Kangaroo Care: గుండెలకు ఇలా హత్తుకుంటే ఎన్ని ప్రయోజనాలో..!

తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారుల్ని కొన్నాళ్ల పాటు ఇంక్యుబేటర్‌లో పెట్టడం మనకు తెలిసిందే! అయితే ఇప్పుడంటే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. మరి, పాత కాలంలో ఇలాంటి నవజాత శిశువుల్ని సంరక్షించడానికి ఏం చేసేవారు? అనే సందేహం....

Published : 05 Sep 2023 12:32 IST

తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారుల్ని కొన్నాళ్ల పాటు ఇంక్యుబేటర్‌లో పెట్టడం మనకు తెలిసిందే! అయితే ఇప్పుడంటే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. మరి, పాత కాలంలో ఇలాంటి నవజాత శిశువుల్ని సంరక్షించడానికి ఏం చేసేవారు? అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. అందుకు సమాధానమే ఈ ‘కంగారూ మదర్‌ కేర్‌’. నిజానికి ఇప్పుడిప్పుడే ఈ పద్ధతికి మన దేశంలో ఆదరణ పెరుగుతున్నప్పటికీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇది ఎప్పట్నుంచో అందుబాటులో ఉందని చెప్పచ్చు. ఇందులో భాగంగా తల్లి నులివెచ్చటి స్పర్శ ద్వారా బిడ్డలోని అనారోగ్యాలు దూరమవడమే కాదు.. తల్లీబిడ్డల మధ్య అనుబంధమూ రెట్టింపవుతుందంటున్నారు నిపుణులు. అందుకే పిల్లలు తల్లిపాలు తాగకపోయినా, వారిలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా ప్రస్తుతం డాక్టర్లు ఇదే పద్ధతిని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఈ పద్ధతిని ఎలా పాటించాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? మనమూ తెలుసుకుందాం రండి..

కంగారూ మదర్‌ కేర్‌.. కంగారూ తన పిల్లల్ని ఎలాగైతే తన పాకెట్‌లో దాచుకుంటుందో.. అలాగే తల్లి కూడా తన బిడ్డను పొత్తిళ్లకు హత్తుకోవడమే ఈ పద్ధతి ముఖ్యోద్దేశం. నిజానికి ఈ పద్ధతి మన దేశంలోకి ప్రవేశించి కొన్నాళ్లే అయినా.. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉందని చెప్పచ్చు. కొలంబియాలోని బొగొటాలో ఓ ఆస్పత్రిలో దీన్ని మొదటిసారి ఉపయోగించారట! ఆ ఆస్పత్రిలో ఎక్కువమంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు రావడం, దాంతో ఇంక్యుబేటర్ల కొరత ఏర్పడడం వల్ల ఆ తల్లీపిల్లలతో కంగారూ కేర్‌ పద్ధతిని పాటింపజేశారు. దీంతో పిల్లలకు ఇంక్యుబేటర్ల అవసరం గణనీయంగా తగ్గిందని.. ఈ పద్ధతి వల్ల శిశు మరణాల రేటు 70 నుంచి 30 శాతానికి పడిపోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. దీంతో ఇతర దేశాల్లోని వైద్యులూ తమ ఆస్పత్రుల్లో ఈ పద్ధతిని అమలు చేయడం మొదలుపెట్టారు.


ఎలా చేయాలి?

నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారులు, తక్కువ బరువుండే శిశువులకు ఈ పద్ధతి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా..

✮ తల్లి ముందు వైపు బటన్స్‌ ఉండే (ఫ్రంట్‌ ఓపెనింగ్‌) టాప్‌ వేసుకోవాలి. బిడ్డకు కూడా డ్రస్‌ పూర్తిగా తొలగించాలి.. డైపర్‌ ఉంచినా పర్లేదు.

✮ పాపాయిని చేతుల్లోకి తీసుకునే ముందు తల్లి సబ్బు నీటితో చేతుల్ని కడుక్కోవడం లేదంటే శానిటైజ్‌ చేసుకోవడం మర్చిపోకూడదు.

✮ ఆ తర్వాత బిడ్డను తల్లి తన రెండు రొమ్ముల మధ్య పడుకోబెట్టుకోవాలి. ఆపై బేబీని తల్లి తన డ్రస్‌తో ర్యాప్‌ చేసేయాలి. అంటే ఒకే టాప్‌లో తల్లీబిడ్డా ఒదిగిపోవడమన్నమాట!

✮ ఈ పొజిషన్‌లో కాసేపు సేదదీరాలి. ఈ పద్ధతిని సోఫాకు బదులుగా మంచంపై పడుకొని చేస్తే బిడ్డ అటూ ఇటూ దొర్లకుండా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.

కేవలం తల్లులే కాదు.. తండ్రులు కూడా తమ బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో కావచ్చంటున్నారు నిపుణులు. ఇలా రోజుకి కనీసం ఓ గంటసేపైనా చేయడం మంచిదని చెబుతున్నారు. అయితే శిశువుల్లో ఇతరత్రా తీవ్ర అనారోగ్యాలున్నా, మరీ ముందు నెలల్లో జన్మించిన పిల్లల విషయంలో ఈ పద్ధతి పనిచేయదంటున్నారు. ఏదేమైనా ఓసారి ముందుగా వైద్యుల సలహా తీసుకున్నాకే ఈ కంగారూ కేర్‌ పద్ధతిని ఇంట్లో రోజూ ప్రాక్టీస్‌ చేయడం మరీ మంచిది!


తల్లీబిడ్డలిద్దరికీ ఎన్నో ప్రయోజనాలు!

కంగారూ మదర్‌ కేర్ పద్ధతిలో భాగంగా తల్లి శరీరంలోని వెచ్చదనం పాపాయికి తాకుతుంది. ఈ స్పర్శ తల్లీబిడ్డలిద్దరికీ బోలెడన్ని ప్రయోజనాల్ని అందిస్తుందంటున్నారు నిపుణులు.

✮ నెలలు నిండకుండా జన్మించిన చిన్నారుల్లో శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. తద్వారా వారిలో జీవక్రియల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి వారి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేయడానికి తల్లి గర్భంలో ఉన్నట్లుగా వెచ్చదనాన్ని చిన్నారికి అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంగారూ కేర్‌ పద్ధతి చక్కగా దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.

✮ ఇంక్యుబేటర్‌లో ఉంచిన నవజాత శిశువుల కంటే కంగారూ కేర్‌ పద్ధతిలో సంరక్షించిన నవజాత శిశువుల్లో.. వారి కౌమార దశలో మెదడు పనితీరు అద్భుతంగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.

✮ తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులు బరువు పెరగడానికీ ఈ పద్ధతి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తల్లి శరీరం నుంచి వారికి వెచ్చదనం అందుతుంది కాబట్టి వారి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శక్తి అవసరం ఉండదు. కాబట్టి ఆ శక్తి వారి ఎదుగుదలకు ఉపయోగపడి క్రమంగా వారు బరువు పెరుగుతారట!

✮ కొంతమంది పిల్లలు ఎంత ప్రయత్నించినా తల్లిపాలు తాగరు. అలాంటి చిన్నారులకు ఈ పద్ధతి చక్కగా దోహదం చేస్తుందట! అదెలాగంటే.. పసి పిల్లలకు సహజంగానే తమ తల్లి వాసనను పసిగట్టే సామర్థ్యం ఉంటుందట! దాంతో బిడ్డను ఛాతీపై పడుకోబెట్టుకున్నప్పుడు వారు చనుమొనల్ని వెతికి.. తద్వారా వారికి పాలు తాగడం అలవాటవుతుందని చెబుతున్నారు నిపుణులు.

✮ పసిపిల్లల్లో ఉండే శ్వాస సంబంధిత సమస్యల్ని దూరం చేయడానికి శ్వాస సంబంధిత పరికరాలకు బదులుగా కంగారూ కేర్‌ పద్ధతిని ఉపయోగిస్తే 48 గంటల్లోనే మెరుగైన ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ పద్ధతి వల్ల వారిలో గుండె కొట్టుకునే రేటు నియంత్రణలోకి వచ్చి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని మరో అధ్యయనంలో రుజువైంది.

✮ నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.. అలాగే వారు పాలు కూడా సరిగ్గా తాగలేరు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలంటే కంగారూ కేర్‌ పద్ధతిని మించింది మరొకటి లేదట!

✮ కంగారూ కేర్‌ వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్లు తగ్గిపోయి.. క్రమంగా చనుబాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు నిపుణులు. ఇలా ఎక్కువ పాలు ఉత్పత్తయితే.. చిన్నారికి పోత పాలు పట్టాల్సిన అవసరం ఉండదు. తద్వారా పసి వారిలోనూ ఇమ్యూనిటీ పెరుగుతుంది.

✮ పసి పిల్లలు ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత త్వరగా పెరుగుతారంటారు. అయితే నెలలు నిండకుండా జన్మించిన పిల్లలకు తల్లి శరీర స్పర్శ, ఆ వెచ్చదనం వారిలో నిద్రను మరింతగా ప్రేరేపిస్తుందట! ఇలా రోజుకు పది నిమిషాలు పడుకోబెట్టుకున్నా చాలంటున్నారు నిపుణులు.

✮ తల్లుల్లో ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించడానికి కంగారూ కేర్‌ పద్ధతి తోడ్పడుతుందని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. ఇలా తల్లీబిడ్డలిద్దరి శరీరాలు తాకడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గి.. లవ్‌ హార్మోన్‌ ఆక్సిటోసిన్‌ విడుదలవుతుంది.. ఇది మనసును ప్రశాంతపరుస్తుంది. ఇలా ప్రసవానంతర ఒత్తిడి, ఆందోళనలకు చెక్‌ పెట్టచ్చు.

రోజుకు ఒకటి లేదా రెండుసార్లు.. కనీసం గంట నుంచి రెండు గంటల పాటు తల్లిదండ్రులిద్దరూ తమ చిన్నారితో ఈ పద్ధతిని పాటించచ్చంటున్నారు నిపుణులు. అలాగని ఈ సమయంలో ఫోన్‌ మాట్లాడడం, టీవీ చూడడం, మొబైల్‌లో గేమ్స్‌ ఆడడం.. వంటి పనులు చేయకుండా, పూర్తిగా పాపాయితోనే గడిపేందుకు కేటాయించమంటున్నారు. తద్వారా ఇటు మీ చిన్నారి, అటు మీరు ఇద్దరూ రిలాక్సవుతారు. ఇది తల్లీబిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్