ. ఇందుకు తాను పాటించే ఇంటి చిట్కాలే కారణమంటున్నారామె. ముఖ్యంగా పెరుగు, శెనగపిండి.. వంటి పదార్థాలతో ఫేస్‌ప్యాక్‌లు/ఫేస్‌మాస్కులు వేసుకోవడం ఆమెకు అలవాటట! ఇక మేకప్‌ విషయానికొస్తే మినరల్‌ మేకప్‌కే ప్రాధాన్యమిస్తుంటారట!

పాలను తన రోజువారీ సౌందర్య సంరక్షణ కోసం ఉపయోగిస్తుంటారు హేమ. ఈ క్రమంలో పాలను ఫేస్‌ప్యాక్‌లలో భాగం చేసుకోవడం, పాలతో ముఖం కడుక్కోవడం.. వంటివి చేస్తుంటారట! అంతేకాదు.. ఆవిరి పట్టడం కూడా తన సౌందర్య రహస్యాల్లో ఒకటని చెబుతున్నారీ డ్రీమ్‌గర్ల్‌.

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తుంటాయి చాలామందికి. కానీ 75 ఏళ్ల వయసులోనూ హేమామాలిని ముఖం ప్రకాశవంతంగా మెరిసిపోవడానికి.. ఆమె పాటించే అరోమా ఆయిల్‌ థెరపీనే కారణమట! ఈ క్రమంలో అత్యవసర నూనెలతో రోజూ ముఖానికి కాసేపు మర్దన చేసుకోవడం ఆమెకు అలవాటు!

రాత్రి పడుకునే ముందు మేకప్‌ తొలగించుకోవడం, నైట్‌ క్రీమ్‌ రాసుకోవడం తప్పనిసరిగా పాటిస్తారట హేమ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్