Maya Browne : రియల్‌ లైఫ్‌ ‘డిస్నీ’ ప్రిన్సెస్‌!

డిస్నీ పాత్రలంటే పిల్లలకు భలే ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలైతే డిస్నీ ప్రిన్సెస్‌ల్లా తమను తాము ఊహించుకుంటూ మురిసిపోతారు. ప్రత్యేక సందర్భాల్లో ఆయా పాత్రలను పోలినట్లుగా ముస్తాబవుతూ రాకుమార్తెల్లా మెరిసిపోతుంటారు. అమెరికాకు చెందిన మాయకు కూడా చిన్నతనం నుంచి డిస్నీ పాత్రలంటే మక్కువ.

Updated : 28 Mar 2024 17:48 IST

(Photos: Instagram)

డిస్నీ పాత్రలంటే పిల్లలకు భలే ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలైతే డిస్నీ ప్రిన్సెస్‌ల్లా తమను తాము ఊహించుకుంటూ మురిసిపోతారు. ప్రత్యేక సందర్భాల్లో ఆయా పాత్రలను పోలినట్లుగా ముస్తాబవుతూ రాకుమార్తెల్లా మెరిసిపోతుంటారు. అమెరికాకు చెందిన మాయకు కూడా చిన్నతనం నుంచి డిస్నీ పాత్రలంటే మక్కువ. అదెంతలా అంటే తన స్కూల్లో ‘ఫ్యాన్సీ డ్రస్‌ కాంపిటీషన్‌’ జరిగిన ప్రతిసారీ ఏదో ఒక డిస్నీ ప్రిన్సెస్‌ పాత్రలో రడీ అయి వెళ్లేంతలా! ఇలా ఈ ఇష్టమే ఆమెను ‘కాస్‌ప్లే గర్ల్‌’గా కెరీర్‌ను ఎంచుకునేలా చేసింది. ప్రస్తుతం ఇటు ఈ వృత్తిలో రాణిస్తూనే.. అటు సోషల్‌ మీడియా స్టార్‌గానూ పేరు తెచ్చుకున్న మాయ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

మాయది అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌. ఆమెకు చిన్న వయసు నుంచి డిస్నీ షోలన్నా, అందులోని పాత్రలన్నా చాలా ఇష్టం. ఆ పాత్రల్లాగే పెద్దయ్యాక తాను కూడా డిస్నీ ప్రిన్సెస్‌ కావాలని కలలు కనేది. ఇక స్కూల్లో ఎప్పుడు ఫ్యాన్సీ డ్రస్‌ కాంపిటీషన్‌ జరిగినా.. తనకు నచ్చిన డిస్నీ ప్రిన్సెస్‌ పాత్రలో ముస్తాబై వెళ్లేది మాయ. వారానికోసారి సివిల్‌ డ్రస్‌ ధరించే రోజుల్లోనూ డిస్నీ పాత్రల్లోనే రడీ అయి స్కూల్లో అందరినీ ఆశ్చర్యపరిచేది. ఇలా ఈ పాత్రల్లో అందంగా ముస్తాబై అందరి మన్ననలు అందుకునేది మాయ.

తొలి అవకాశం అలా!

ఇలా పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆయా డిస్నీ పాత్రల్లా రడీ అవడంలో ఆరితేరింది మాయ. ఆపై బాడీ పెయింటింగ్‌ కళనూ నేర్చుకుంది. ఇలా తాను వేసిన డిజైన్లనూ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ నెటిజన్ల ఆదరాభిమానాల్ని చూరగొందామె. డిస్నీ పాత్రలు, బాడీ పెయింటింగ్‌పై తనకున్న ఈ మక్కువే కాస్‌ప్లే గర్ల్‌గా కెరీర్‌ను ఎంచుకునేలా చేసిందంటోంది మాయ.
‘డిస్నీ పాత్రల్లో ప్రిన్సెస్‌ జాస్మిన్‌, మోనా, మిరాబెల్‌, ఏరియల్‌.. వంటి మహిళా పాత్రలంటే నాకు బాగా ఇష్టం. సందర్భం వచ్చినప్పుడల్లా వీరిలా ముస్తాబై నన్ను నేను డిస్నీ ప్రిన్సెస్‌లా ఊహించుకునేదాన్ని. ఈ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రతిసారీ నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చేది. ‘రియల్‌ లైఫ్‌ డిస్నీ ప్రిన్సెస్‌’ అంటూ చాలామంది ప్రశంసించేవారు. దాంతో నాలో ఆత్మవిశ్వాసం మరింతగా రెట్టించింది. భవిష్యత్తులో ఇదే వృత్తిలో స్థిరపడాలనుకున్నా. ఈ క్రమంలోనే 2022 ఫిబ్రవరిలో కాస్‌ప్లే గర్ల్‌గా ఓ పిల్లల పార్టీని హోస్ట్‌ చేసే తొలి అవకాశం నన్ను వరించింది. ఇక అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూడలేదు..’ అంటోంది మాయ.

పిల్లల పార్టీల్లో ప్రిన్సెస్‌లా!

గత రెండేళ్లుగా రియల్‌ లైఫ్‌ ప్రిన్సెస్‌గా పిల్లల పార్టీలు నిర్వహించే హోస్ట్‌గా వరుస అవకాశాలు అందుకుంటోంది మాయ.

‘ఎలాంటి డిస్నీ పాత్రలోనైనా నేను సులభంగా ఇమిడిపోగలను.. పార్టీకి తగినట్లుగా ప్రధాన పాత్రల్లో నేను ముస్తాబవడం, పిల్లల్నీ విభిన్న పాత్రల్లో ముస్తాబు చేయడం, వారిని సరదాల్లో ముంచెత్తడం, వారితో ఆడుకోవడం, కథలు చెప్పడం, ఫొటోలు దిగడం.. ఇలా ఆ పార్టీ వాతావరణం ఎంతో సందడిగా మారుతుంటుంది. డిస్నీ ల్యాండ్‌కు వెళ్లలేని పిల్లలకు ఈ తరహా పార్టీలు బోలెడన్ని సరదాల్ని పంచుతాయి. ఆ ప్రదేశాన్ని సందర్శించినన్ని అనుభూతులు వారి సొంతమవుతాయి. పార్టీ జరిగినంత సేపు చిన్నారులంతా నన్నే వాళ్ల డిస్నీ ప్రిన్సెస్‌గా భావిస్తూ.. నా చుట్టూనే తిరుగుతుంటారు. ఇక పార్టీ ముగిశాకా.. నన్ను వెళ్లనివ్వకుండా అడ్డుపడుతుంటారు.. నన్ను గట్టిగా కౌగిలించుకుంటూ ఎమోషనల్‌ అవుతుంటారు. ఇవన్నీ నాకు ప్రత్యేకమైన అనుభూతులే!’ అంటోన్న మాయ.. ప్రస్తుతం కాస్‌ప్లే గర్ల్‌గా రోజుకు రెండు పార్టీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే గంటకు రూ. 8 వేలు సంపాదిస్తోంది. ఒకవేళ పార్టీకి పార్టీకి మధ్య సమయం లేకపోతే.. పార్టీ థీమ్‌కి తగినట్లుగా కార్లోనే డిస్నీ ప్రిన్సెస్‌లా రడీ అయి మేకప్‌ వేసేసుకుంటానంటోంది మాయ. మొత్తానికి తనకు నచ్చిన ఈ వృత్తిని ఎంతగానో ఆస్వాదిస్తున్నానంటోన్న ఈ రియల్‌ లైఫ్‌ ప్రిన్సెస్‌.. తన మేకప్‌, డిస్నీ ప్రిన్సెస్‌ పాత్రలతో సోషల్‌ మీడియాలోనూ క్రేజ్‌ను సంపాదించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్